గాంధీ ఆస్పత్రిలో అనుమానితుల 'క్యూ'విడ్‌ | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో అనుమానితుల 'క్యూ'విడ్‌

Published Sun, Mar 22 2020 1:27 AM

236 Covid Suspects Came For Treatment To Gandhi Hospital - Sakshi

గాంధీ ఆస్పత్రి: కోవిడ్‌ అనుమానితులు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు హెల్ప్‌డెస్క్‌ వద్ద మీటరు దూరంలో నిల్చుంటూ బారులు తీరుతున్నారు. శనివారం 236 మంది అనుమానితులు వచ్చారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి కోవిడ్‌ లక్షణాలు గల 26 మందిని ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని నమూనాలు సేకరించారు. వాటిని నిర్ధారణ పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 13 మంది, ఛాతీ ఆస్పత్రిలో 8 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. మహేంద్రహిల్స్‌కు చెందిన కోవిడ్‌ బాధితుడు పూర్తి ఆరోగ్యంతో పది రోజుల క్రితం డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే. కాగా, గాంధీ హెల్ప్‌డెస్క్‌కు కోవిడ్‌ అనుమానితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అదనపు వైద్యులను, సిబ్బందిని ఏర్పాటు చేశారు.

మైక్‌ సిస్టం ద్వారానే వైద్యుల మాటలు.. 
కోవిడ్‌ అనుమానితులతో వైద్యులు మాట్లాడే క్రమంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేందుకు హెల్ప్‌ డెస్క్‌ వద్ద కొత్తగా మైక్‌ సిస్టంను శనివారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పాజిటివ్‌ బాధితులు ఇతర రుగ్మతల బారినపడితే అవసరమైన శస్త్రచికిత్సలు తక్షణమే చేసేందుకు 6వ అంతస్తులోని జనరల్‌ సర్జరీ విభాగంలో ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌ను సిద్ధ్దం చేశారు. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఆర్థోపెడిక్‌ విభాగ వార్డులను అక్కడి నుంచి తరలించి కోవిడ్‌ విభాగానికి కేటాయించినట్లు శ్రవణ్‌కుమార్‌ చెప్పారు. 8వ అంతస్తులో 72 గదులు, 8 పెద్ద హాళ్లు, 7వ అంతస్తులో మరికొన్ని ఐసోలేషన్‌ వార్డులను అందుబాటులోకి తెచ్చారు.

విధుల్లో నర్సింగ్‌ ట్యూటర్లు.. 
గాంధీ ఆస్పత్రికి అనుబంధంగా పనిచేస్తున్న గాంధీ నర్సింగ్‌ స్కూలుకు చెందిన 13 మంది ట్యూటర్లను ఆస్పత్రిలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని వివిధ విభాగాల్లో నియమించారు.

కోవిడ్‌ వైద్యసేవలకు భాషా సమస్య 
గాంధీలోని కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ బాధితులకు వైద్యసేవలు అందించేందుకు భాష సమస్యగా మారింది. ఇండోనేíసియా నుంచి వచ్చిన బాధితుల్లో కొందరికి అరబిక్‌ తప్ప హిందీ, ఇంగ్లిష్‌ రావు. బాధితులను సింగిల్‌ రూమ్స్‌లో పెట్టి వైద్యసేవలు అందిస్తున్న నేపథ్యంలో వైద్యులకు బాధితులకు మధ్య భాష సమస్యగా మారినట్లు తెలిసింది. వైద్యులు సైగల ద్వారా అడిగితే, బాధితులు కూడా సైగల ద్వారానే బదులిస్తున్నట్టు తెలిసింది.

ఫీవర్‌లో మరో 3 అనుమానిత కేసులు 
ఫీవర్‌ ఆస్పత్రిలో మరో 3 కోవిడ్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. చంపాపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(35), (28), (3) జనవరిలో సింగపూర్‌కు వెళ్లొచ్చారు. అనుమానంతో వీరు శనివారం నిర్ధారణ పరీక్షల కోసం ఫీవర్‌ ఆసుపత్రికి వచ్చారు. వీరిని ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement