అవన్నీ అక్రమ స్టడీ సెంటర్లే | Sakshi
Sakshi News home page

అవన్నీ అక్రమ స్టడీ సెంటర్లే

Published Tue, Jul 24 2018 1:25 AM

That all are illegal study centers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణలో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లు నిర్వహించడానికి వీల్లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీ సీ) జారీ చేసిన నిబంధన ప్రకారం అవన్నీ అక్రమ స్టడీ సెంటర్లే. అందుకే వాటిల్లో చదివిన విద్యార్థుల డిగ్రీలను తిరస్కరిస్తున్నాం. అలాంటి స్టడీ సెంటర్లను ప్రోత్సహించే కాలేజీలపైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాం’’అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ‘దూర విద్య కేంద్రాల దందా’ శీర్షికన ఈ నెల 21న సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రాష్ట్ర విద్యార్థులు లక్షల మంది వాటిని నమ్మి మోసపోతున్న నేపథ్యంలో, విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు అలాంటి స్టడీ సెంటర్లపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 

నిబంధనల ప్రకారమే చర్యలు.. 
యూజీసీ జారీ చేసిన దూర విద్య కేంద్రాల టెరిటోరియల్‌ జ్యూరిస్‌డిక్షన్‌–2013 నిబంధనల ప్రకా రం ఒక రాష్ట్రంలోని రాష్ట్ర వర్సిటీ లేదా డీమ్డ్‌ వర్సి టీ లేదా ప్రైవేటు వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదు. వాటి ద్వారా కోర్సులను నిర్వహించకూడదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లకు 2013, ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్‌ విక్రమ్‌ సాహే లేఖ రాశారు. ఆ ప్రకారమే వారు విద్యార్థుల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం. కాకతీయ వర్సిటీ దూర విద్యా కేంద్రానికి చెందిన స్టడీ సెంటర్లను (ఇతర రాష్ట్రాల్లోని) రద్దు చేసుకున్నాం. నాగార్జున వర్సిటీ లాంటివి కొన్ని రాష్ట్రంలో ఇంకా సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఇక్కడి విద్యార్థులను మోసం చేస్తున్నాయి.  

‘విభజన చట్టం’వేరు.. ‘దూర విద్య’వేరు... 
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఉమ్మడి అవకాశాలు ఉంటాయి. అంటే ఏపీ విద్యార్థులు ఇక్కడి విద్యా సంస్థల్లో (ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌) ఓపెన్‌ కోటా సీట్లకు అర్హులు. ఇక్కడి విద్యార్థులు ఏపీలోని ఓపెన్‌ కోటా సీట్లకు అర్హులు. అసలు రాష్ట్ర విభజన చట్టం నిబంధనలకు.. దూర విద్య స్టడీ సెంటర్లకు సంబంధమే లేదు.  

అవి రాష్ట్రస్థాయి వర్సిటీలూ కాదు.. 
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేడ్కర్‌ ఓపెన్, పద్మావతి, అగ్రికల్చర్, ఫైన్‌ ఆర్ట్స్, ఎన్‌టీఆర్‌ హెల్త్, కాళోజీ హెల్త్‌ వర్సిటీలే రాష్ట్రస్థాయి సంస్థలు. తెలుగు, ఓపెన్, పద్మావతి వర్సిటీలు తెలంగాణ, ఏపీలో స్టడీ సెంటర్లను నిర్వహించవచ్చు. కాకతీయ, ఉస్మానియా, నాగార్జున, ఆంధ్రా వర్సిటీలు ప్రాంతీయ వర్సిటీలే. వాటికి ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించే హక్కు లేదు. తాము తెలంగాణలోని స్టడీ సెంటర్ల ద్వారా ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయన్నది పూర్తిగా తప్పు. 

నష్టపోకుండా చర్యలు 
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపడతాం. త్వరలోనే అన్ని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్లతో భేటీ అవుతాం. ఇతర రాష్ట్ర వర్సిటీలు ఇక్కడ సెంటర్లను నిర్వహించకుండా కార్యాచరణను రూపొందిస్తాం. అలాం టి స్టడీ సెంటర్లను నిర్వహించవద్దని కాలేజీలకు ఆదేశాలు జారీ చేయాలంటూ వర్సిటీలకు లేఖలు రాస్తాం. పట్టించుకోకుండా వ్యవహరిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తాం.

Advertisement
Advertisement