పంచాయతీకో నర్సరీ | Sakshi
Sakshi News home page

పంచాయతీకో నర్సరీ

Published Sun, Aug 12 2018 10:43 AM

All Grama Panchayat In Nursery Programme In Adilabad - Sakshi

నేరడిగొండ(ఆదిలాబాద్‌): పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం..  గ్రామాలను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొ క్కలు నాటిస్తుండగా.. దీనిని ఉద్యమంలా కొనసాగించేందుకు ప్రతీ పంచాయతీలో న ర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. పాత పంచాయతీలతోపాటు కొత్త గ్రామపంచాయతీల్లోనూ మొక్కలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతులు నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను ఆ గ్రామ పరిధిలోని నర్సరీలోనే పెంచే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు అవసరమైన మొక్కల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. పంచాయతీ పరిధిలోని నర్సరీలో మొక్కలు పొందే విధంగా చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్‌ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు బాధ్యతను గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖలకు అప్పగించింది. జిల్లాలోని 467 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ పంచాయతీలో నర్సరీ ఉండాలని సూచనల్లో పేర్కొంది. దీంతో పాత, కొత్త గ్రామపంచాయతీల పరిధిలో నూతన నర్సరీలు ఏర్పాటు కానున్నాయి.
 
ఈ నెల 15లోగా ఏర్పాటు..

గ్రామాలను పచ్చని తోరణాలుగా మలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతీ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీని ఏర్పాటు చే స్తోంది. ఇప్పటివరకు మండలానికి రెండు నుంచి ఐదు నర్సరీలు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య ను పెంచి ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసే లా మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సూచించింది. ఈ నెల 15వ తేదీలోగా నర్సరీల వారీగా స్థలాలను నిర్ణయించి.. నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు వన సేవకులను కూడా గుర్తించాలని సూచించింది. ఆగస్టు 31లోగా ఎంపిక చేసిన నర్సరీ స్థలాల్లో నీటి సౌకర్యం, పైపులైన్‌ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు అవసరమైన టేకు స్టంప్స్, విత్తనాలు సిద్ధం చేసుకొని వాటిని నాటేందుకు పాలిథిన్‌ సంచులు సమకూర్చుకోవాల్సి ఉంది. సెప్టెంబర్‌ 15లోగా నర్సరీల్లో విత్తన బ్యాగులు ఏర్పాటు చేసేందుకు బెడ్స్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అక్టోబర్‌ 20లోగా పాలిథిన్‌ బ్యాగుల్లో మట్టిని నింపి సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అక్టోబర్‌ 31లోగా వాటిలో ఆయా పండ్ల విత్తనాలు, టేక్‌ స్టంప్స్‌ నాటాల్సి ఉంది.
 
467 నర్సరీలు.
జిల్లాలో 467 నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మండలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 20 నర్సరీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 నర్సరీలు పెంచేలా ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచనలు చేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 419 నర్సరీల్లో 99లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల్లో 41లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రకారం జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.

జనాభా ప్రాతిపదికన మొక్కల పెంపకం..
ప్రభుత్వం కొత్త పంచాయతీల్లో ఏర్పాటు చేసే న ర్సరీల్లో జనాభా ప్రాతిపదికన మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ పంచా యతీ పరిధిలో గ్రామాలు, స్థానికులు వినియోగించుకునేలా నర్సరీల్లో మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టింది. వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామంలో లక్ష మొక్కలు పెంచేలా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తే అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం శాతా న్ని పెంచాలని సూచించింది. గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసే నర్సరీల్లో మొక్కల పెంపకం స్థానికుల అభీష్టం మేరకే ఉండనున్నది. రైతుల పొలాల్లో నాటేందుకు, నివాస పరిసరాల్లో నాటేందుకు అనువైన మొక్కలు పెంచేందుకు ప్ర భుత్వం నిర్ణయించింది. స్థానిక రైతులు, ప్రజలు తమకు అవసరమైన మొక్కలను సూచిస్తే.. వాటిని మాత్రమే ఆ నర్సరీల్లో పెంచేలా ప్రణాళికలు రూపొందించింది. వీటిలో అత్యధిక శాతం పూలు, పండ్ల మొక్కలను మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొక్కల రక్షణకు గ్రామ కమిటీలు..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రక్షణకు ప్రభుత్వం గ్రామ కమిటీలు వేయనుంది. పంచాయతీ పరిధిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రామంలో మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగిన రైతులు, యువకులను ఇందులో సభ్యులుగా నియమించనుంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ, మొక్కల రక్షణ, పెంపకం అంతా కమిటీలే చూసుకోవాలి. వాటి నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వం భరించనుంది. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ పథకంలోని కూలీలను వినియోగించుకునేలా వీలు కల్పించింది.

కొత్త నర్సరీల ఏర్పాటుకు చర్యలు
ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో కొత్త నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసేలా ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మండలస్థాయి సిబ్బందికి సూచనలు చేశాం. ప్రభుత్వం విధించిన గడువులోగా జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాం. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో 419, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల ఏర్పాటుకు దాదాపు స్థలాల ఎంపిక పూర్తయ్యింది. ఆయా స్థలాల్లో అవసరమైన వసతులు త్వరితగతిన సమకూర్చి లక్ష్యాలను చేరుకుంటాం. – రాథోడ్‌ రాజేశ్వర్,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి

Advertisement
Advertisement