‘బాలె’కు ఆదరణ భలే

American Dance BALE in Hyderabad - Sakshi

అమెరికా నృత్యకారిణి టేలర్‌ గార్డెన్‌

సాక్షి, సిటీబ్యూరో: పాశ్చాత్య నృత్యశైలి ‘బాలె’కు నగరంలో ఆదరణ బాగుందని అమెరికాకు చెందిన ప్రముఖ నృత్యకారిణి టేలర్‌ గార్డెన్‌ అన్నారు. రానున్న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న నగరంలోని రవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వనున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ వివరాలను బుధవారం బంజారాహిల్స్‌లోని స్టెప్స్‌ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వెల్లడించారు. బాలెలో శిక్షణ పొందిన సిటీ చిన్నారులతో కలిసి ఈ ప్రదర్శన ఇవ్వనున్నామన్నారు.

గత మూడేళ్లుగా నగరానికి వస్తున్నానని, పాశ్చాత్య నృత్యాల పట్ల ఇక్కడి టీనేజీ యువత చూపుతున్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోందన్నారు. అమెరికా సంప్రదాయ నృత్యమైన బాలెలో నిష్ణాతులు కావడమనేది అంత సులభమైన విషయం కాదని, అయినప్పటికీ సిటీ చిన్నారులు ముందుకువస్తున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కూడా తన వద్ద శిక్షణ పొందుతున్న వారున్నారన్నారు. గత ఏడాది బతుకమ్మ నృత్యాన్ని బాలెతో మేళవించి సమర్పించిన ప్రదర్శన తనకు మరచిపోలేని అనుభవమన్నారు. నగరంతో మరింత అనుబంధం పెంచుకోవాలని ఆశిస్తున్నానని, తెలుగు సినిమాలో అవకాశం వస్తే పాశ్చాత్య నృత్యగీతాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమన్నారు. సమావేశంలో స్టెప్స్‌ నిర్వాహకుడు పృథ్వీ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top