
లీకైన లేఖ నాదే.. రెండు వారాల క్రితమే రాశా
నా లేఖే లీకైతే పార్టీలోని సామాన్యుల పరిస్థితేంటి?
అందరూ అనుకుంటున్నదే లేఖలో ప్రస్తావించా
లేఖ లీక్ వెనుక కుట్ర ఉంది
కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టికరణ
సాక్షి, హైదరాబాద్/ శంషాబాద్: ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వారివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. నేను రెండు వారాల క్రితం మా పార్టీ నాయకుడికి లేఖ రాసిన మాట వాస్తవం. ఆ లేఖ బయటకు లీక్ కావడం బాధాకరం. కేసీఆర్ కుమార్తె రాసిన లేఖనే లీకైతే ఇక పార్టీలోని సామాన్యుల పరిస్థితేంటి? దీనిపై చర్చ జరగాలి’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ రెండురోజుల క్రితం బహిర్గతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకులు మౌనంగా ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. లేఖ లీకవక ముందు కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఉత్సవం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి వచ్చిన ఆమె.. శంషాబా ద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో కింది నుంచి పైస్థాయి నాయకుల వరకు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే తాను రాసిన లేఖలో ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు.
కుట్రలు, కుతంత్రాలు
పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఈ మధ్య తాను చెప్పిన విషయం లేఖ బహిర్గతం ద్వారా మరోసారి స్పష్టమైందని కవిత అన్నారు. గతంలో కూడా లేఖ ద్వారా తన అభిప్రాయాలను కేసీఆర్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ‘నేను నా కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి వెళ్లిన తరువాతే నా లేఖ లీకైనట్లు హంగామా జరిగింది. పార్టీలో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే లేఖలో చెప్పాను.
ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీలేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే, దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వారి వల్లే నష్టం జరుగుతోంది. లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో చిన్నచిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయి. వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం’అని కవిత స్పష్టంచేశారు.

కనిపించని గులాబీ జెండాలు
శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలకడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు, నేతలు ఎవరూ రాలేదు. కవితక్క జిందాబాద్.. సామాజిక తెలంగాణ కోసం పోరాడిన కవితక్క అన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీసీ సంఘాల నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. కవిత టీం పేరుతో వచ్చినవారు ప్రదర్శించిన ప్లకార్డులలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోలు కానీ, కేటీఆర్ లేదా హరీశ్‌రావు ఫొటోలు కానీ కనిపించకపోవడం గమనార్హం. జాగృతి ఆధ్వర్యంలో వచ్చిన కొందరు మాత్రం కవితతోపాటు కేసీఆర్ ఫొటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని కవిత జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. అయితే, ఏ ఒక్కరూ బీఆర్‌ఎస్ కండువాలు ధరించకపోవటం గమనార్హం. కొందరు అభిమానులు కవితను చూసి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు.