breaking news
-
ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా?
గజం మిథ్య ,పలాయనం మిథ్య అని అంటారు. అందరూ శ్రీవైష్ణవులే.. రొయ్యల బుట్ట మాయం అని మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాదకుమార్ ఇచ్చిన తీర్పును గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పీ మరీ ఆహ్వానించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికి తెలిసిన ఈ సత్యం స్పీకర్‌కు తెలియకపోవడమే ఒక ప్రత్యేకత . ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. వారిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్ సభ ఎన్నికలలో పోటీచేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరికొంతకాలం ఈ విచారణ తంతు సాగుతుందేమో తెలియదు. లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయన రాజీనామా చేస్తారా?లేక తప్పనిస్థితిలో అనర్హత వేటు వేస్తారా?అన్నది చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహీపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య,సంజయ్ కుమార్ లపై కూడా నిర్ణయం రావల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్ఎల్యేలంతా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదించారు. ఈ పదిమంది ఎ మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ,జాప్యం చేస్తున్నారని హైకోర్టు ,సుప్రింకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రింకోర్టు మూడు నెలలలో దీనిపై తేల్చాలని స్పీకర్ ను ఆదేశించడంతో ఈ నిర్ణయం అయినా వెలువడింది. న్యాయ వ్యవస్త ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ,ఈ తంతగం ఐదేళ్లపాటు సాగుతుండేది.ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో సహా వివిధ విపక్షాల ఎమ్మెల్యేలు 38 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సి.ఎమ్. రేవంత్ కూడా అదే పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు.కాని అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చే శాయి. ఒక చిన్న తేడా ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని,ఇతర పక్షాలను బీఆర్ఎస్ విలీనం చేసినట్లు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు.మిగిలినవారిలో పది మందే పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు ఐదువేల చొప్పున శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దానిని ఆ పార్టీ అంగీకరించిందని,అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ ను రేవంత్ తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపులన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది.అదే టైమ్ లో రాజ్యసభలో టీడీపీ ఎమ్.పిలు నలుగురిని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత, దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతి వేగంగా వెంకయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వపక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు,తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి. వైఎస్సార్సీపీ ఎమ్.పి రఘురామకీష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాను పదే,పదే కోరినా, కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారేకాని అనర్హత వేటు వేయలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తుంటుంది.ఏపీలో చంద్రబాబు నాయుడు గత టరమ్ లో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా న లుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎవరిపై చర్య తీసుకోలేదు. కెసిఆర్ కూడా తొలి టరమ్ లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అయినా వీరిలో ఎవరికి ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్దాలు చెబుతూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ అప్రతిష్టపాలు అవడానికి సిద్దపడుతున్నారు తప్ప రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజివ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుల నిరోదక చట్టం వచ్చింది.ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ తదితరులకు కూడా తెలుసు.అయినా వారు కూడా దీనిని ఆపడం లేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు కోల్పోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని,తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిజెపి,బీఆర్ఎస్ లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు.ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి,జి.నారాయణరావు వంటి గట్టి స్పీకర్ లు ఉండేవారు.అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. చాలావరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.గతంలో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన కేసులో వారిపై అనర్హత వేటు వేశారు. కాకపోతే విచారణ పేరుతో ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి,పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఈ విషయాలలో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మినహాయింపు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ గెలిచారు. అలాగే తన పార్టీలోకి రాదలచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారే తప్ప, అనైతికంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయం పాటించేవారు అరుదుగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ ఫిరాయింపులకు పరిష్కారం వెదకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్యవల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలలో పలచన అవుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు,పాలు, నీళ్ళకు నీళ్లు మాదిరి తేలిందని అన్నారు. కాని వాస్తవం వేరు. పాలల్లో నీళ్లు కలిశాయన్నది వాస్తవం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దానిని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సర్పంచ్ ఎన్నికలు.. 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు విజయం సాధించారు. అయితే, పంచాయతీ ఎన్నికలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలు జిల్లాల నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ సహా నేతలు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్‌ను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. కాగా, భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే ఉరుకునేది లేదని సీఎం రవంత్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు.. ఎల్లుండి మధ్యాహ్నం పీసీసీ ఛీఫ్, మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నేతలు విశ్లేషించుకోనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.హస్తం జోరు.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. మూడు విడతల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. మూడో విడతలో 4,159 స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీ 242 స్థానాల్లో, సీపీఐ 24, సీపీఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు.రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. మూడో విడతలో అత్యధికంగా 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది. -
కాంగ్రెస్ ఉంటే.. ప్రోగ్రెస్ ఉండదు
సిరిసిల్ల: కాంగ్రెస్ ఉంటే.. ప్రోగ్రెస్ ఉండదని.. రెండేళ్లలో ఒక్క పనైనా చేశారా? వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆరే సీఎం అని.. ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న ఆ పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. ‘హైదరాబాద్ ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని వివరించారు.పచ్చి అబద్ధాలు ఆడుతున్నారుఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పారు. ‘బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, ఢిల్లీలో రాహుల్‌గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి’అని మండిపడ్డారు. సీఎం ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారురైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో 117 పంచాయతీలకు 80 చోట్ల బీఆర్ఎస్ గెలవడమే దీనికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కొత్త కమిటీలు వేస్తాంకాంగ్రెస్ బెదిరింపులు, ఫోన్‌కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలని, వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటామని తెలిపారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
పేరులో ‘రామ్’తోనే కాంగ్రెస్ పరేషాన్
నిర్మల్: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన అర్థరహితమని, కొత్త పేరులో ‘రామ్’ అనే పదం ఉన్నందునే ఆ పార్టీ అభ్యంతరం చెబుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరో పించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను నిర్మల్‌లో శుక్రవారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో వందరోజులు మాత్రమే ఉన్న ఉపాధిహామీ పథ కాన్ని కేంద్రం 125 రోజులకు పెంచిందన్నారు.ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను వికసిత్ భారత్–జీ రామ్‌జీగా మార్చడంతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఉపాధి పథకం కొత్తపేరులో ‘రామ్’ అనే పదం ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఆ పార్టీలో ఉన్నది నిజమైన గాంధీలు కాదని విమర్శించారు. కేవలం పేరుకు మాత్రమే గాంధీ అని పెట్టుకున్నా రని, ప్రేమ ఏమాత్రమూ లేదని ఆరోపించారు.అందుకే.. అఖిలేశ్ వాళ్లని కలిశారుకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని రాంచందర్‌రావు ఆరోపించారు. అందుకే ఇటీవల సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ను కలిశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వి నియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీశ్‌బాబు పాల్గొన్నారు. -
రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే..
గజ్వేల్: కేసీఆర్ ప్రాతినిధ్యం వహి స్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని 179 పంచాయతీల్లో 92 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్సే గెలిచిందని, కాంగ్రెస్ 68 స్థానాలకే పరిమితం కాగా రేవంత్‌రెడ్డి లెక్కలు తారు మారు చేసి చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడారు.అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌ను కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారని, అందువల్లే అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నా, ఎంజీఎం ఆస్పత్రిలో రోగులను ఎలుకలు కొరుకుతున్నా సీఎంకు కనపడక పోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కండువాలను కప్పుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. -
‘రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి’
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల జిల్లా): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎటువంటి నోరు విప్పకుండానే 33శాతం సీట్లను గెలుచుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లను సిరిసిల్లలో కేటీఆర్ సన్మానించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ‘ ఎన్నికలు లేనట్లయితే జనవరి మాసంలో కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సభ్యత్వంలో తమ పాత్ర పోషించాలి. రాష్ట్రంలో 66 శాతం గెలిచాం అని ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు. 66 శాతం ప్రజలు నీవైపు ఉంటే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతోని దమ్ముంటే రాజీనామా చేయించు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరామని గతంలో బాహటంగానే చెప్పారు, ఇప్పుడేమో కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరియు స్పీకర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఒక బతుకేనా?, గడ్డి పోచలాంటి పదవి కోసం సూరు పట్టుకొని గబ్బిలం వేలాడినట్లు వేలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలలో ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత బెదిరించినా రాజ్యాంగ బద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు వచ్చే నిధులు ఎవరు ఆపలేరు. రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి మల్లీ కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుపుకుందాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
పంచాయతీ ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీల్లోని కొందరు నేతలే కారణమని అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమేంటో ఆ వివరాలన్నీ పీసీపీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తాను. వనపర్తిలో నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేశారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు. వనపర్తి నియోజకవర్గంలోని 140 పంచాయతీల్లో 85 సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. 60.66% ఓటు శాతం వచ్చింది. బీఆర్ఎస్కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం 36% వచ్చింది. అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుంది అనేది అందరూ గ్రహించాలి. గ్రామ పంచాయతీ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 92407 ఓట్లు వచ్చాయి.. బీఆర్ఎస్కు 59788 ఓట్లు వచ్చాయి. రెండింటిని చూస్తే వారికన్నా కాంగ్రెస్‌కు 35.09% అధికంగా వచ్చాయి. ఎన్నికల ఓటు పర్సంటేజ్ విషయంలో బీఆర్ఎస్కు ఓటు శాతం తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా వాళ్ళు కిందికి పడిపోవడం ఖాయం.మా కాంగ్రెస్ పెద్ద మనిషి చిన్నారెడ్డి నియోజకవర్గంలోనే 15 గ్రామాలలో కావాలని పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ వాళ్లకు సపోర్ట్ చేశారు. బీఫామ్స్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నామీద కోపం తీర్చుకోవాలి కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వనపర్తి ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం. చిన్నారెడ్డి పంచాయతీ ఎన్నికలలో ఓటర్లకు ఫోన్లు చేసి కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు.. బీఆర్ఎస్కు ఓటు వేయమని చెప్పిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని అభ్యర్థులను ఓడించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రేవంత్ టాప్.. ఆ తర్వాత ఉత్తమ్.. వివేక్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు తమ పట్టు నిలుపుకున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని మూడు విడతల్లో వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఎక్కువమంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్), సీతక్క (ములుగు) ఉన్నారు. ఈ ముగ్గురి నియోజకవర్గాల్లో 75 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందడం విశేషం. » కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), శ్రీధర్‌బాబు (మంథని), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) నియోజకవర్గాల్లో కూడా 70 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. » 60 శాతం కంటే ఎక్కువ అధికార పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో మధిర, అందోల్, పాలేరు ఉన్నాయి. » మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లో కూడా దాదాపు 60 శాతం స్థానాల్లో హస్తం పార్టీ సహకారంతోనే సర్పంచ్‌లుగా గెలిచారు. వాకిటి శ్రీహరి (మక్తల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)లలో 50–60 శాతం మధ్యలో విజయం దక్కించుకోగలిగారు. » అత్యల్పంగా వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) నియోజకవర్గంలో 50 శాతం కంటే కొంచెం తక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. సగం చోట్ల బీజేపీ సున్నా.. రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. హుజూర్నగర్, ములుగు, మధిర, పాలేరు, ఖమ్మం, చెన్నూరు స్థానాల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోలేకపోయారు. » మంత్రుల నియోజకవర్గాల్లో కొల్లాపూర్, హుస్నాబాద్‌లలో మాత్రమే బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురైందని ఫలితాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. » కొడంగల్‌లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. » స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీలు కలిపి మంత్రుల నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగడం విశేషం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఏకంగా 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా గెలిచింది స్వతంత్రులే. బీఆర్ఎస్ బలపర్చిన వారు స్వతంత్రు లతో పోలిస్తే సగం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. స్వతంత్రులు ప్ర భావం చూపిన నియోజకవర్గాల్లో మధిర, కొల్లాపూర్, పాలేరు, మంథని, హుస్నాబాద్‌లు కూడా ఉండడం గమనార్హం. -
ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని తాము ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నిజమయ్యాయని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్రంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో గురువారం బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. గాందీభవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు గాంధీభవన్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అదే జరిగిందన్నారు. న్యాయం గెలవడానికి సమయం పట్టవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమేనని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంపై కావాలనే అక్రమ కేసులు పెట్టి రాజకీయంగా వేధించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. బీజేపీ రాజకీయ వేధింపులు: మహేశ్‌గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాందీ, సోనియా గాం«దీలపై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ కోర్టులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టివేయడం ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసులో సత్యమేంటో దేశానికి తెలిసిందని అన్నారు.స్వాతంత్య్రకాలం నుంచే ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశానికి సేవ చేసిన పత్రిక అని, అలాంటి పత్రికను, దేశం కోసం ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారని, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత కాగా గాందీభవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ హడావుడిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయతి్నంచాయి. -
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని విజయం
సాక్షి, యాదాద్రి: వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, అధినేత కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని, భవిష్యత్‌లో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పునాది వేసిందన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. వారిని సన్మానించిన అనంతరం మాట్లాడారు. పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న నానుడిని నిజం చేస్తూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడినా.. నేడు భువనగిరి జిల్లా వ్యాప్తంగా 161 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలు.. పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వికృత రాజకీయం కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్లగొండలో అభ్యర్థిపై దాడిచేసి అమానవీయంగా మూత్రం తాగించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో రీకౌంటింగ్ పేరిట మన గెలుపును దొంగిలించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు. మూడు ఫీట్లు ఉన్నా.. 30 ఫీట్ల డైలాగులు సీఎం రేవంత్‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా.. ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మోసపోయామని క్షేత్రస్థాయిలో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలది సిగ్గులేని రాజకీయం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోచారం, కడియం వంటివారు 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని చెప్పారు. స్పీకర్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్టు నటిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీల డిన్నర్ మీటింగ్
ఢిల్లీ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో కాసేపటి క్రితం తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గొడం నగేశ్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ బీజేపీ ఎంపీల పని తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది’
యాదాద్రి(భువనగిరి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. దీనిలోభాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 సర్పంచులు 20 మంది ఉపసర్పంచ్లు 1000 వార్డులు గెలిచాం. రాష్ట్రంలో 900 సర్పంచులు 1200 ఉపసర్పంచ్లు 10,000 మంది వార్డులను గెలిచాం. గతంలో 162 సర్పంచ్ స్థానాలను ఉండేది. గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ బలం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతి, అరాచకంతో గెలిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ పథకాల పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది వారి అవినీతి గురించి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మినిస్టర్ పీఏలు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తి రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ పార్టీనే ఫిరాయింపుల మొదటి ప్రోత్సహించింది. ప్రభుత్వం ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీ సోనియాగాంధీ వారి వారి కేసులలో బెయిల్ పై ఉన్నారు. బీజేపీ వారిపై కేసు పెట్టలేదు దర్యప్తు సంస్థలు కేసు పెట్టాయి. మా పార్టీ కార్యాలయంలపై దాడి చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి:హైదరాబాద్ పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ -
‘పోయేకాలం వచ్చింది’.. కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్
స్టేషన్ ఘన్పూర్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. కడియం శ్రీహరి రాజకీయ నైతికతను పూర్తిగా కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.“రామా.. కృష్ణా అనుకుంటూ జీవించాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు” అంటూ రాజయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచి, అదే పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గతంలో అనేకసార్లు తాను కాంగ్రెస్‌లో చేరానని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. “నీ నీతిమాలిన మాటలతో సభ్య సమాజమే సిగ్గుపడుతోంది” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల వద్దకే వెళ్లిపోతావా అని ప్రశ్నించారు. ప్రజలకు తన రాజకీయ వైఖరిని ఎలా సమర్థించుకుంటావని నిలదీశారు.అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. “సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలి” అంటూ కడియం శ్రీహరికి హితవు పలికారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అడుగుపెడితే తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన రాజయ్య, ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు. -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం
సిద్దిపేట జిల్లా: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. గోపాల్ ‘తీన్’మార్! దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్‌పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
ఆ అభిప్రాయం తప్పని తేలింది
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా సంతృప్తి కలిగించే ఫలితాలు రాకపోయినా ఒక మోస్తరు మంచి ఫలితాలనే సాధించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీ పట్ట ణప్రాంతాలకే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉన్నా...దానిని ఈ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ద్వారా తప్పు అని నిరూపించగలిగామని అంటున్నారు. బుధవారం జరిగిన మూడోవిడత ఎన్నికల ఫలితాలతో కలిపి మొత్తంగా 700 దాకా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్టుగా వారు అంచనా వేస్తున్నారు. మొదటి విడత కంటే కూడా రెండు, మూడు విడతల్లో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో గణనీయమైన స్థానాలు సాధించామని, ఇతర జిల్లాల్లోనూ కనీస ప్రాతినిధ్యం దక్కడంతో మొత్తంగా గ్రామీణ పాంతాల్లో గట్టి ఉనికిని ప్రదర్శించినట్టయ్యిందని చెబుతున్నారు. 900 మంది వరకు మా వాళ్లే: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు మూడు విడతల్లో కలిపి మొత్తంగా 800 నుంచి 900 వరకు (ఇండిపెండెంట్లు కలుపుకొని) సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ బలపరిచినవారు విజయం సాధించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీ బలంగా చొచ్చుకు వెళ్లిందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ విధంగా క్షేత్రస్థాయిలో పెరిగిన పార్టీ బలం త్వరలోనే రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. పెద్దసంఖ్యలో వార్డుసభ్య స్థానాలను, ఉప సర్పంచ్‌లను సైతం గెలుచుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మొత్తంగా పార్టీకి బలంగా ఉన్న ప్రాంతాలు..ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో 163 మంది సర్పంచ్‌లకే బీజేపీ పరిమితం కావడాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలల్లో ఎన్నికలు జరిగితే 6 నుంచి 7 వేల గ్రామాల్లోనే అభ్యర్థులను నిలపాగలిగామని రాంచందర్‌రావు తెలిపారు. భద్రాచలం, మహబూబాబాద్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామటుకు పోటీకి నిలబెట్టలేకపోయామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీకి పట్టున్న అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు. -
బీఆర్ఎస్లో ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి ఊపిరి పోశాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేదు ఫలితాలను చవి చూసిన పార్టీలో.. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫలితాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. గ్రామాల్లో తమ పట్టు చెక్కు చెదరలేదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కనీసం 40 శాతం సర్పంచ్ పదవులు పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కేడర్ చెక్కు చెదరలేదు! పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను స్థానికంగా సమన్వయం చేసుకుని పట్టుదలతో పనిచేయడం వల్లే అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చామనే అభిప్రాయం బీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, పట్టుదల నాయకత్వానికి స్ఫూర్తినిచ్చేలా ఉందనే అభిప్రాయం పైస్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపం, గ్రూపు తగాదాలు, పాలన వైఫల్యం, పల్లెల్లో అభివృద్ధి కుంటుపడటం కూడా తమకు కలిసి వచ్చాయని గులాబీ దళం విశ్లేషిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి చోట్ల మినహా ఎక్కడా పెద్దగా బీజేపీ ప్రభావం కనిపించలేదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు..ఆ పార్టీ బలపడిందనడానికి నిదర్శనం కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నూతనోత్సాహంతో ముందుకు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల దిశగా సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయడం, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాల సంబంధిత షెడ్యూల్‌ను పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించే అవకాశముంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీకి అధికార కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మరింత దూకుడుగా వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు కార్యాచరణపై గట్టిగా దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను విశ్లేషించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలహీనతలపైనా పోస్ట్‌మార్టమ్ చేయాలని భావిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఇతర పార్టీల్లోకి నేతల వలసలు, ఫిరాయింపులతో బలహీన పడిన నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
మూడో విడతలో 85.77%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తుది విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% ఓటింగ్ రికార్డయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం ముగియగా, ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది పూర్తయ్యాక విజేతలను ప్రకటించారు. బుధవారం రాత్రికల్లా దాదాపుగా కొన్నిచోట్ల మినహా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయింది.తుది విడతలో ఇలా....182 మండలాల్లో మొత్తం 4,159 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 సర్పంచ్‌లు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పంచాయతీలు, 18 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఈ దఫాలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56% కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, ఖమ్మం 88.84%, నల్లగొండ జిల్లా 88.72% నిలిచాయి. ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువైంది. వలసలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో పురుష ఓటర్లు తక్కువగా ఉండటం కొంత వరకు ప్రభావం చూపింది. అత్యల్పంగా నిజామాబాద్ 76.45%, రాజన్న సిరిసిల్ల 79.14%, జగిత్యాల 79.64% నమోదైంది. మూడు విడతలోనూ కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు, అక్కడకక్కడ ఉద్రికత్తలు మినహా మిగిలినచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్‌ను విరివిగా వినియోగిస్తాం : సీఎస్ రామకృష్ణారావు మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినితో కలిసి సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ డా.జి. సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరందం ఉన్నారు. -
కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభం అయిందని, రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కాకతప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది భారత్ రాష్ట్ర సమితే అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని పేర్కొన్నారు. సీఎంకు ముచ్చెమటలు..పంచాయతీ ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా అధికార పక్షం వైపు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రుల్ని మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడింది. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన ‘జంగ్ సైరన్’..’ అని కేటీఆర్ అభివర్ణించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయడం, రైతుబంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలు అధికార పార్టీపై ప్రజల ఆగ్రహానికి కారణమని చెప్పారు.ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందికాంగ్రెస్ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను వీరోచితంగా తట్టుకుని బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ‘ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం..’ అని అభివర్ణించారు. ‘యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సువంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అరాచక కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..’ అని ఆయన పేర్కొన్నారు. -
హస్తం.. హ్యాట్రిక్
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో హుషారు రేకెత్తించేలా గ్రామీణ ఓటరు తీర్పు ఇచ్చాడు. ఇంకోవైపు బీజేపీలోనూ ఈ ఎన్నికలు జోష్ పెంచాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ అగ్రస్థానంలో నిలవగా, బీఆర్ఎస్, బీజేపీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అయితే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈసారి గణనీయ సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో మూడో వంతు స్థానాల్లో తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించడం.. ప్రభుత్వ పనితీరుపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనగా అధికార పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నారు.