ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

AITUC State Secretary Talks In Press Meet Over TSRTC Strike In Adilabad  - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: బేషరతుగా సమ్మె విరమించుకున్న ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన యూనియన్‌ జిల్లా కౌన్సెలింగ్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమ్మె విరమించిన కార్మికులను డ్యూటీలోకి తీసుకోకుండా కాలయాపన చేయడం సమజసం కాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అలాగే రిమ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు సమానపనికి సమాన వేతనం అందించాలన్నారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు.  అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, ఆశా, కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలన్నారు. వీఆర్‌ఎస్‌ పేరిట లక్షలాది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని మానుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్, కుంటాల రాములు, రాజు, రఘునాథ్, ఉస్మాన్, నాందేవ్, ఆశన్న, కాంతరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
ఆసిఫాబాద్‌: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 49వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా స్థానిక బస్టాండు సమీపంలోని శిబిరంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్‌ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలన్నారు. సీఎం సూచన మేరకే కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ వల్లనే ఆర్టీసీకి లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్‌ చెప్పే విషయంలో వాస్తవం లేదన్నారు. దీక్షల్లో కార్మికులు ఉమేశ్, రాజేశ్వర్, లక్ష్మణ్, సురేశ్, జహూర్, తులసీరాం, రమేశ్, డేవిడ్‌తో పాటు పలువురు కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బూసి బాపు, దివాకర్, దేవపాల, శ్రీరాం వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. 

                             నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top