
సాక్షి, హైదరాబాద్: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.
వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది.
యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది.
అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025
రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.
సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.

30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు.