breaking news
-
Election Results: ప్చ్.. ఎగ్జిట్ ఎవరికో?
అది 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైం. దశలవారీగా పోలింగ్ జరుగుతూ వస్తోంది. ఫలితాలకు కొన్నిరోజుల ముందు దాదాపుగా ఓ 20 సర్వే సంస్థలు ఎగేసుకుని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. అందులో సగానికిపైనే బీజేపీ 90కిపైనే స్థానాలు సాధిస్తుందని.. మరికొన్నేమో ఏకంగా బంపర్ విక్టరీ సాధిస్తుందని చాటింపేసుకున్నాయి. తీరా ఫలితాలు చూస్తే ఒకటి, రెండు సర్వేలు మాత్రమే ఆ అంచనాల్ని అందుకోగా.. మిగతావన్నీ బొక్కాబోర్లా పడ్డాయి. బీజేపీ 77 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చేశాయోచ్.. అని అవి పట్టుకుని అటు బిజీబిజీ చర్చావేదికల్లో పాల్గొనే నేతలు, ఇటు గుంపుగా గుమిగూడి ఓ తెగ మాట్లాడేసుకునే జనాలు.. ఎవరు గెలుస్తారనేది చెప్పేశాం, మా బాధ్యత తీరింది అని చేతులు దులిపేసుకునే సర్వే సంస్థలు.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలివే. మరి తీరా ఫలితం వచ్చాక ఆ అంచనాలు సరిపోలుతాయా? అంటే.. తలకిందులే అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గతం గుర్తు చేస్తోంది. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ను, అసలు ఫలితాలను గమనిస్తే... చాలా సంస్థలు ఓటరు నాడిని పసిగట్టడంలో బోల్తా పడ్డాయని అర్థమైపోతుంది. ఆ టైంలో ప్రముఖ ఛాన్సెల్స్ ఎగ్జిట్ పోల్స్ సగటుకు, అసలు ఫలితాలకు భారీతేడా కనిపించింది. అప్పట్లో ఈ సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. యూపీఏకు అధికంగా సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో.. ఎగ్జిట్‌పోల్స్ ఎక్కువసార్లు అంచనాల్ని అందుకోలేకపోతూ వస్తున్నాయి. పక్కా ఫలితం.. అంత వీజీ కాదు ఎగ్జిట్‌పోల్స్‌కు కచ్చితత్వం.. శాస్త్రీయతలు ఉన్నాయా?.. ఆ సంగతిని పక్కనపెడితే.. మీడియా సంస్థలపై ఎగ్జిట్ పోల్స్ ఒత్తిడి మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఓటర్ పల్స్ ఏంటన్నది టీవీ ఛానళ్లకు కచ్చితంగా దొరకడం లేదు. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి అభిప్రాయ సేకరణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతా అయ్యాక చూస్తే.. ఓటర్ ఏకంగా ‘అంతరిక్ష పల్టీ’ కొడుతున్నాడు. ఓటు వేసేది ఒకరికని అభిప్రాయ సేకరణలో చెప్పి.. పోలింగ్ టైంలో మరొకరి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్ సర్వే సంస్థలు మాత్రం కేవలం ఒక్క శాతం, రెండు శాతమో అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా? సారీ తప్పైంది! ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు. ఒక్కోసారి ఆ అంచనాలు అందుకోవచ్చు.. లేదంటే దరిదాపుల్లో ఉండొచ్చు. కానీ, ఓటర్ నాడి పసిగట్టలేక ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాలే ఎక్కువున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఎగ్జిట్‌పోల్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి కూడా. ఉదాహరణకు 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్నీ తప్పాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్డీటీవీ ఒక అడుగు ముందుకేసింది. ‘‘క్షేత్రస్థాయిలో జరిగిన సమాచార సేకరణ మొత్తం తప్పైంది. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..’’ అంటూ ఎన్డీటీవీ కో చైర్పరసన్ ప్రణోయ్ రాయ్ బహిరంగ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆ మీడియా సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. #BiharResults Final party wise breakdown: RJD 80, JDU 71, BJP 53, INC 27, LJP 2, RLSP 2, HAM 1, CPI 3, Independent 4 — ANI (@ANI) November 8, 2015 సర్వే సంస్థల్లో లోపిస్తోన్న అంశాలు వయస్సు పరంగా ఓటర్లను కలవాలి (యువత, వృద్ధులు, మధ్య వయస్సు) వృత్తి పరంగా ఓటర్లను కలవాలి (రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు) మతం ప్రాతిపదిక తీసుకోవాలి (హిందూ, ముస్లిం, క్రిస్టియన్) కులం ప్రాతిపదిక ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) జెండర్ ప్రాతిపదిక ఉండాలి (పురుషులు వేరు, మహిళల ఓటు తీరు వేరు) ప్రాంతం అత్యంత కీలకం (నగరం, పట్టణం, గ్రామం, కొండ ప్రాంతం, అటవీ సమీప ప్రాంతం) ఓటర్లకు విసుగెత్తి.. ప్రస్తుతం మార్కెట్లో సర్వే చేస్తోన్న సంస్థలో శాస్త్రీయత లోపించడం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే.. సర్వే చేపడుతున్న సెఫాలజిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ప్రశ్నల్లో స్పష్టత లేకపోవడంతో.. ఓటర్లు ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఈ విషయంలో చాలా సార్లు లోపం కనిపిస్తోంది. పైగా ఓటరు కచ్చితంగా ఎటు ఓటు వేస్తాడనే దానిపై పక్కా అభిప్రాయం రాబట్టాలని.. చాలా ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా జరిగే సర్వేల సంగతి సరేసరి. పదే పదే ఓటర్లకు ఫోన్లు చేసి విసిగిస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో సాధారణంగానే చికాకులో ఉండే ఓటర్లు ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. విద్యార్థుల్ని ఇలాంటి వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో అసలు ఫలితం చాలా సార్లు తేడా కొడుతోంది. ఈసీ ఏమందంటే.. ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనూ స్పందించింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అనేవి తెర వెనుక వ్యవహారాలు. వాటిని అసలు అనుమతించకూడదని అన్నారు. ‘‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఇవి కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీటిని వ్యతిరేకించారనే విషయాన్ని ఆ సందర్భంలో ఆయన గుర్తు చేశారు కూడా. నేతలది అలాంటి మాటే.. తమకు అనుకూలంగా వస్తే మంచిది. లేకుంటే చెడ్డది. ఎక్కడైనా ఇది కనిపించే తంతే. అయితే.. ఎగ్జిట్‌పోల్స్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అనేకం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. న్యూసెన్స్ అంటూనే ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని, పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. పోలింగ్ సమయం అధికారికంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటలకు. అర గంట తర్వాత ఎగ్జిట్‌పోల్స్ బయటకు వచ్చాయి. కానీ, తెలంగాణలో పోలింగ్ కోసం ఓటర్లు సాయంత్రమే ఎక్కువగా వచ్చారని.. రాత్రి 10 గంటలదాకా ఓటింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొచ్చా?.. పోనీ ఆ అంచనాలే ఫలిస్తాయా?.. తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే. -
పొలిటికల్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాలుగో తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుందని తెలిపారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు.. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్‌లో కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. -
కేసీఆర్ ప్రకటనలోని మర్మం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులపై చేసిన ఒక ప్రకటన అందరిని ఆకర్షించింది. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి తనను గెలిపించితే, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరతానని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌కు తన పార్టీ వారు ఎవరో చెప్పారట.దానిని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రస్తావించి ఆ కాంగ్రెస్ అభ్యర్ధి మాటలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయవద్దని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోనని అన్నారు. ఒరిజినల్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్న దివాకరరావునే ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ✍️ఎన్నికలలో గెలవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి మాత్రం రివర్స్ వ్యూహంలోకి వెళ్లినట్లు అనుకోవాలి. కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన ఖండించి ఉండవచ్చు. కాని కేసీఆర్ ప్రకటనలోని మర్మం గురించి ఆలోచించాలి. ఒకవేళ హంగ్ వస్తే పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక పార్టీకి వేవ్ వస్తే గొడవ లేదు. తాజా సర్వేలలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రావచ్చని చెబుతున్నాయి. అయినా హంగ్ వస్తుందని నమ్మేవారు కూడా లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తన గెలిచిన అభ్యర్దులను బెంగుళూరు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ✍️బొటాబొటి మెజార్టీతో కాని, ఎవరికి మెజార్టీ రాని పక్షంలో కాని ఫలితాలు వస్తే మాత్రం పార్టీ మార్పిడులు పెద్ద ఎత్తునే ఉండవచ్చు. కాంగ్రెస్ బొటాబొటిగా అధికారంలోకి వచ్చినా అదే పద్దతి అవలంభించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రాకపోతే మాత్రం ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్లోకి జంప్ చేసే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది నమ్మకం. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని వీలైతే అంతమందిని ఆకర్షించడానికి ప్లాన్ చేయవచ్చు. ✍️ఎందుకంటే గత రెండు టరమ్‌లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే వ్యూహం అవలంభించి కాంగ్రెస్‌ను బాగా బలహీనపరచడానికి యత్నించారు. మొదట 2014లో కేసీఆర్ ఈ ఆలోచన చేయకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి రేవంత్‌రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించడం, తదుపరి ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. ✍️ఆ తర్వాత కేసీఆర్ మొత్తం వ్యూహం మార్చి అప్పట్లో టీడీపీకి ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని, కాంగ్రెస్‌లో ఉన్న 21 మందిలో పది మంది వరకు బీఆర్ఎస్లోకి లాగేశారు. ఆ వ్యూహం ఫలించి 2018 ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రజలు కేసీఆర్‌కు 88 సీట్లతో భారీ ఎత్తున పట్టం కట్టారు. అయినా కేసీఆర్ ఈసారీ వదలిపెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందికి గాను పన్నెండు మందిని బీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు. ఈ రెండు పార్టీలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ✍️దాంతో క్యాబినెట్ హోదాలో ఉన్న సీఎల్పి నేత మల్లు భట్టి కి ప్రతిపక్ష నేతగా కూడా ఉండలేకపోయారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం. నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఆ హోదా దక్కింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దపడుతుంది. బీఆర్ఎస్ను ఎంత వీలైతే అంత బలహీన పర్చడానికి యత్నిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ ఫిరాయిస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు. బీజేపీ నేతలు అదే విషయాన్ని పదే, పదే ప్రచారం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ తాను ఈసారి కాంగ్రెస్ నుంచి గెలిచినవారిని చేర్చుకోనని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ✍️ఆయన నిజంగా అలా చేస్తారా?. లేక కాకతాళీయంగా మంచిర్యాలలో రాజకీయంగా నష్టం జరగకుండా ఉండడానికి, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రచారం చేస్తుంటే దానిని తిప్పి కొట్టడానికి ఇలా మాట్లాడారా అన్నది తెలియదు. ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు కాని, ఫిరాయింపులు ఉండవంటే మాత్రం ఆశ్చర్యమే కలిగిస్తుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులు అంత అడ్డగోలుగా జరుగుతుంటే చర్య తీసుకోవలసిన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బీజేపీ సైతం ఇదే తరహాలో ఉంటోంది.గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే పద్దతి అవలంభించి, ఆ తర్వాత కాలంలో బాగా నష్టపోయింది. ✍️ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అది పెద్ద వివాదం అయింది. అయినా వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి ఎక్కడా భయపడకుండా ముందుకు వెళ్లి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన టీడీపీని ఖతం చేయాలనే లక్ష్యంతో పనిచేయలేదు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో నామమాత్రపు బలాన్ని మిగిల్చినా, ఇప్పుడు ప్రధాన పోటీని ఎదుర్కోక తప్పలేదు. అందువల్ల ఫిరాయింపులు జరిగినంత మాత్రాన అన్నిసార్లు అనుకూల ఫలితం వస్తుందని అనుకోలేం. గతంలో కూడా ఇలాంటివి జరగక పోలేదు. ✍️1978 శాసనసభ ఎన్నికలలో 180 సీట్లతో కాంగ్రెస్ ఐ అధికారంలోకి రాగా, జనతా పార్టీకి 60, కాంగ్రెస్ ఆర్ కు 30 సీట్లు వచ్చాయి. కాని 1983 వచ్చేసరికి జనతా, కాంగ్రెస్ ఆర్ పార్టీలకు చెందిన తొంభై మందిలో ఐదారుగురు తప్ప అందరూ అధికార కాంగ్రెస్ ఐ లో చేరిపోయారు. అయినా 1983లో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పట్లో కొత్తగా వచ్చిన టిడిపి అధికారాన్ని కైవసం చేసుకుంది. 1984లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు టీడీపీలో చీలిక తీసుకు వచ్చినా అది నిలబడలేదు. నెల రోజుల వ్యవధిలో ప్రజాందోళన, మెజార్టీ టిడిపి ఎమ్మెల్యేలు ఎన్.టి.ఆర్.వెంట ఉండడంతో తిరిగి ఆయన ప్రభుత్వం ఏర్పడింది. ✍️1991లో పివి నరసింహారావు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికిగాన టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. అయినా 1994లో తిరిగి ఎన్.టి.రామారావు భారీ మెజార్టీతో ఎపిలో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కాని 1995లో ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఎన్.టి.ఆర్. వెంట సుమారు ముప్పైఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన ఆకస్మిక మరణంతో టీడీపీని పూర్తి స్థాయిలో చంద్రబాబు కైవసం చేసుకున్నారు. ✍️1999లో వివిధ పరిణామాలతో తిరిగి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. 2004 లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇరవై ఆరుగురిలో పది మంది పార్టీపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు కూడా గురయ్యారు. దీనివల్ల పార్టీకి పెద్ద సానుభూతి రాలేదు. 2009లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పది సీట్లకే పరిమితం అయింది. టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల కూటమిని ఓడించి కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి రాగలిగింది. ✍️2014లో పవర్ లోకి వచ్చిన చంద్రబాబు వైసీపీని దెబ్బతీయాలని ఫిరాయింపులను ప్రోత్సహించినా 2019 ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డారు. కేవలం ఫిరాయింపుల వల్లే పార్టీలు బలపడతాయనో, బలహీనపడతాయనో అనుకోవడానికి లేదని ఈ అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితులు, నాయకత్వం తదితర అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ అనుభవాల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఫిరాయింపుల పర్వాలు ఎలా ఉంటాయో తెరపై చూడాల్సిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఖానాపూర్‌లో నువ్వా-నేనా-ఆయనా?
హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నిర్మల్ జిల్లాలో ఉంది ఖానాపూర్ నియోజకవర్గం. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమెల్యేను కాదని.. కేటీఆర్ సన్నిహితుడు, ఫారిన్ రిటర్నీ అయినా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి వెడ్మ బొజ్జు, బీజేపీ నుంచి ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,06,985.. మహిళా ఓటర్లు 1,10,667.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 13 మంది.. సర్వీస్ ఎలక్టోర్లు 416.. మొత్తంగా 2,18,081 ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్‌లో 2018 ఎన్నికల్లో 80.87 శాతం పోలింగ్ రికార్డ్ కాగా.. ఈసారి మాత్రం 77.46 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో.. ‘అభివృద్ధి’తో పాటు మారిన రాజకీయ సమీకరణాలు ఇక్కడి ఓటర్లపై ప్రభావం చూపించి.. అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపించేలా ఉన్నాయి. -
TS Elections Result: చెన్నూర్‌లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్‌బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
మలక్‌పేటలో మళ్లీ మజ్లిస్ ?
దిల్సుఖ్నగర్/చంచల్‌గూడ: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. మలక్‌పేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రణరంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో నెలకొంది. గత మూడు పర్యాయాల నుంచి ఎంఐఎం సిట్టింగ్ సీటు కావడంతో ఈసారి కూడా అభ్యర్థి అహ్మద్ బలాలా నాలుగోసారి విజయం నమోదు చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మైనార్టీ ఓట్లు, అభివృద్ధి, హిందువుల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న బలాలా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టి సారించాడు. బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన పలు కుల సంఘాలు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకడం గమనర్హం. బీజేపీ మేకపోతు గాంభీర్యం... ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుస్తామనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో స్థానం వచ్చినా పర్వాలేదని క్యాడర్ ఆశిస్తోంది. బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యరి్థతో పాటు సైదాబాద్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీందర్‌రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ఎన్నికల ప్రచారం సాధనాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో సీటు సంరెడ్డి సురేందర్‌రెడ్డిని వరించడంతో రవీందర్‌రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎన్నికల మెనేజ్మెంట్లో దిట్ట అయిన రవీందర్‌రెడ్డికి సీటు ఇస్తే ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖా యమని బీజేపీ క్యాడర్లో గట్టిగా ఉండే. ఒక వేళ రవీందర్‌రెడ్డికి సీటు కేటాయిస్తే ఇబ్బంది కలగవచ్చని సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం తర్జనభర్జన పడ్డాడు. మలక్‌పేటలో చాలా మంది సీనియర్ నేతల తో పా టు ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి అన్నీ తానై వ్యవహరించడం తో బీజేపీ క్యాడర్ గందరగోళానికి గురైంది. మైనార్టీ ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్.. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రియల్టర్ వ్యాపారి షేక్ అక్బర్ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాడు. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెకొచ్చని ధృడ నమ్మకంతో ఉన్నాడు. ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. డిసెంబర్ 3వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో వేసి చూద్దాం. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రత స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఎల్లుండి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ ప్రతి టేబుల్ పై మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్ వైజర్....ఇద్దరు అసిస్టెంట్లు ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనల పై 2,400 కేసులు తెలంగాణ ఎన్నికలపై మీడియాతో సీఈవో వికాస్‌రాజ్ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది తెలంగాణలో 71.01శాతం పోలింగ్ లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్ హైదరాబాద్ జిల్లాలో 46.68 శాతం పోలింగ్ నమోదు గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ తగ్గింది తెలంగాణలో రిపోలింగ్‌కు ఎక్కడా అవకాశం లేదు మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదు 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కల్పించాం ఎల్లుండి(ఆదివారం, డిసెంబర్ 3వ తేదీ) 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్‌లో 14 మీ పాత్ర మరువలేనిది: రేవంత్ ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్ కేడర్‌కు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు గడచిన పదేళ్లుగా పార్టీకి అండగా.. ప్రజల తరఫున నిలబడ్డారంటూ భావోద్వేగం మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదంటే ఎక్స్‌లో పోస్ట్ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో పాత్ర మరువలేనిదంటూ.. ప్రతి ఒక్కరికి అభినందనలు ఇలాంటి ఎన్నికలు చూడడం నా అదృష్టం: ప్రొ. కోదండరామ్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యలు 1970 ఎమర్జెన్సీ లో జరిగిన ఎన్నికలకు 2023 నిన్న జరిగిన ఎన్నికలకు సారుప్యత ఉంది ప్రజలు ఈ ఎన్నికల్లో పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబర్చారు తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడా తగ్గలేదు.. