‘108’ అక్రమాలపై విచారణ జరపాలి | '108' irregularities must be prosecuted | Sakshi
Sakshi News home page

‘108’ అక్రమాలపై విచారణ జరపాలి

May 23 2015 4:10 AM | Updated on Apr 7 2019 3:47 PM

‘108’ అక్రమాలపై  విచారణ జరపాలి - Sakshi

‘108’ అక్రమాలపై విచారణ జరపాలి

108లో జీవీకే సంస్థ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు...

ముషీరాబాద్: 108లో జీవీకే సంస్థ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 108 ఉద్యోగుల సమ్మెపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం, 108 ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అశోక్, తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు రాజేందర్, మామిడి నారాయణ, అబ్బాస్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ..జీవీకే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో వాహనానికి లక్షా 20 వేల 265 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 2014 -15 సంవత్సరానికి ప్రభుత్వం జీవీకేకు 3 కోట్ల 79 లక్షల 91 వేల 416 రూపాయలు చెల్లించిందన్నారు. అయితే 230 నుంచి 250 మాత్రమే 108 వాహనాలు రోడ్లపై తిప్పారని, మిగిలిన వాహనాలు ఎక్కడికి పోయాయని, వాటి ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏసీబీ విచారణ  జరిపి, అక్రమాలు వెల్లడవుతున్న క్రమంలో కేసును తొక్కి పట్టే ప్రయత్నం జీవీకే చేస్తుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

న్యాయం జరగడం లేదు: విమలక్క
దోమలగూడ :  108 ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9 రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ చైర్మన్ అరుణోదయ విమలక్క మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలోనూ మనకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణ 108 ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement