
ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులకే వణికిపోవడమెందుకు?
బీఆర్‌ఎస్ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు
‘మేడిగడ్డలో బాంబులు’ విషయం కేటీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పాలి: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతలు వికృత, వికార చేష్టలకు పాల్పడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తప్పు చేయకుంటే భయమెందుకని, కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ నోటీసులకు వణికి పోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జ్యుడీíÙయల్ కమిషన్‌ను తప్పు పట్టడం సరికాదని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించిందని, రీడిజైన్ చేసి మూడేళ్లలోనే ప్రాజెక్టు కూలిపోయేందుకు కారణమయ్యిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనంగా వెచి్చంచిన డబ్బులతో పాలమూరు– రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదు జేబులు నింపుకోవడానికేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.84 వేల కోట్లకు అంచనాలు పెంచి , ఆ తర్వాత రూ.లక్షా ఇరవై వేల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. ఇంతా చేస్తే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కొత్త ఆయకట్టు నామమాత్రమేనని విమర్శించారు.
బీఆర్‌ఎస్ నేతల అవినీతి, అసమర్ధత, కమీషన్ల కక్కుర్తి కారణంగానే ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపించారు. లోపభూయిష్టంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఇప్పుడు ఎందుకూ పనికి రావని ఎన్‌డీఎస్‌ఏ, కాగ్, విజిలెన్స్ చెప్పడంతోనే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసినట్లు తెలిపారు. ఈ కమిషన్ ముందు హాజరు కావాలని అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు పంపితేనే బెంబేలెత్తి పోయి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే ఎఫ్‌ఐఆర్
మేడిగడ్డపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అక్కడ బాంబులు ఉన్నాయో లేదో అప్పుడే ఎందుకు తేల్చలేదని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు వ్యాఖ్యలకు, ఎన్‌డీఎస్‌ఏపై విమర్శలు చేసినందుకు చట్టప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. 2019లో ప్రాజెక్టును ప్రారంభించిన మరుసటి వారం నుంచే లోపాలు బయటపడుతున్నా, కప్పిపుచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పారని, ఆ బరాజ్ నిండా నీళ్లు నింపడంతో పరిస్థితి మరీ అధ్వాన్నమైందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చెప్పినట్టు ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపితే భద్రాచలం, 43 గ్రామాలు, సమ్మక్క–సారక్కల ప్రదేశం కొట్టుకుపోతాయని, దానికి ఎవరు బాధ్యులని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టును అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ పాల్గొన్నారు.