రాసింది అరబిక్‌.. రిజల్ట్‌ వచ్చింది ఉర్దూకు

Another student is worried with Inter Board - Sakshi

అదీ సున్నా మార్కులంటూ ఫలితాలు వెల్లడి 

ఇంటర్‌బోర్డు తీరుతో మరో విద్యార్థిని ఆవేదన  

నల్లగొండ: ఇటీవల ఇంటర్‌బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోవడంతో నష్టపోయిన విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థిని.. రాసింది ఒక సబ్జెక్ట్‌ అయితే మరో సబ్జెక్టులో పరీక్ష రాసినట్లుగా రిజల్ట్‌ ఇవ్వడంతోపాటు ఆ పరీక్షలో కూడా సున్నా మార్కులు వచ్చాయంటూ మెమోలో పేర్కొన్నారు. విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ పట్టణానికి చెందిన నౌషీన్‌ గతేడాది ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. అయితే యునానీ మెడిసిన్‌ చదవాలన్న ఉద్దేశంతో ఎక్స్‌టర్నల్‌ లాంగ్వేజీ కింద ఫిబ్ర వరి 27, 28న అరబిక్‌ ఫస్ట్, సెకండ్‌ పేపర్‌లకు పరీక్ష రాసింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో మాత్రం నౌషీన్‌ రాసిన అరబిక్‌ పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలకు సంబంధించి రిజల్ట్‌ ఇవ్వలేదు. ఆమె ఉర్దూ పరీక్ష రాసినట్లుగా, పేపర్‌–1, 2లో సున్నా మార్కులు వచ్చాయంటూ మెమోలు విడుదల చేశారు.  

మరో సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది.. 
యునానీ మెడిసిన్‌ చదవాలన్న ఉద్దేశంతో ఎక్స్‌టర్నల్‌ లాంగ్వేజీగా అరబిక్‌ పరీక్ష రాశానని, దానికి రిజల్ట్‌ ఇవ్వకపోగా వేరే పరీక్షలో సున్నా మార్కులు వచ్చాయంటూ ఫలితాలు రావడంతో తాను చాలా నష్టపోతున్నానని నౌషీన్‌ ‘సాక్షి’కి తెలిపింది. ‘ప్రస్తుతం నేను రాసిన అరబిక్‌ పరీక్ష పాస్‌ అయ్యానో.. లేదో తెలియదు. ఒకవేళ తిరిగి పరీక్ష ఫీజు చెల్లిద్దామన్నా ఈనెల 25 వరకే చివరి తేదీ. నేను రాయని ఉర్దూ పరీక్షకు సున్నా మార్కులు వచ్చాయి. నేను అడ్వాన్స్‌ పరీక్ష ఫీజు చెల్లించాలన్నా ఆన్‌లైన్‌లో ఉర్దూ అనే చూపిస్తుంది. అరబిక్‌ లాంగ్వేజ్‌ చూపించడం లేదు. దీంతో రీవాల్యుయేషన్‌ పెట్టుకున్నా ఆలస్యమవుతుంది. దానివల్ల మరోఏడాదిపాటు చదువు ఆగిపోతుంది’ అని పేర్కొంది. బోర్డు అధికారులకు తనకు న్యాయం చేయాలని నౌషీన్‌ కోరుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top