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల్లో కనినిపించింది ఇలాంటి ఎన్నికలను చూడటం అదృష్టం సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది నిరంకుశ పాలన రాకుండా చూసుకుంటామని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.. మేము దాన్ని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాం ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోవాలి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ప్రజలు సహించరు నాగార్జున సాగర్ నీటి వాటా అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమైనది చట్టపరమైన విధానాలతో వెళ్లాలి తమ నీటి వాటాను తాము వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి హక్కు ఉంది..కానీ దానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఏపీ ప్రభుత్వం దుందుడుకు ఆలోచనలు సరైనవి కావు ఇలాంటి చర్యలు మానుకొని చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా నాగార్జున సాగర్ వాటర్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఈ అంశంపై కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తాం ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేను మాట్లాడటం లేదు గ్రౌండ్ లెవల్లో తిరిగాను కాబట్టి చెబుతున్నా కేసీఆర్ ఓటమి ఒప్పుకున్నట్లే..: షబ్బీర్ అలీ మీడియాతో నిజామాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎన్నికల్లో బాగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అన్ని మతాలు కులాల సంఘాలు ఎన్జీవో ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలు ఎగ్జి ట్ పోల్స్ లో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందని వస్తున్నాయి రాహుల్ గాంధీ రేవంత్ లు చాలా రోజుల నుంచి ఇదే విషయాలు చెబుతూ వచ్చారు దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ కొడుకు కేటీఆర్ తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారు అంటేనే కేసీఆర్ ఓటమి ఒప్పుకున్నట్లు అర్థం అయిపోయింది మెజారిటీ మైనారిటీ అనేవి ఉండవు నేను అందరి వాడిని అందరితో ఉంటాను ఫలితాల కోసం చూస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం తెలంగాణలో హైకోర్టులో ధర్మపురి ఎమ్మెల్యే ఎన్నిక పిటిషన్‌పై తీర్పు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఊరట కొప్పుల 2018 అసెంబ్లీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ పిటిషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఎన్నికలో కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో గెలుపు ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ రీకౌంటింగ్ దరఖాస్తు రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారుల ప్రకటన అయితే, రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతులతో గెలిచారని.. ఎన్నికల కౌంటింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ ఆరోపణ హైకోర్టులో పిటిషన్.. శుక్రవారం(డిసెంబర్ 1) పిటిషన్ కొట్టేసిన హైకోర్టు After a long time had a peaceful sleep 😴 Exit polls can take a hike Exact polls will give us good news. 👍#TelanganaWithKCR — KTR (@KTRBRS) December 1, 2023 ఎగ్జిట్‌పోల్స్‌పై మళ్లీ కేటీఆర్ స్పందన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ అంచనాలపై స్పందించిన మళ్లీ కేటీఆర్ రబ్బిష్.. న్యూసెన్స్ అంటూ పోలింగ్ ముగిసిన అనంతరం స్పందన తాజాగా మళ్లీ ట్విటర్లో మళ్లీ.. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా ఎగ్జిట్ పోల్స్ ఎంతదాకా అయినా వెళ్లొచ్చు, కానీ.. కచ్చితమైన ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే అర్థం వచ్చేలా ఎక్స్‌లో పోస్ట్ గట్టి కాపలా మధ్య.. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత అనుమతి ఉన్నవాళ్లకు మాత్రమే స్ట్రాంగ్ రూమ్‌లోకి ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో పర్యవేక్షణ డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్.. అదే రోజు వెల్లడికానున్న ఫలితాలు తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ ప్రధాన అభ్యర్ధులు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్ రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు ఇచ్చేలా బెట్టింగ్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెరిగిన బెట్టింగ్స్ నెల క్రితం నుంచే ఏపీలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్ ల నిర్వహణ హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని ఏపీలో మకాం వేసిన బుకీలు యాప్ ల ద్వారా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి బెట్టింగ్ కేసీఆర్, రేవంత్, ఈటల, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, మల్లారెడ్డి సహా పలువురు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ బెట్టింగ్ ఊహించని ఫలితాలు రాబోతున్నాయి: బండి సంజయ్ ఎన్నోసార్లు సర్వేలు తారుమారయ్యాయి రాష్ట్రంలో మెజారిటీ సీట్లను బీజేపీ సాధించబోతోంది నాగార్జునసాగర్ ఇష్యూను బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకోవాలని చూసింది రాష్ట్రంలో హంగ్ చర్చ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేవి ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేసే కుట్ర ప్రచారం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి మెజారిటీ రాబోతోంది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో కూడా బీజేపీదే అధికారం గంగుల కమలాకర్ అవినీతి చరిత్రను, కరీంనగర్లో జరిగిన అక్రమాలను బీజేపీ అధికారంలోకి రాగానే తవ్వి తీస్తాం వదిలే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు పార్టీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు స్ట్రాంగ్ రూమ్స్‌లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల వద్ద ఐదంచెల పటిష్టమైన భద్రత నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్స్ డిసెంబర్ 3న వెలువడనున్న అభ్యర్థుల భవితవ్యం నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 85.49శాతం పోలింగ్ నమోదు రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం ఆదిలాబాద్-77.2 శాతం బోథ్-82.93శాతం చెన్నూరు- 79.97శాతం బెల్లంపల్లి-81.19శాతం మంచిర్యాల-69.06 శాతం సిర్పూర్ టి- 71.8 శాతం అసిపాబాద్- 72.08 శాతం ఖానాపూర్-77.46 శాతం నిర్మల్-76.56 శాతం ముథోల్- 80.54 శాతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం-83.28 ఖమ్మం -71.53 పాలేరు-90.28 మధిర -87.83 వైరా -86.66 సత్తుపల్లి-85.27 ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం వివరాలు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 76.61 శాతం పోలింగ్ నమోదు మెదక్ జిల్లా వ్యాప్తంగా 86.69 శాతం పోలింగ్ నమోదు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 79.84 శాతం పోలింగ్ నమోదు ఓటెత్తని హైదరాబాద్! అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదు అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా..ఎప్పటిలాగే ఓటు వేసేందుకు వెళ్లని హైదరాబాద్ జనం పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం అయినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణం జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదు గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. హస్తం గాలి ‘వీచినట్టేనా’! కాంగ్రెస్ శిబిరంలో ధీమా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనుకూలంగాజరిగిందని అంచనా.. 70 స్థానాలకు పైగా గెలుస్తామని లెక్కలు... నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్,వరంగల్ జిల్లాలపై భారీ ఆశలు సింగరేణి సహకరించిందంటున్నహస్తం పార్టీ.. హైదరాబాద్ శివారుఓటర్లూ తమవైపేనని ధీమా వార్ రూం నుంచి పోలింగ్ సరళి సమీక్షించిన ఠాక్రే, దీపాదాస్ మున్షీ, కుసుమ కుమార్ తెలంగాణ అంచనాలు కాంగ్రెస్‌వైపే! మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ది అదే మాట రాజస్తాన్‌లో కమల వికాసమన్న సర్వేలు మధ్యప్రదేశ్నూ నిలుపుకోనున్న బీజేపీ! ఛత్తీస్‌లో మళ్లీ కాంగ్రెసే, మిజోరంలో హంగ్! ఐదు రాష్ట్రాల్లోనూ ఈనెల 3న ఫలితాల వెల్లడి ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్.. పోలింగ్ 70.66 శాతం! ఈ నెల 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఉదయం వడివడిగా పోలింగ్.. మధ్యలో మందకొడిగా ఈవీఎంల మొరాయింపుతో పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం ఓటేసేందుకు మళ్లీ బద్ధకించిన జంట నగరాల జనం స్వల్ప ఉద్రిక్తతలు.. గతంతో పోల్చితే తగ్గిన ఓట్ల గల్లంతు ఘటనలు సజావుగా ముగియడంతో ఊపిరిపీల్చుకున్న ఎన్నికల సంఘం అత్యధిక పోలింగ్ జరిగిన సెగ్మెంట్: మునుగోడు 91.51 శాతం అత్యల్పంగా పోలింగ్ జరిగిన సెగ్మెంట్: యాకుత్‌పుర 39.69 శాతం అత్యధిక పోలింగ్ జరిగిన జిల్లా: యాదాద్రి భువనగిరి 90.03 శాతం అత్యల్పంగా పోలింగ్ జరిగిన జిల్లా: హైదరాబాద్‌లో 46.65 శాతం (కడపటి వార్తలు అందే సరికి లెక్క ఇది. పోలింగ్ శాతాలు మారే అవకాశం ఉంది.) -
తెలంగాణ అంచనాలు కాంగ్రెస్‌వైపే!
లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్‌లో చాలావరకు పేర్కొన్నాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ–ఈటీజీ, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి. ఇక రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో సహా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని పలు సర్వేలు తెలిపాయి. 230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనగా టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా ఇచ్చాయి. ఏబీపీ–సీవోటర్ మాత్రం కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ హంగ్ రావచ్చని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకందని తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంతుబట్టడం లేదు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణలో పోలింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేకపోయింది. రాష్ట్రంలో అధిక ధన ప్రభావం, పైగా గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. దాంతో కచ్చితమైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు రాలేకపోతున్నామన్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌పై శుక్రవారం స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదింటికల్లా 63.94 శాతానికి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!
