AP: చర్చలకు సరే | Committee of Ministers talks with employees unions in Secretariat 1st Feb | Sakshi
Sakshi News home page

AP: చర్చలకు సరే

Published Tue, Feb 1 2022 5:27 AM | Last Updated on Tue, Feb 1 2022 8:33 AM

Committee of Ministers talks with employees unions in Secretariat 1st Feb - Sakshi

సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలను రద్దు చేస్తే కానీ మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. మంత్రుల కమిటీ నుంచి తమకు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళతామని సోమవారం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మంత్రుల కమిటీ నుంచి వారికి లిఖితపూర్వక ఆహ్వానం అందడంతో ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్‌ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్‌ హాలులో సమావేశానికి రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీకి పంపిన ఆహ్వానంలో సూచించారు.

చర్చలకు సిద్ధమే: స్టీరింగ్‌ కమిటీ 
మంత్రుల కమిటీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ, ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

పాత జీతాలే ఇవ్వాలని కోరతాం: బొప్పరాజు
ఈనెల 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా భాను నగర్‌ చేరుకుని సభ నిర్వహిస్తామన్నారు. 7వతేదీ నుంచి సమ్మె తలపెట్టిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్‌ న్యాయవాదులు వైవీ రవి ప్రసాద్, సత్యప్రసాద్‌లను నియమించుకున్నామని తెలిపారు. కొత్త జీవోలను నిలిపివేసి పాత జీతాలే చెల్లించాలని చర్చల్లో కోరతామన్నారు. 

మేం రాలేదనడం సరికాదు: బండి
ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ పేర్కొనడం సరికాదని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. స్టీరింగ్‌ కమిటీలోని 9 మంది సభ్యులంతా చర్చలకు సంబంధించిన అంశంపై సంతకాలు చేసి పంపినట్లు తెలిపారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో అర్ధం కావడం లేదన్నారు. రివర్స్‌ పీఆర్సీతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. 

భయపెట్టేలా మెమోలు: సూర్యనారాయణ
తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కోరారు. జీతాల చెల్లింపుపై అధికారులు భయపెట్టే విధంగా ఖజానా శాఖ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆటవిక చర్యని విమర్శించారు. ఆర్ధికశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని, అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖలోని ఐఏఎస్‌ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రింటెడ్‌ చార్జీ మెమోలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సీసీఏ రూల్‌ 20 ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్‌ రిజిస్టర్‌ లేకుండా పే ఫిక్సేషన్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చలో విజయవాడ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పరిశీలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement