వ్యాపార దృక్పథంతో వ్యవసాయం

Agriculture with business perspective - Sakshi

రైతు ఆదాయం రెట్టింపునకు కేంద్రం కీలక సిఫార్సులు 

అందుకోసం మార్కెటింగ్‌లో మౌలిక సదుపాయాల కల్పన 

ఉత్పాదకత పెరగాలి.. సాగు యాంత్రీకరణపై దృష్టి 

వ్యవసాయ రుణాలు పెరగాలి.. కేంద్ర సమగ్ర నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలని, అప్పుడే రైతుకు మెరుగైన ఆదాయం సమకూరుతుందని కేంద్రం కీలక సిఫార్సు చేసింది. రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికపై వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే కేవలం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపోదని, వ్యవసాయాన్ని వ్యాపారం వైపు బదలాయించాల్సిన అవసరముందని విశ్లేషించింది. వినియోగదారుడి అవసరాలే కేంద్రంగా వ్యవసాయం చేస్తే పెద్ద ఎత్తున లాభాలు గడించవచ్చని పేర్కొంది. అలాగే వ్యవసాయ రంగాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించాలని పేర్కొంది.

దేశంలో 85 శాతం మంది రైతులు సన్న, చిన్నకారు రైతులేనని, వారి చేతుల్లో అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి వారికి సాగు ఖర్చు తగ్గించేలా వ్యవసాయ యాంత్రీకరణ కల్పించాలని వివరించింది. దేశంలో వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేదు. 2011–12 నాటి లెక్కల ప్రకారం సాగుచేసే రైతు ఆదాయం ఏడాదికి రూ. 78,264 ఉంటే, వ్యవసాయ కూలీ ఆదాయం రూ. 32,311 ఉండగా, వ్యవసాయేతర కార్మికుడి ఆదాయం రూ. 2.46 లక్షలుగా ఉంది. మొదటి నుంచీ రైతు పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు. ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. దేశంలో మూడో వంతు రైతులు వరి లేదా గోధుమలే పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సిఫార్సులు చేసింది.

ప్రధాన సిఫార్సులు.. 
- యాంత్రీకరణను అందిబుచ్చుకుంటే ఉత్పాదకతలో ఉన్న భారీ తేడాను అధిగమించవచ్చు. దీనివల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూసుకోవచ్చు.  
సూక్ష్మసేద్యంతో ఉత్పాదకతను పెంచుకోవచ్చు. అలాగే సాగునీటి వసతులు కల్పిస్తే ఉత్పాదకత పెరుగుతుంది.  
అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను తయారు చేయడం వల్ల కూడా ఉత్పాదకత పెరుగుతుంది. దీనివల్ల రైతులకు అధిక ఆదాయం సమకూరుతుంది.  
వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల పరిశోధన, విస్తరణ రంగాలపై దృష్టి సారించాలి.  
ప్రస్తుత ధరల విధానాన్ని ఆధునీకరించాలి. గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో కేవలం వరి, గోధుమల మద్దతు ధరపైనే దృష్టి సారించారు. దీనివల్ల ఇతర ఆహారధాన్యాల సాగు, ఆదాయంలో అనేక తేడాలు కనిపించాయి. వాటి ధరలు తగ్గడంతో రైతులు ఆదాయం కోల్పోయారు.  
మార్కెట్‌లో ధరల తీరుపై రైతుకు ఎప్పటికప్పుడు అందించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించాలి.  
సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచితే వారి ఆదాయం కూడా పెరుగుతుంది.  
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గ్రామీణ రోడ్లు, విద్యుత్‌ సరఫరా, రవాణా సదుపాయాలు కల్పించాలి. తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించాలంటే ఇవన్నీ అవసరం. ఫలితంగా వారు అధిక ఆదాయం పొందుతారు.  
మార్కెట్లలోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల పంటల నాణ్యత పెరుగుతుంది. నష్టం తగ్గుతుంది. ప్రధానంగా నిల్వ, ట్రేడ్‌ రంగాల్లో అనేక మార్పులు తీసుకురావాలి.  
అత్యంత కీలకమైన రుణ సదుపాయం రైతుకు అందాలి. అప్పుడే పంటల సాగు, విత్తనాలు, ఎరువుల వంటి వాటికి ఇబ్బంది ఉండదు. ఈ విషయంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top