
సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్‌రావు.. సుమారు మూడు గంటల పాటు కేసీఆర్‌తో మంతనాలు సాగించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది.
కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.
బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.