ఆర్టీసీలో కానరాని కోడ్‌!

Ads did not remove in rtc - Sakshi

ఇంకా తొలగించని ప్రభుత్వ ప్రకటనలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో  ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రకటనలు, ఫ్లెక్సీలపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎక్కడా ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదు. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. ఆర్టీసీలో మాత్రం ఇంకా ఇది అమలు కావడం లేదు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఫ్లెక్సీలు, నేతల చిత్రాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది.

ఇంకా మొదలుపెట్టని ఆర్టీసీ
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి మూడురోజులవుతున్నా ఆర్టీసీ దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. టీఎస్‌ఆర్టీసీ ప్రజారవాణా సంస్థ. ఆర్టీసీ బస్సులపై వివిధ రకాల వాణిజ్య ప్రకటనల ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతుంది. వీటిలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కార్మికశాఖ, రవాణాశాఖ, శిశుసంక్షేమ శాఖ తదితర శాఖలు తాము అమలు చేస్తోన్న పలు పథకాలు, వాటి పురోగతిపై ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నాయి. కోడ్‌ అమల్లోకి వచ్చిన దరిమిలా వీటిని తొలగించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. కానీ, ఇంతవరకూ ఇది అమలుకు నోచుకోవడం లేదు.

ప్రతిపక్షాల విమర్శలు..
ప్రతిరోజూ కోటి మందికిపైగా ప్రయాణించే ఆర్టీసీలో ప్రభుత్వ ప్రకటనలు ఇంకా అలాగే ఉండటంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఆర్టీసీ చైర్మన్‌ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినందునే ప్రకటనల తొలగింపుపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలంతా దీన్ని కోడ్‌ ఉల్లంఘనగానే ఆరోపిస్తున్నారు. ప్రయాణికులను ప్రభావితం చేసే ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నింటినీ తొలగిస్తాం
కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య ప్రకటనలను తొలగిస్తాం. ఈ దిశగా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. తొలగింపు ప్రక్రియ మొదలైంది. దాదాపు 3000 బస్సులపై ఈ ప్రకటనలున్నాయని సమాచారం. రెండుమూడురోజుల్లో అన్ని బస్సుల్లోనూ తొలగిస్తాం. – రవీందర్, సీటీఎం, (యాడ్స్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top