రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ము గగన విహారం | President Murmu takes off in a Rafale Ambala Air Force Station | Sakshi
Sakshi News home page

రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ము గగన విహారం

Oct 29 2025 12:00 PM | Updated on Oct 29 2025 12:08 PM

President Murmu takes off in a Rafale Ambala Air Force Station

ఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) రఫేల్‌ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ద్రౌపది ముర్ము రఫేల్‌ (Rafale fighter jet)లో గగన విహారం చేశారు. వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక, గతంలో నాటి రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్‌ కలాం, ప్రతిభా పాటిల్‌ సైతం తమ హయాంలో వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించారు.

అయితే, ఏప్రిల్‌ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను పాక్‌ ముష్కరులు అత్యంత పైశాచికంగా దాడి చేసి ప్రాణాలు బలిగొనడం తెలిసిందే. దీనికి ప్రతిగా పాక్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో రాఫెల్‌ యుద్ధవిమానాలను సైన్యం అత్యంత సమర్థవంతంగా వినియోగించింది. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించారు. రాఫెల్‌ యుద్ధ విమానంలో ముర్ము సహ పైలట్‌గా పాల్గొన్నారు. గతంలో నాటి రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్‌ కలాం, ప్రతిభా పాటిల్‌ సైతం తమ హయాంలో వేర్వేరు యుద్ధవిమానాల్లో ప్రయాణించారు.

2006 జూన్‌ 8వ తేదీ సుఖోయ్‌–30ఎంకేఐ యుద్ధ విమానంలో కలాం ప్రయాణించారు. 2009 నవంబర్‌ 25న పుణె సమీపంలోని లోహెగావ్‌ వైమానిక స్థావరం నుంచి అదే సుఖోయ్‌–30ఎంకేఐ విమానంలో ప్రతిభా పాటిల్‌ ప్రయాణించారు. ముర్ము సైతం అస్సాంలోని తేజ్‌పూర్‌ వైమానిక స్థావరం నుంచి అదే విమానంలో ప్రయాణించి యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడో రాష్ట్రపతిగా, రెండో మహిళా ఉపరాష్ట్రపతిగా రికార్డ్‌ నెలకొల్పారు. ఫ్రాన్స్‌లోని దిగ్గజ విమానయాన రంగ సంస్థ దస్సాల్ట్‌ ఏవియేషన్‌ వారి రాఫెల్‌ యుద్ధ విమానాలను భారత్‌ కొనుగోలుచేసి 2020 సెప్టెంబర్‌లో అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో భారత వాయుసేనకు అందించింది. ఫ్రాన్స్‌ నుంచి తొలి విడతగా ఐదు రాఫెల్‌లు 2020 జూలై 27న భారత్‌కు ఎగిరొచ్చాయి. వాటిని 17వ స్కాడ్రాన్‌ అయిన ‘గోల్డెన్‌ ఆరోస్‌’లో భాగస్వాములుగా చేర్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement