
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు.
‘‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. రెండు వారాల కిందట కేసీఆర్‌కు లేఖ రాశా. కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమే. లేఖ రాయడంలో పర్సనల్ ఏజెండా ఏమీ లేదు. పార్టీ నేతలు అనుకున్నదే నేను లేఖలో రాశా. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్ర. లేఖ లీక్ చేసింది పార్టీలోని కోవర్టులే. మా నాయకుడు కేసీఆర్.. ఎలాంటి ఆలోచన లేదు. ఆయన నాయకత్వంలో పనిచేస్తా. నా లేఖ లీక్‌తో కాంగ్రెస్, బీజేపీలు సంబరపడిపోతున్నాయి. గతంలోనూ కేసీఆర్‌కు లేఖలు రాశా. తాజాగా రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.
కాగా, కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు రాలేదు. కవితకు స్వాగతం పలికేందుకు ఆమె మద్దతు దారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. వాటిల్లో ఎక్కడా పార్టీ పేరు, ముఖ్య నేతల ఫొటోలు కనిపించలేదు. టీమ్ కవితక్కా అంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి.