
గళమెత్తిన జర్నలిస్టులు
‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని...
- ఏపీ సచివాలయం, డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా
- చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు
- టీ న్యూస్‌కు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టులు శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. టీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘బ్రీఫ్డ్ బాబు డౌన్ డౌన్, బ్రీఫ్ కేసు బాబు డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఏపీ సీఎం కార్యాలయం వైపు చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా పోలీసులు, జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో ఎల్ బ్లాక్‌కు వెళ్లేదారిలో మీడియా పాయింట్ వద్దే జర్నలిస్టులు బైఠాయించారు. అవినీతికి పాల్పడినవారిపై కథనాలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉందని, ఈ హక్కును ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద..
ఏపీ సచివాలయం ధర్నా కంటే ముందుగా లక్డీకాపూల్‌లోని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం వద్ద కూడా తెలంగాణ జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీ-న్యూస్ చానెల్ ఉద్యోగులతో పాటు పలు పాత్రికేయ, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రానికి వచ్చి ఎవరికైనా నోటీసులు ఇవ్వాలంటే ఆ రాష్ట్ర పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, దీన్ని విశాఖపట్నం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. నిరసనకారుల్ని అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఇది చంద్రబాబు వ్యక్తిగత సమస్య: అల్లం నారాయణ
ఏపీ సీఎం చంద్రబాబు.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి తన వ్యక్తిగత సమస్యను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ విమర్శించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడేందుకు తెలుగువారి మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతికిపాల్పడిన వారిపై కథనాలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉందన్నారు. దీనికి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తక్షణమే సాక్షి, టీ న్యూస్ చానెళ్లకు జారీ చేసిన నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీహెచ్‌ఎంఈయూ మద్దతు
జర్నలిస్టుల ధర్నాకు జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబునాయుడికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. వెన్నుపోటు చరిత్ర నీదైతే ఉద్యమాల చరిత్ర తెలంగాణ బిడ్డలదన్నారు.