
దివ్యాంగ యువకుడికి నియామక పత్రం అందజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి
బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి మండిపాటు
వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు.
తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు.
బీఆర్‌ఎస్ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్‌మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.