గజ్వేల్‌లో ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌

Airforce Recruitment in Gajwel - Sakshi

ఈనెల 26, 27, 28,మార్చి 1 తేదీల్లో ఎంపిక

సిద్దిపేట జోన్‌: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు గజ్వేల్‌ పట్టణంలో ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో డీఆర్వో చంద్రశేఖర్, ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బందితో కలసి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26, 27, 28 మార్చి 1 తేదీల్లో చేపట్టాల్సిన ర్యాలీలకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26న ఉదయం 5 గంటలకు గజ్వేల్‌ పట్టణంలోని ఐఓసీ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ వద్ద జరిగే ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావాలని వారు తెలిపారు.

25వ తేదీ సాయంత్రంలోగా గజ్వేల్‌ పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రావాలన్నారు. 26, 27 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, హైదరాబాద్‌ జిల్లాలోని అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావొచ్చన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించి ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 19 జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్య జన్మించి ఉండాలన్నారు. అన్ని ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. 5 నిమిషాల 40 సెకన్లలో 1.6 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. సమీక్షలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు యోగేష్‌ మూహ్ల, నరేందర్‌కుమార్, జోగేందర్‌సింగ్, ఏసీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top