
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.