జైలు నుంచే ‘ఉగ్ర నెట్‌వర్క్‌’

Abdullah Basit Controlling A Gang Against CAA From Jail By Cell Phone - Sakshi

తీహార్‌ జైల్లో స్మార్ట్‌ఫోన్‌ సాయంతో బాసిత్‌ కార్యకలాపాలు

ఇటీవల పట్టుబడిన జమ్మూకశ్మీర్‌ జంట విచారణలో వెల్లడి

జైల్లోకి ఫోన్‌ ఎలా వచ్చింది? ఆరా తీస్తున్న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌

సాక్షి, హైదరాబాద్‌: కట్టుదిట్టమైన తీహార్‌ జైలులో ఉంటూ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ విస్తరణకు యత్నిస్తున్న వైనం బయటపడింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్‌.. తీహార్‌ జైల్లో ఉంటూ సీఏఏకు వ్యతి రేకంగా స్మార్ట్‌ఫోన్‌ సాయంతో మద్దతు కూడ గడుతూ ఓ గ్రూపును తయారుచేస్తున్నట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జహన్‌ జెబ్‌ సామి, హీనా బషీర్‌బేగ్‌ దంపతులు ఇటీవల ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఐసిస్‌కు  చెందిన ఖొరాసన్‌ మాడ్యూల్‌లో ఉగ్రవాదులుగా మారిన వీరిద్దరూ, బాసిత్‌ ఆదేశాలతో సోషల్‌ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు విచారణలో తేలింది.

కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో వీరి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. దీంతో వీరిద్దరినీ ఢిల్లీకి రప్పించిన బాసిత్‌ అక్కడి ఓక్లాలోని జామియానగర్‌లో ఉంచాడు. సామి ప్రైవేట్‌ ఉద్యోగిగా, హీనా గృహిణిగా చలామణి అవుతూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించా రు. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ ఇటీవల ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జం ట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల విశ్లేషణ, విచారణలో వెలుగుచూసిన వివరాల ఆధారంగా బాసిత్‌ను నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ సమాచారం ఇచ్చారు.

జైలు నుంచే స్మార్ట్‌ఫోన్‌తో.. 
విచారణలో జమ్మూకశ్మీర్‌ జంట తెలిపిన వివరాల ఆధారంగా ఢిల్లీ స్పెషల్‌ సెల్‌.. తీహార్‌ జైలులో ఉన్న అబ్దుల్లా బాసిత్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెం దిన యువతకు బాసిత్‌ సోషల్‌మీడియా ద్వారా వలవేస్తూ ఉగ్ర బాట పట్టేలా చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. దీంతో బాసిత్‌కు జైల్లో సెల్‌ఫోన్‌ ఎలా అందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్‌ (26) ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఐసిస్‌ సా నుభూతిపరుడిగా మారాడు. 2014, ఆగస్టు లో మరికొందరితో కలిసి పశ్చిమబెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసు కోవాలని భావించాడు. నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ చేసి విడిచిపెట్టాయి.

అనంతరం హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆర్నెల్ల పాటు ఇంటీరియల్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాడు. 2015, డిసెంబర్‌లో ఐసిస్‌లో చేరుతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్‌ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని అరెస్టుచేశారు. బెయిల్‌పై బయటికొచ్చిన బాసిత్‌.. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్‌ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టుచేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తూ బాసిత్‌ వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పలువురిని ఆకర్షిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన భార్యభర్తలు ఈ విధంగానే అతని వలలో పడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top