8 నెలల్లో 90 శాతం..

90% In 8 Months - Sakshi

నాలుగు ఏరియాల్లో నూరు శాతం ఉత్పత్తి

ఓపెన్‌కాస్టు గనుల్లో 94 శాతం 

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా.. గడిచిన 8 నెలల్లో  90 శాతం ఉత్పత్తి సాధించింది. సింగరేణి వ్యాప్తంగా 4 ఏరియాల్లో వందశాతం ఉత్పత్తి జరిగింది. ఇక ఓపెన్‌కాస్టు గనుల్లో 94 శాతం, భూగర్భ గనుల్లో 76 శాతం ఉత్పత్తి నమోదు చేసుకుంది. గత ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మాసం వరకు 8 నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా భూగర్భ, ఓపెన్‌కాస్టు గనుల్లో 43.71 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని  నిర్దేశించుకోగా నవంబర్‌ 30వ తేదీ వరకు 39.53 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో 90 శాతం సాధించారు. ఇక ఓపెన్‌కాస్టు గనుల్లో 35.80 మిలియన్‌ టన్నులకు గాను 33.52 మిలియన్‌ టన్నులతో 94 శాతం, భూగర్భ గనుల్లో 7.91 మిలియన్‌ టన్నులకు గాను 6.0 మిలియన్‌ టన్నులతో 76 శాతం మాత్రమే ఉత్పత్తి సాధించడం గమనార్హం. వార్షిక లక్ష్య సాధనకు మరో నాలుగు నెలలు మాత్రమే  ఉండటంతో సింగరేణి వ్యాప్తంగా నెలవారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లైతేనే వార్షిక ఉత్పత్తి సాధించగలమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొంత ఉత్పత్తి లోటు కనిపిస్తుండటంతో నెలవారీ లక్ష్యాలను మించి ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

నాలుగు ఏరియాల్లో  నూరుశాతం దాటిన ఉత్పత్తి 
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా గడిచిన 8 నెలల ఉత్పత్తి లక్ష్య సాధనలో నాలుగు ఏరియాలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగాయి. కొత్తగూడెం, ఇల్లెందు, రామగుండం–1తో పాటు శ్రీరాంపూర్‌ ఏరియాల్లో నూరు శాతం మించి ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం ఏరియాలో అత్యధికంగా 112 శాతం, రామగుండం–1లో 104 శాతం, ఇల్లెందులో 103 శాతం కాగా శ్రీరాంపూర్‌ ఏరియాలో 100 శాతం ఉత్పత్తి నమోదైంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top