నిధులున్నా.. నిర్లక్ష్యం 

Administration Failed In Fund Utilization - Sakshi

సాక్షి, మెట్‌పల్లి(కోరుట్ల): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థికసంఘం ద్వారా గత డిసెంబర్‌లో రూ.9.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. జగిత్యాలకు రూ.4.20కోట్లు, మెట్‌పల్లికి రూ.2.25కోట్లు, కోరుట్లకు రూ.2.89కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, మార్కెట్‌ల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిధులు మంజూరై రెండు నెలలు గడిచినప్పటికీ జగిత్యాల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో ఇంకా ఈ పనులను మొదలుపెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

టెండర్‌  దాటని వైనం 
రెండు మున్సిపాలిటీల్లో ఈ పనులకు సంబం ధించి ఇంకా టెండర్‌దశ కూడా పూర్తి కాలేదు. మెట్‌పల్లిలో పదిరోజుల క్రితం ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచిన ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు.. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ రావడంతో దానిని అక్కడితోనే నిలిపివేశారు. జగిత్యాలలో మాత్రం అక్కడి అధికారులు ఇంకా టెండర్‌ ప్రక్రియను కూడా ప్రారంభించకపోవడం గమనార్హం. 

అధికారుల తీరుపై విమర్శలు... 
వాస్తవానికి పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ మార్చిలోనే విడుదలవుతుందనే కచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ అధికారులు పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయకుండా జాప్యం ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో టెండర్‌ ప్రక్రియతోపాటు కౌన్సిల్‌ ఆమోదం వంటి వాటిని పూర్తి చేసి ఈ నెలలో కోడ్‌ రాక ముందే పనులను మొదలుపెట్టారు. కానీ జగిత్యాల, మెట్‌పల్లిలో అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ మే 27 వరకు ఉంటుంది. ఆ లోపే మండల, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది సాధ్యం కాని పక్షంలో జూన్‌ నెలలో నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. దీనిని బట్టి చూస్తే మరో మూడు, నాలుగు నెలల పాటు ఈ పనులకు మోక్షం కలిగే అవకాశం లేదు. మొ త్తానికి అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో పనులు కాక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

సాంకేతిక కారణాలతోనే జాప్యం  
సాంకేతిక కారణాలతోనే టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయాం. గతంలో ఉన్న కమిషనర్‌ ఎక్కువ రోజులు సెలవులో ఉండడం..ప్రస్తుతం ఉన్న కమిషనర్‌ పేరు మీద డిజిటల్‌ కీ రావడంలో జాప్యం జరిగింది. ‘కీ’ వచ్చిన వెంటనే టెండర్లను పిలిచాం. కాని అంతలోనే ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఇది రాక ముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయ డానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. కోడ్‌ అనంతరం పనులు మొదలుపెడతాం. 
 – అరుణ్, ఏఈ, మెట్‌పల్లి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top