అయితే అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకుని తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారని, ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియచేస్తోందని విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మరింత జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారిగా వందల సంఖ్యలో పంచాయతీల్లో పాగా వేయడంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మరిన్ని స్థానాలు గెలిస్తే బావుండునన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. 1205 పంచాయతీలు ఏకగ్రీవం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 12,728 గ్రామపంచాయతీలకు గాను ఏకగ్రీవాలు 1205 పంచాయతీలు, నామినేషన్లు వేయని పంచాయతీలు 21, కోర్టు స్టేలతో ఎన్నికలు జరగని 5 స్థానాలను మినహాయిస్తే 11,497 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు 7135 పంచాయతీల్లో విజయం సాధించారు.ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3508 పంచాయతీల్లో గెలుపొందగా, బీజేపీ దాదాపు 674 గ్రామాల్లో పాగా వేసింది. ఇలావుండగా.. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొని 1385 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. -
అర్హతా.. అనర్హతా.. ఏం చెప్పబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మొదటి దశ విచారణలో భాగంగా.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం ఏంటి?.. ఐదుగురిపై వేటు వేస్తారా? లేదంటే ఫిరాయింపే లేదంటారా? స్పీకర్ ఏం చెప్పబోతున్నారు?.. అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల అడ్వొకేట్లకు మధ్యాహ్నాం రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. ఆపై శాసనసభ వెబ్సైట్లో తీర్పు ప్రతులను అధికారులు అప్లోడ్ చేయనున్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ BRS (భారత రాష్ట్ర సమితి) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు డెడ్‌లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. నిర్ణయం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మాత్రం స్పీకర్ నోటీసులకు వివరణలు ఇచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని చర్చా నడుస్తోంది. -
వాళ్లు మెంటలోళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీ వ్రంగా మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్లో ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశం, అక్కడ చర్చించిన అంశాలు బయటకు రావడం చర్చకు వచ్చింది. దీనిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అక్కడ జరిగింది వేరు.. మీడియాలో వచ్చింది వేరు.పార్టీని, సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. అక్కడ చర్చించిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా ఆదేశించారు. అయినా.. ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది వేరైతే మీకు చెప్పింది వేరు. వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండటం దురదృష్టకరం: మోదీపై ఏఐసీసీ అగ్రనేత రా హుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢి ల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్‌చో ర్–గద్దీ ఛోడ్ మహాధర్నాలో ప్రధానిపై రాహుల్ తీవ్ర వ్యా ఖ్యలు చేయడం సరికాదు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రా హుల్ వ్యాఖ్యలున్నాయి. రాహుల్ లాంటి ప్రతిపక్ష నేత మన కు ఉండటం దురదృష్టకరం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించా...‘తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సోమవారం చర్చించాను. 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించాం. రూ. 400కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగి రిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశపైనా మాట్లాడాం. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరాను’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్‌నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగొద్దుఎవరి బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్‌రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్‌లకే ఉంటుందన్నారు.ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్‌నాయక్ పాల్గొన్నారు. -
తుదివిడత పంచాయతీ నేడే..
సాక్షి, హైదరాబాద్: తుదివిడత పల్లె పోరుకు సర్వం సిద్ధ మైంది. బుధవారం జరగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. మంగళవారం పోలింగ్‌కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. సాయంత్రంకల్లా పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
పల్లెల్లో దాడులపర్వం
పంచాయతీ ఎన్నికల వేళ... పచ్చని పల్లెలు భగ్గుమంటున్నాయి. ఓటు వేయలేదనే నెపంతో కొందరు... తమకు సహకరించలేదనే కారణంతో మరికొందరు దాడులకు పాల్పడుతున్నారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడినర్సంపేట/దోమ/శంకరపట్నం: వరంగల్ జిల్లా చెన్నారా వుపేట మండలం చెరువుకొమ్ముతండాకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధ రాత్రి తండాలోని దుర్గమ్మ గుడి వద్ద కాంగ్రెస్ బలపరిచిన ఎనిమిదో వార్డు అభ్యర్థి కొర్ర మోహన్, కార్యకర్తలు సుమన్, రమేశ్, బోడ రాందాస్, పవన్, అజయ్, బాలు, రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు చలిమంట కాగు తున్నారు. ఈ సమయంలో బోడతండాకు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు బోడరెడ్డి, వెంకన్న, శ్రీను, ప్రసాద్, శ్రీనివా స్ అదే దారి గుండా వెళుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. అంతేకాక తీవ్ర పదజాలంతో దూషిస్తూ చలిమంట కాగుతున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తండావాసులు గమనించి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడిమూడోవిడత ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా రాకొండ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అర్జున్ బరిలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం దాటిన తర్వాత ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అర్జున్‌కు గాయాలవ్వగా, స్థానికులు వెంటనే అతడిని పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ స్నేహమెహ్ర ఆరా తీశారు. బాధితుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఓటెయ్యలేదని బాలింతపై...కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్కు చెందిన ఖమురున్నిసా పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. దీంతో కలత చెందిన ఆమె కుటుంబసభ్యులు యాస్మిన్, హకీంలు.. దాసరి పద్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. పద్మ కూతురు ప్రియాంక బాలింత అయినా, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు.అక్కడ సర్పంచ్ ఎన్నిక నామమాత్రమే..దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్‌తండా(తూర్పు) సర్పంచ్ పదవికి లకావత్ భాగ్యనాయక్ పోటీ చేయగా, ప్రత్యర్థులు ఏకగ్రీవానికి అంగీకరించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి లకావత్ శ్రీను తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. మరుసటి రోజు తాను పోటీలో నుంచి తప్పుకుంటానని ప్రకటించి ప్రచారం చేయలేదు. దీంతో అక్కడ సర్పంచ్ ఎన్నికకు పోటీ లేదని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో 8 వార్డులుండగా, 3 ఏకగ్రీవమయ్యాయి.సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నంరఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండా సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుగులోత్ చింతామణి భర్త రంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరగ్గా..పంచాయతీ పరిధిలోని సుకినీతండా పోలింగ్‌బూత్‌లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ మూడు రోజుల క్రితం రాంబాబు సెల్‌టవర్ ఎక్కగా స్థానికులు, అధికారుల చొరవతో దిగొచ్చాడు. అయితే రంగా మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సందర్భంగా చింతామణి మాట్లాడాడుతూ పలువురు దొంగ ఓట్లు వేశారని, చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్లు కూడా పోల్ అయ్యాయని ఆరోపించారు.సార్లరావులపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయండిహైకోర్టును ఆశ్రయించిన పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సార్లరావులపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్ పదవికి ఇస్లావత్ శ్రీకాంత్, జర్పుల ప్రవీణ్, ఇస్లావత్ శ్రీను, నేనావత్ గణేశ్, బానావత్ బాలు నామినేషన్లు వేయగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇస్లావత్ శ్రీను ఒక్కరే బరిలో ఉండగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన పలువురు తమను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు విత్‌డ్రా చేయించారని ఆరోపిస్తూ ప్రవీణ్, గణేశ్, శ్రీకాంత్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.ఇంట్లో కూర్చున్నా 208 ఓట్లు తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ సర్పంచ్ స్థానానికి పటేల్ సుదర్శన్‌రెడ్డి, పటేల్ విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషణ్లు దాఖలు చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డిని విత్‌డ్రా చేయించి, సుదర్శన్‌రెడ్డిని ఏకగ్రీవం చేయాలని గ్రాబపెద్దలు నిర్ణయించారు. అప్పటికే వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అయితే విజయ్‌కుమార్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. దీంతో తాండూరులో ఉండే విజయ్‌కుమార్‌రెడ్డిని గ్రామస్తులు ఊర్లోకి రానీయలేదు. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా తాండూరులోనే ఉండిపోయారు. 11వ తేదీన తొలివిడత పంచాయతీ ఎన్నిక లు జరగ్గా, విజయ్‌కుమార్‌రెడ్డికి 208, సుదర్శన్‌రెడ్డికి 469 ఓట్లు వచ్చాయి.పైసలిస్తారా.. ప్రమాణం చేస్తారా..! చింతలమానెపల్లి(సిర్పూర్): రెండోవిడత జరిగిన ఎన్నికల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వగాడి శంకర్‌కు 338 ఓట్లు రాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి 361 వచ్చాయి. శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మంగళవారం గ్రామంలోని ఓటర్లను డిమాండ్ చేశారు. పళ్లెంలో పసుపు కలిపిన బియ్యాన్ని వేసి తనకే ఓటేసినట్టు పసుపు బియ్యం పట్టాలంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఎన్నికల్లో రూ.8 లక్షలు పంచినా గెలువలేదని, తనను ఓటర్లు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ 69 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలుతలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారి ఈ పంచాయతీకి 1956లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుంచి ప్రతిసారీ గ్రామస్తులు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈసారి సర్పంచ్ బరిలో ఇద్దరు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. పంచాయతీ పరిధిలో 10 వార్డులుండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గ్రామస్తులు బుధవారం పంచాయతీ ఓట్లను వినియోగించుకోనున్నారు.


