'సభా గౌరవం పెంచేలా ఉండాలి' | All india committee leaders Observed about Governor speech video footage | Sakshi
Sakshi News home page

'సభా గౌరవం పెంచేలా ఉండాలి'

Mar 12 2015 3:40 AM | Updated on Jul 29 2019 6:58 PM

'సభా గౌరవం పెంచేలా ఉండాలి' - Sakshi

'సభా గౌరవం పెంచేలా ఉండాలి'

గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో సీడీలను శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సమక్షంలో బుధవారం అఖిలపక్ష నేతలు పరిశీలించారు.

* ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచన
* గవర్నర్ ప్రసంగ వీడియో ఫుటేజీని పరిశీలించిన అఖిలపక్షం
* సారీ చెప్తాం.. సస్పెన్షన్ ఎత్తేయండి: టీడీపీ
* నాలుగు కెమెరాల్లోని సీడీలను చూపించాలి: ప్రతిపక్షాల డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో సీడీలను శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సమక్షంలో బుధవారం అఖిలపక్ష నేతలు పరిశీలించారు. గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతాలాపన సందర్భంగా జరిగిన సంఘటనలను అఖిలపక్ష నేతలు పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పక్షాన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డి, హనుమంత్ షిండే హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున మల్లు భట్టి విక్రమార్క, టి.జీవన్ రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
 
 బీజేపీ నుంచి డాక్టర్ కె.లక్ష్మణ్, అలాగే రవీంద్రకుమార్(సీపీఐ), సున్నం రాజయ్య(సీపీఎం), టీడీపీ ఎమ్మెల్సీ ఎ.నర్సారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు బల్లలు ఎక్కడం, నినాదాలు చేయడం మాత్రమే ఆ వీడియో ఫుటేజీల్లో ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు వెల్లడించారు. టీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు వినిపిస్తున్నా ఆ వీడియో ఫుటేజీలను, ఆ సభ్యులు ఉన్న సీడీలను చూపించలేదని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న సీడీలను పరిశీలనకు అందించామని స్పీకర్ మధుసూదనాచారి చెప్పినట్టు తెలిసింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సంతృప్తి చెందలేదు.
 
 రెండు కెమెరాలద్వారా చిత్రీకరించిన వీడియో సీడీలను చూపిస్తే చాలదని, అసెంబ్లీలో ఉన్న నాలుగు కెమెరాల్లోని సీడీలను పరిశీలనకు ఉంచాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు చేసిన గొడవను మాత్రమే చూపిస్తున్నారని, గొడవకు కారణమైన అధికారపక్ష సభ్యులున్న సీడీలను కూడా చూపించాలని వారు కోరారు. టీఆర్‌ఎస్ సభ్యులు గొడవకు దిగినా తనతో మాత్రమే క్షమాపణ చెప్పించి, బలిపశువును చేశారని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ అసంతృప్తి వెలిబుచ్చారు. టీఆర్‌ఎస్ సభ్యులు కూడా సభా నియమాలను అతిక్రమించారని, వారితోనూ క్షమాపణ చెప్పించాలని ఆయన కోరారు. ఏదేమైనా అన్నిపార్టీల సభ్యులు శాసనసభ గౌరవాన్ని పెంచేవిధంగా వ్యవహరించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారి సూచించారు.
 
 సస్పెన్షన్ ఎత్తేయాలి: టీడీపీ
 శాసనసభలో పొరపాట్లు జరిగితే క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నామని, తమ పార్టీ సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఎ.నర్సారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ వీడియో సీడీల పరిశీలన సందర్భంగా ఆయన స్పీకర్‌తో మాట్లాడారు. ప్రతిపక్షపార్టీని బడ్జెట్ సమావేశాల్లో మొత్తం లేకుండా చేయడం మంచిది కాదన్నారు. పొరపాట్లు జరిగితే విచారం వ్యక్తం చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా దీనిపై స్పీకర్ హామీనేమీ ఇవ్వకుండా శుక్రవారం ఈ విషయంపై మాట్లాడుదామని చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement