breaking news
-
కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్‌లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.కేసీఆర్‌తోనే ఉనికి..కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.బీజేపీకి ప్లస్ అవుతోంది..తండ్రి కూతురుగా కవిత లీడర్‌గా ఎదిగారు. కేసీఆర్‌ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు. కవితకు అవగాహన లేదు..బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్ చేశారు. -
పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు: భట్టి విక్రమార్క
వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్‌మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్... శని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్‌లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్‌కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్ఎస్లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్‌మ్యాన్’ ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్‌మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్లో బయటపడింది. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్‌కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్‌కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్‌సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది’
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. ఇంట్లో కంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కవిత ఎపిసోడ్ డైవర్ట్ చేసేందుకే తమపై ఆరోపణలు చేశారన్న మహేష్ గౌడ్.. పది సంవత్సరాల బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపిందన్నారు.బీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌కు నోటీసులతో.. కేటీఆర్ భయపడుతున్నాడు. బీఆర్ఎస్కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదను కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు’’ అంటూ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు.‘‘కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలి. పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే.. కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుంది. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు’’ అంటూ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
సిస్టర్ స్ట్రోక్‌తోనే కేటీఆర్ అలా మాట్లాడారు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్(KTR)ను మించిన వారే లేరని కౌంటర్ ఇచ్చారామె.శనివారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే. సిస్టర్ స్ట్రోక్(Sister Stroke)తో కేటీఆర్ చిన్న మెదడు చిట్లింది. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందు హాజరయ్యేటప్పుడు ఎందుకు?. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు’’ అని అన్నారామె. అటవీ అధికారులు ప్రజలకు సహకరించాలిఅటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ‘‘ప్రజల తరఫున వారి సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ భేటీలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి ఓ మార్గం చూపిస్తాం. అటవీ ప్రాంతాల్లోనీ ప్రజల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు మానవీయ కోణంలో సహకరించాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి’’ అని అన్నారామె.ఇదీ చదవండి: కవితకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్! -
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు. -
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రూ.50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్ఫక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు, కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూళ్లను పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి రేవంత్‌ను తప్పించాలి.మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కాంపై నోరు మెదపరు. సివిల్ సప్లయ్ స్కాంపై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కాంలపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గవర్నర్‌ని కలిసి సీఎం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్లో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యచరణ తీసుకుంటాం అని హెచ్చరించారు. యడ్యూరప్పపై విమర్శలు వస్తే రిజైన్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా?. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అందరికీ తెలుసు. డీకే శివకుమార్‌ను తొలగించాలని కర్ణాటకలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలకు ఏమైంది?. హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించలేదు?. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే రేవంత్ వ్యవహారంపై వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ, కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. తెలంగాణభవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.ఇక, అంతకుముందు కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత..‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్‌కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్‌కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు.. కవిత అభిమానులు.. ఆమెను సీఎం.. సీఎం.. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యాగ్‌మ్యాన్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చటంతో ఆయన అవినీతి బండారం బయట పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయని అన్నారు. ఈడీ చార్జిషిట్‌లో పేరు రావడంతో ‘తెలంగాణ బ్యాగ్ మ్యాన్’రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే డ్రామాలు మొదలు పెట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకు రేవంత్ రోజుకో కొత్త నాటకం వేస్తున్నారని ఆరోపించారు.ఈడీ చార్జిషిట్‌లో రేవంత్ పేరు నమోదైనందున కేంద్రం ఆయనపై చర్యలు తీసుకుంటున్నదీ లేనిదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ కుంభకోణం, పౌర సరఫరాల స్కామ్ వంటి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన రీతిలోనే కేంద్రం నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలోనూ వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. అధికారం కోసం వందల కోట్లు సీఎం పదవి చేపట్టకముందే అధికారం కోసం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన వ్యవహరం ఈడీ చార్జిషిట్‌లో బయటపడిందని కేటీఆర్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్‌రెడ్డి ప్రలోభపెట్టిన విషయం ఈడీ చార్జిషిటులో బయట పడిందని తెలిపారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం ఏడాదిన్నరలోనే సీఎం పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తరహాలోనే రేవంత్ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా? అని ప్రశ్నించారు.కేవలం చార్జిషిట్‌లో రేవంత్ పేరు నమోదుతో సరిపెట్టకుండా విచారణకు పిలిచి అవినీతిని కక్కించాలని డిమాండ్ చేశారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ కకావికలమైందని, తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు దిగాల్సి వస్తుందో అనే భయం రేవంత్‌ను అడుగడుగునా వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. కమిషన్లు లేనిదే ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పారని, 30 శాతం పర్సంటేజీపై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందని అన్నారు. ప్రజల ముందు సీఎం అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని విమర్శించారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం పాపం పండిందని, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. -
తప్పు చేయకుంటే భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు వికృత, వికార చేష్టలకు పాల్పడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తప్పు చేయకుంటే భయమెందుకని, కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ నోటీసులకు వణికి పోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జ్యుడీíÙయల్ కమిషన్‌ను తప్పు పట్టడం సరికాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించిందని, రీడిజైన్ చేసి మూడేళ్లలోనే ప్రాజెక్టు కూలిపోయేందుకు కారణమయ్యిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనంగా వెచి్చంచిన డబ్బులతో పాలమూరు– రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదు జేబులు నింపుకోవడానికేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.84 వేల కోట్లకు అంచనాలు పెంచి , ఆ తర్వాత రూ.లక్షా ఇరవై వేల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. ఇంతా చేస్తే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కొత్త ఆయకట్టు నామమాత్రమేనని విమర్శించారు.బీఆర్ఎస్ నేతల అవినీతి, అసమర్ధత, కమీషన్ల కక్కుర్తి కారణంగానే ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపించారు. లోపభూయిష్టంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఇప్పుడు ఎందుకూ పనికి రావని ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ చెప్పడంతోనే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసినట్లు తెలిపారు. ఈ కమిషన్ ముందు హాజరు కావాలని అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు పంపితేనే బెంబేలెత్తి పోయి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎఫ్ఐఆర్ మేడిగడ్డపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అక్కడ బాంబులు ఉన్నాయో లేదో అప్పుడే ఎందుకు తేల్చలేదని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు వ్యాఖ్యలకు, ఎన్డీఎస్ఏపై విమర్శలు చేసినందుకు చట్టప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. 2019లో ప్రాజెక్టును ప్రారంభించిన మరుసటి వారం నుంచే లోపాలు బయటపడుతున్నా, కప్పిపుచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పారని, ఆ బరాజ్ నిండా నీళ్లు నింపడంతో పరిస్థితి మరీ అధ్వాన్నమైందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చెప్పినట్టు ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపితే భద్రాచలం, 43 గ్రామాలు, సమ్మక్క–సారక్కల ప్రదేశం కొట్టుకుపోతాయని, దానికి ఎవరు బాధ్యులని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టును అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు
సాక్షి, హైదరాబాద్/ శంషాబాద్: ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వారివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. నేను రెండు వారాల క్రితం మా పార్టీ నాయకుడికి లేఖ రాసిన మాట వాస్తవం. ఆ లేఖ బయటకు లీక్ కావడం బాధాకరం. కేసీఆర్ కుమార్తె రాసిన లేఖనే లీకైతే ఇక పార్టీలోని సామాన్యుల పరిస్థితేంటి? దీనిపై చర్చ జరగాలి’అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ రెండురోజుల క్రితం బహిర్గతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు మౌనంగా ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. లేఖ లీకవక ముందు కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఉత్సవం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి వచ్చిన ఆమె.. శంషాబా ద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో కింది నుంచి పైస్థాయి నాయకుల వరకు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే తాను రాసిన లేఖలో ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలు పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఈ మధ్య తాను చెప్పిన విషయం లేఖ బహిర్గతం ద్వారా మరోసారి స్పష్టమైందని కవిత అన్నారు. గతంలో కూడా లేఖ ద్వారా తన అభిప్రాయాలను కేసీఆర్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ‘నేను నా కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి వెళ్లిన తరువాతే నా లేఖ లీకైనట్లు హంగామా జరిగింది. పార్టీలో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే లేఖలో చెప్పాను.ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీలేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే, దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వారి వల్లే నష్టం జరుగుతోంది. లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో చిన్నచిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయి. వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం’అని కవిత స్పష్టంచేశారు. కనిపించని గులాబీ జెండాలు శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఎవరూ రాలేదు. కవితక్క జిందాబాద్.. సామాజిక తెలంగాణ కోసం పోరాడిన కవితక్క అన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీసీ సంఘాల నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. కవిత టీం పేరుతో వచ్చినవారు ప్రదర్శించిన ప్లకార్డులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోలు కానీ, కేటీఆర్ లేదా హరీశ్‌రావు ఫొటోలు కానీ కనిపించకపోవడం గమనార్హం. జాగృతి ఆధ్వర్యంలో వచ్చిన కొందరు మాత్రం కవితతోపాటు కేసీఆర్ ఫొటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని కవిత జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. అయితే, ఏ ఒక్కరూ బీఆర్ఎస్ కండువాలు ధరించకపోవటం గమనార్హం. కొందరు అభిమానులు కవితను చూసి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. -
కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి: కవిత
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. రెండు వారాల కిందట కేసీఆర్‌కు లేఖ రాశా. కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమే. లేఖ రాయడంలో పర్సనల్ ఏజెండా ఏమీ లేదు. పార్టీ నేతలు అనుకున్నదే నేను లేఖలో రాశా. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్ర. లేఖ లీక్ చేసింది పార్టీలోని కోవర్టులే. మా నాయకుడు కేసీఆర్.. ఎలాంటి ఆలోచన లేదు. ఆయన నాయకత్వంలో పనిచేస్తా. నా లేఖ లీక్‌తో కాంగ్రెస్, బీజేపీలు సంబరపడిపోతున్నాయి. గతంలోనూ కేసీఆర్‌కు లేఖలు రాశా. తాజాగా రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రాలేదు. కవితకు స్వాగతం పలికేందుకు ఆమె మద్దతు దారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. వాటిల్లో ఎక్కడా పార్టీ పేరు, ముఖ్య నేతల ఫొటోలు కనిపించలేదు. టీమ్ కవితక్కా అంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. -
‘ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా కవిత లేఖ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha Letter) రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ను కార్నర్ చేసి.. బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవిత లేఖ ‘కాంగ్రెస్ వదిలిన బాణం‘ అనే OTT ఫ్యామిలీ డ్రామా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం. కుటుంబ పార్టీ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కుటుంబ పార్టీ వాటి సొంత సంక్షోభాన్ని ప్రజల ఎమోషన్లుగా మార్చాలని చూస్తోంది. కానీ, తెలంగాణ ప్రజలు ఈ లేఖ డ్రామాని పట్టించుకోవడం లేదు. బీజేపీ(BJP) ఎవరినీ జైలుకు పంపదు. చట్టం ఆ పని చేస్తుంది. తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. తెలంగాణలో ప్రతీ సర్వే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని చెబుతోంది. అధికారం.. ఆర్భాటాలు లేకున్నా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్లు కోరుకునేది అభివృద్ధి.. నిజమైన మార్పు. అంతేగానీ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాలు కాదు. నిజమైన మార్పు బీజేపీ తోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు’’ అని ట్వీట్ చేశారాయన. ఇదీ చదవండి: కవిత లేఖపై తర్వాత స్పందిస్తాం- హరీష్ రావు -
