సర్కారు దవాఖానాలకు రోగుల క్యూ

Aarogyasri Bandh Continues For Four Days In Telangana - Sakshi

నాలుగో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ!

ఆస్పత్రుల వారీగా బకాయిలపై సమీక్షిస్తున్న యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవల బంద్‌ నాలుగో రోజూ కొనసాగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మరోవైపు బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల మధ్య నెలకొన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రుల వారీగా బకాయిల వివరాలను నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (తన్హా)కు ప్రభుత్వం అందజేసింది. ఈ లెక్కలను ఆస్పత్రుల వారీగా అసోసియేషన్‌ సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించ తలపెట్టిన తన్హా అత్యవసర సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం మొత్తం 236 ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.3,44,17,50,892 బకాయిలు ఉన్నాయి. ఈజేహెచ్‌ఎస్‌కు సంబంధించి 241 ప్రైవేటు హాస్పిటళ్లకు కలిపి రూ.23,58,28,032 బకాయిలు ఉన్నాయి. ఈజేహెచ్‌ఎస్‌కు సంబంధించి 15 కార్పొరేట్‌ ఆస్పత్రులకు (టీషా–తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌) రూ.89,99,90,072 బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రభుత్వం వెల్లడించిన లెక్కతో, తమ లెక్కలు సరిపోలడం లేదని తన్హా ప్రతినిధులు చెబుతున్నారు. తన్హాలోని అన్ని ఆస్పత్రుల నుంచి బకాయిలు లెక్కలు తెప్పిస్తున్నామని, వాటన్నింటినీ క్రోఢీకరించి మంగళవారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top