ఏపీ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు

Aarogya Setu App is Mandatory For All AP Secretariat Employees - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ‌ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్‌ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. హై రిస్క్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.

విధులకు వచ్చే ఉద్యోగులు కచ్చితంగా థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు, మాస్కులు వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులతో పాటు సచివాలయ సందర్శనకు వచ్చే వారిని కూడా ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ ఉంటేనే అనుమతించాలని, లేదంటే అనుమతించరాదన్నారు. దీన్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా సచివాలయ చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌కు సూచించారు. సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బ్లాక్‌ ప్రవేశం ద్వారం వద్దే థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు చేతులను శానిటైజ్‌ చేసుకోవాలన్నారు. (ఆరోగ్య సేతుభద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ)

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కార్యాలయానికి బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను యాప్‌లో స్టోర్‌ చేయాలి. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్‌’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. కాగా కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరోగ్య సేతు అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తే కరోనా వ్యాప్తిని పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. (ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top