రోశయ్యను వదలని అమీర్‌పేట భూవివాదం కేసు

Ameerpet Land Case: Rosaiah in fresh trouble - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను అమీర్‌పేట భూ కేటాయింపుల వివాదం వదిలేలా లేదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా గవర్నర్‌గా ఎన్నో హోదాల్లో పని చేసిన ఆయనను ఈ కేసు నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ భూ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి రోశయ్యపై వచ్చిన ఆరోపణలను ఆరు నెలల్లోగా తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో అమీర్‌పేటలో ఉన్న హెచ్‌ఎండీఏ భూమిని డీనోటిఫై చేసి 9.14 ఎకరాలను కొందరికి కేటాయించారు. దీనిపై అప్పట్లోనే వివాదం తలెత్తింది. 2009-10 మధ్యలో రోశయ్యమీద భూవివాదం కేసు నమోదు అయ్యింది. ఏసీబీ కోర్టు సమన్లు కూడా ఇచ్చింది. అనంతరం ఆయనకు ఏసీబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

ఆ తర్వాతి కాలంలో రోశయ్య గవర్నర్‌ కావడం, సమన్లను హైకోర్టులో సవాలు చేయడంతో న్యాయస్థానం వాటిపై స్టే ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రోశయ్యకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మార్చి 2016లో మోహన్‌లాల్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పలు వాయిదాల తర్వాత విచారణకు వచ్చిన ఈ కేసులో సుప్రీంకోర్టు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ కేసును విచారణ జరుపుతామని జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఎంతో విలువైన భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాథమికంగా పరిశీలించిన కోర్టు.. ఈ కేసు తీవ్రమైందని వ్యాఖ్యానించింది. మరింత లోతుగా విచారించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో కేసు ముగించాలని కూడా తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top