‘కవిత లేఖ ఓ డ్రామా.. ఇది ఆ ఇద్దరి పనే!’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయాలను కాస్త హీటెక్కించాయి. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని ఇరు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కలకలం రేపింది. అయితే ఈ లేఖపై కవిత లేఖ(Kavitha Letter)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. ‘‘కవిత లేఖ ఉత్తదే. కేసీఆర్‌కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా?. బీజేపీ పై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా?. కేటీఆర్ హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేయడం ఖాయం. ఈ లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడింది. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు’’ అని అన్నారాయన. మరోవైపు.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీనియర్ నేత హరీష్‌రావును మీడియా కోరగా.. ఇద్దరూ స్పందించలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మైక్‌ను పక్కకు తోసేయగా.. హరీష్‌రావు(Harish Rao) మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు. కిందటి నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ ధూం ధాం సభ సక్సెస్ అయ్యిదంటూనే.. అది పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందంటూ కొన్ని ప్రతికూల పాయింట్లను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు నోట్ ఒకటి తెర మీదకు వచ్చింది. పైగా బీజేపీ గురించి తక్కువ మాట్లాడేసరికి ఆ పార్టీతో పొత్తు ఉండబోతుందనే ప్రచారం బలంగా సాగుతోందంటూ అందులో వివరణాత్మకంగా రాసి ఉంది. ‘‘బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు(BRS-BJP Alliance) పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన నేను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది’’ అయితే ఆ నోట్ ఆమె రాసిందేనా? అనేదానిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కవిత లేఖపై అనుమానాలు: డీకే అరుణకేసీఆర్కు కవిత లేఖ లేఖ రాయాల్సిన అవసరం ఏముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారామె. ఇదీ చదవండి: మై డియర్ డాడీ.. -
ఈడీ కేసులో రేవంత్.. పొంగులేటి రూటేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు. -
సోనియా, రాహుల్‌కు తీర్పు అనుకూలమైతే ఏమంటారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతల తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. తప్పు అని చెప్తారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మహేష్ కుమార్ గౌడ్ గారు.. మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్రలు చేస్తుంటారు. మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం న్యాయాన్ని, కోర్టులను, తీర్పులనూ అపహాస్యం చేస్తుంటారు. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు! మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు?. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే తప్పు అని చెప్తారా?. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు. Absolutely appalled by the comments of TPCC president Mahesh Kumar Goud garu on the Honourable Supreme court’s dismissal of Special Leave Petition (SLP) in Palamuru-Rangareddy Lift Irrigation Scheme projectIt is not just demeaning to the Supreme Court but the constitution of…— KTR (@KTRBRS) May 23, 2025 -
సీఎం రేవంత్‌లో అపరిచితుడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ’మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే భయంకరమైన మానసిక రుగ్మత ఉండటంతో ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘పర్సంటేజీల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అంటూ కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలి పోయి నిజాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా చేస్తున్న దు్రష్పచారం కూడా త్వరలో తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ తన విచారణ పూర్తయిందని, నివేదిక సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ తిరిగి కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్, హరీశ్‌రావుకు నేరుగా నోటీసులు అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్‌లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల వెనుక ఉన్న అసలు ఎజెండా అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీల్లో తలమునకలై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే.. రేవంత్ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుల్జార్ హౌస్‌లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కనీసం చూడటానికి కూడా వెళ్లని సీఎం.. అందాల పోటీలకు మాత్రం నాలుగు సార్లు హాజరయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులంతా మిస్‌వరల్డ్ పోటీదారులకు టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారని, నిజాంలు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు మినహా చూపించేందుకు కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అభిప్రాయభేదాలు సహజంరాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని కేటీఆర్ అన్నారు. ‘నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. వాటిని పక్కనపెట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి’అని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
నోటీసులపై ఏం చేద్దాం?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ
సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్‌రావు.. సుమారు మూడు గంటల పాటు కేసీఆర్‌తో మంతనాలు సాగించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది.కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఎం రేవంత్‌రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.