కడలివైపు కృష్ణమ్మ

33 TMCs release Krishna water into the sea in a single day - Sakshi

ఒకేరోజు 33 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలోకి విడుదల

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలుగా మారడంతో దిగువకు వదులుతున్న నీరంతా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలుస్తోంది. కృష్ణమ్మ ఉరకలెత్తుతుండటంతో రెండ్రోజులుగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,27,635 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా..4,98,781 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ జలాలు హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 46.5 టీఎంసీలు సముద్రంలోకి విడుదల చేశారు. ఇందులో గత 24 గంటల్లోనే 33 టీఎంసీలు విడుదల చేయడం గమనార్హం.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో గత మూడ్రోజులుగా నాగార్జునసాగర్‌ 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు.

రెండ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు 
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నందున, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top