'చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాళ్లం'

Agricultural Officer Parasuram Naik Recalling Memories Of Childhood In Medak - Sakshi

వ్యవసాయ అధికారి పరశురాం నాయక్‌

సాక్షి, మెదక్‌ : చెరువు కట్టలపై పాటలు.. ఈత సరదాలు.. వర్షం కోసం ఎదురుచూపులు.. సినిమాలకు వెళ్లడం.. తరగతి గదిలో అల్లరి.. కోతికొమ్మచ్చి ఆటలు మరిచిపోలేనివని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్‌ తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బాల్యం ఓ మధురానుభూతి అని.. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడంతోపాటు ఆ రోజులే వేరుగా ఉండేవని.. తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

వరుస ఎన్నికలు.. ఎన్నికల కోడ్‌ ముగిసి ప్రభుత్వ పథకాల అమలులో బిజీగా ఉన్న పరశురాం ‘పర్సనల్‌ టైం’ ఆయన మాటల్లోనే..మొత్తం హాస్టళ్లలోనే  గడిచింది. పరకాల ఎస్టీ హాస్టల్‌లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు, అనంతరం వరంగల్‌ జిల్లా జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివాను. ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూరు రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్మీడియట్,  ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యాభ్యాసం పూర్తి చేశాను.

వివాహ నేపథ్యం..
2002 మేలో నాకు వివాహమైంది. భార్య రేఖతోపాటు కూతురు రిషిక, రిషబ్‌ ఉన్నారు. పాఠశాలలో చదువుకునే సమయంలో వేసవి సెలవులు ఇవ్వగానే ఎక్కువగా మా అమ్మమ్మ ఇల్లు కరీంనగర్‌ జిల్లా మహాముత్తారం మండలం, తెగెడపల్లి గ్రామానికి వెళ్తుండేవాడిని. చిన్నతనంలో చేసిన అల్లరి గుర్తుకొస్తే నవ్వు ఆపుకోలేకపోతాను.

సొంతంగా గుల్లేర్‌ తయార్‌..
గ్రామంలో ఎవరి పెళ్లిళ్లలో అయినా బ్యాండ్‌ బజాయించారంటే చాలు.. స్టెప్పులేసే వాడిని. చిన్నప్పుడు ఆడిన కోతికొమ్మచ్చి, గోలీలు, పరుగు పందేలు వంటివి మరిచిపోలేని అనుభూతులు. నా బాల్యం నాటకాలు, ఆటలు, పాటల మధ్య ఎంతో ఉల్లాసంగా గడిచింది. వర్షం ఎప్పుడు పడుతదా.. స్కూల్‌కు సెలవు ఎప్పుడు ఇస్తరా అని ఎదురుచూసే వాడిని. 

సినిమాలంటే ఇష్టం..
నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు సెలవులు వచ్చాయి. 35 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి యముడికి మొగుడు అనే సినిమాను చూశాను. పాఠశాలలో చదివే సమయంలో చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాను 15 సార్లు చూశాను. మా స్కూళ్లో నేనే సినిమాలకు ప్లాన్‌ చేసే వాడిని.

అప్పడే నెలకు రూ.500 సంపాదించేవాడిని..
చదువుకునే వయసులోనే సెలవులు వచ్చినప్పుడు పనికి వెళ్లేవాడిని. జామాయిల్‌ తోటలో పనిచేయడంతోపాటు తునికాకు ఏరేవాడిని. నెలకు రూ.500 వరకు సంపాదించా. నా బాల్యం నుంచి సదానందం, ఆరోగ్యం, సమ్మయ్య మంచి స్నేహితులుగా ఉన్నారు. వారితో కలిసి పనికి వెళ్లే వాడిని. తరగతి గదిలో మాథ్స్‌ టీచర్‌ సుదర్శన్‌రెడ్డి, లక్ష్మయ్య సార్లతో చేసిన అల్లరి ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో ప్రోత్సహించారు..నేను మా గ్రామంలో అగ్రికల్చర్‌ చదివిన ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో ఎదిగాను. అగ్రికల్చర్‌ బీఎస్సీలో శంకర్‌రావు, రామకృష్ణారావు టీచర్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు.

మరిచిపోలేని అనుభూతులు..

  • సెలవుల్లో మా గ్రామ శివారులోని చెరువులో ఈత కొడుతున్నా. నా మిత్రుడు సమ్మయ్య లోతు ఎక్కువగా ఉన్న చోటకు వెళ్లి ప్రమాదంలో ఇరుక్కున్నాడు. ప్రాణాలు పోయే పరిస్థితి. ధైర్యం చేసి అతడి ప్రాణాలు కాపాడగలిగా. ఆ రోజు నుంచి సమ్మయ్య  ప్రాణ స్నేహితుడిగా మిగిలిపోయాడు.
  •  నా చిన్ననాటి స్నేహితుడు రవీందర్‌. వేసవి సెలవులు రాగా.. ఆడుకోవడానికి అతడిని వాళ్ల అమ్మ పంపించలేదు. నాకు కోపం వచ్చి.. రాత్రి వాళ్ల ఇంటి నుంచి గోలెంను ఎతుకొచ్చా. దాన్ని మా ఇంట్లో దాచిపెట్టాను. ఈ విషయం రెండు వారాలకు బయటపడింది. దీన్ని నాతో పాటు మా ఇంట్లో వాళ్లు ఇప్పటికీ మరిచిపోలేరు. 
  • సెలవులుగా కదా అని సరదాగా మా పెద్ద నాన్న వాళ్ల పొలంలో మామిడి చెట్టు ఎక్కాను.  మామిడి కాయలు తెంపుతుండగా.. మా పెద్ద నాన్న నామీద కోపంతో కుక్కను వదిలాడు. దాని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ చెట్టు ఎక్కాను. చీకటిపడే వరకు రెండు గంటలకు పైనే చెట్టు పై ఉన్నా. ఈ సంఘటన ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top