గడప దాటని సిటీ చెంతనే పోలింగ్ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్ తగ్గింది. పట్నమిలా..హైదరాబాద్ భరత్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రం 16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు. – వాజేడు పల్లె ఇలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోలింగ్‌లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. అత్యధికంగా జనగామలో.. గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. ► జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పలుచోట్ల ఆలస్యంగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. ఉదయమే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్‌రాజ్ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్‌రాజ్ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటింటికీ ఓటింగ్‌కు భారీ స్పందన: సీఈసీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. బందోబస్తుతో ప్రశాంతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్ సెర్చ్ చేపట్టారు. ఓటెత్తని హైదరాబాద్! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. జిల్లాల్లో ఓటింగ్ తీరు ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్.. గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్ జరిగింది. కాగజ్‌నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ప్రవీణ్‌కుమార్ రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం.. గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఉమ్మడి రంగారెడ్డి.. బాగా తగ్గిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ.. పలుచోట్ల లాఠీచార్జి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్నగర్లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్ ఓట్లు వేశారు. ఉమ్మడి కరీంనగర్.. డబ్బుల కోసం నిరసనలతో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గులాబీ చొక్కా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్.. ప్రశాంతంగా పోలింగ్.. పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్.. మందకొడిగా మొదలై.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని నాన్‌లోకల్ అంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్.. బీఆర్ఎస్–కాంగ్రెస్ జగడం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్ఎస్ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉమ్మడి మెదక్.. స్వల్ప ఘర్షణల మధ్య.. మెదక్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్చెరులో మూడుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి పటాన్‌చెరుటౌన్/కైలాస్‌నగర్: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్ (43) కొండాపూర్‌లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నా పూర్ గ్రామం (248) పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసి ప టాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. ఓటు వేయడానికి వచ్చి మృతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్‌దే విజయం: భట్టి
మధిర: రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ప్రజాస్వామ్యయుత సామాజిక నిర్మాణం జరగాలనే ఆకాంక్షతో ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని.. సక్రమంగా అన్ని వర్గాలకు అందాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. పదేళ్ల కాలంలో వనరులు, సంపద రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీకి గురైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశారని భట్టి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ తూ.చ. తప్పక అమలు చేస్తామని చెప్పారు. -
హస్తం గాలి ‘వీచినట్టేనా’!
సాక్షి, హైదరాబాద్: ఈసారి అధికారం కచ్చితంగా దక్కుతుందనే ధీమా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గురువారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పరిస్థితులు కనిపించాయని, 70కి పైగా స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికి ప్రజలు తమను ఆదరించారని, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలూ తమవైపు మొగ్గుచూపాయనే అభిప్రాయం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని విజయం దక్కుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్లలో గెలుపు తమదేనని వారు లెక్కలు వేస్తున్నారు. సింగరేణి ప్రాంత ఓటర్లు కూడా తమవైపే నిలిచారని, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని చెబుతున్నారు. ఇక, హైదరాబాద్ శివార్లలో కూడా తమకు భారీగా పోలింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ కూడా తమదే అధికారం అని చెపుతున్న నేపథ్యంలో ఈనెల 3న∙ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్రుతతో ఎదురుచూస్తుండడం గమనార్హం. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్మున్షీ, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ గాం«దీభవన్‌లోని వార్‌రూంలో కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. నియో జకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల నాడి అనుకూలంగానే ఉన్నా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ ఓట్లన్నీ కచ్చితంగా పోలయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వార్ రూం కోఆర్డినేటర్ విజయభాస్కర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్యాదవ్ వార్‌రూం సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు అభ్యర్థులు, స్థానిక పార్టీ నేతలతో మాట్లాడుతూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టి పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే ఎప్పటికప్పుడు వార్రూంతో టచ్‌లో ఉంటూ పోలింగ్ సరళిపై ఆరా తీశారు. సీఎల్పీ నేత భట్టితో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ తీరును పరిశీలించారు. ఈ ఎన్నికల్లో వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన సునీల్ కనుగోలు ఆయన బృందం కూడా పోలింగ్ సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని స్థానాల్లో సానుకూలత ఉందన్న లెక్కలు కట్టింది. ఆ నాలుగు.. మావే జిల్లాల వారీగా విశ్లేషిస్తే పోలింగ్ తీరును బట్టి నాలుగు జిల్లాల్లో చెప్పుకోదగిన స్థానాలు సాధిస్తామనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు వరంగల్ జిల్లాల్లో ఉన్న 46 స్థానాల్లోనే 35 తమకు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోనికి వచ్చే స్థానాల్లో కూడా 4–5 చోట్ల గెలుపునకు అవకాశాలున్నాయని, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 10 స్థానాల వరకు చేరుకుంటామని అంటున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఓ 10 సీట్లు ఎక్కువే వస్తాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ సునామీ సృష్టించింది!
సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణలో కాంగ్రెస్ సునామీ సృష్టించింది. బీఆర్ఎస్కు 25కు మించి సీట్లు రానేరావు. గెలిచే అవకాశమే ఉంటే సీఎం మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పేవారు. కానీ కేటీఆర్ వచ్చి అదే బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడు. అయితే తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మరోసారి రుజువైంది. పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉంది..’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం కామారెడ్డిలో మాజీమంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాంతాచారి త్యాగానికి, ఎన్నికలకు సంబంధం ‘మలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగానికి, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధం ఉంది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయాడు. మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3న తనువు చాలించాడు. ఇప్పుడు నవంబర్ 29న ఎన్నికల ప్రక్రియ మొదలై, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు సోనియాగాంధీ ఆదేశాలతో నాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. ఈ విధంగా యాదృచ్చికమో, దేవుని ఆదేశమో తెలియదు కానీ, శ్రీకాంతాచారి త్యాగానికి, ఇప్పటి ప్రజాతీర్పుకు సంబంధం ఉన్నట్టు అర్థమైంది. శ్రీకాంతాచారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం..’అని రేవంత్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే క్షమాపణ చెబుతారా? ‘ఓటమి ఎదురవుతుందన్నపుడల్లా నియోజకవర్గం మారడం కేసీఆర్‌కు అలవాటు. అయితే చైతన్యవంతులైన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. అధికారం శాశ్వతమనే కేసీఆర్ నమ్మకం వమ్మయ్యింది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెడుతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కేటీఆర్ అన్నారు. మరి అవే నిజమైతే క్షమాపణలు చెబుతారా? ఎగ్జిట్ పోల్స్ మీద కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే కార్యకర్తలు సంబరాలు చేసుకోవాలి..’అని టీపీసీసీ చీఫ్ అన్నారు. వెంటనే ఆరు గ్యారంటీల అమలు ‘కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణమే ఆరు గ్యారంటీల అమలుకు తొలి మంత్రివర్గంలో తీర్మానం చేస్తాం. ప్రొఫెసర్ కోదండరాంకు అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల సంక్షేమానికి సబంధించిన బాధ్యతలు అప్పగిస్తాం. మేము పాలకులుగా ఉండబోము.. సేవకులుగా ఉంటాం. వెంటనే ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరిస్తాం. అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడా అజమాయిషీ చెలాయించబోము. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయడం జరగదు. తెలంగాణ ప్రజలకు ఐదేళ్లు సేవ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది..’అని రేవంత్ చెప్పారు. పదవి పార్టీ నిర్ణయిస్తుంది తాను ఏ పదవిలో ఉండాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. రెండుచోట్లా గెలిస్తే ఏ నియోజక వర్గంలో ఉంటారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. తనకు ఇవి రెండే కాదని, ఎంపీ పదవి కూడా ఉందని, ఇందులో దేనిలో కొనసాగాలన్న దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని ఆచరిస్తానని చెప్పారు. సమావేంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మానాల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడంగల్‌లో ఓటేసిన రేవంత్‌రెడ్డి కొడంగల్: పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం కొడంగల్‌లో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
అంతా బీఆర్ఎస్ కనుసన్నల్లోనే పనిచేశారు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం అజమాయిషిలోనే పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉన్నా... బీఆర్ఎస్ సర్కార్ కనుసన్నల్లోనే వారంతా పనిచేశారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డబ్బులు, మద్యం పంపిణీ చేశాయని విమర్శించారు. ముఖ్యంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. పలు ప్రాంతాల్లో వారి కళ్లముందే వేల రూపాయలు ఓటర్లకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పంపిణీ చేసినా చూస్తుండిపోయారని మండిపడ్డారు. గురువారం పోలింగ్ ముగిశాక పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, డా.బూర నర్సయ్యగౌడ్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వ్యవహారాలపై ఈసీ మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లను భయపెట్టాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి డబ్బు, ఇతరరూపాల్లో ప్రలోభాలకు దిగినట్లు, అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్టు తమకు నివేదికలు అందాయని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇంత ఒత్తిడి ఉన్నా, యువత, ఇతరవర్గాల ప్రజలు ధైర్యంగా బీజేపీ పక్షాన నిలిచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల గూండాయిజానికి వెరవకుంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కవోని ధైర్యంతో పోరాడిన బీజేపీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా చూస్తే కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థులు, కా ర్యకర్తలపై భౌతికదాడులకు సైతం దిగారని, పోలింగ్ సందర్భంగా కూడా బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీక్షాదివస్ పేరిట బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ రోజు కూడా పత్రికా ప్రకటనలతో బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకముంది బీజేపీ శక్తి మేరకు సమర్థవంతంగా పోరాడిందని, ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందనే ధీమా, విశ్వాసం తమకు ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. కాగా, పోలింగ్ నాడే నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో ఒప్పందం ఉండదు తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుస్తుందని, అధికారాన్ని సొంతం చేసుకునేంత స్థాయిలో ఫలితాలు వస్తాయనే ఆశాభావాన్ని కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు. గురువారం ఆయన టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్తో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పందం కుదుర్చుకునే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 సీట్లలో ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న చోట్ల పోలింగ్ శాతం తక్కువగా ఉండడం మంచి పరిణామం కాదన్నారు. తక్కువ ఓటింగ్ శాతం (50 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల) కారణంగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిమేర బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేశారు. -
ఓట్లు, సీట్లు పెరుగుతాయ్!
సాక్షి, హైదరాబాద్:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి అంచనాలకు అందని విధంగా ఉండటంతో బీజేపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుపొందడంతోపాటు, గణనీయంగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటామనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్న పరిస్థితులనూ పార్టీ బేరీజు వేస్తోంది. వివిధ వర్గాల ప్రజలు పోలింగ్‌కు హాజరైన తీరు తదితర అంశాలను బట్టి ఓటర్ల నాడిని పసిగట్టడం సాధ్యం కాకపోవడంతో నమోదైన తుది పోలింగ్ శాతాన్ని బట్టి పరిస్థితి అంచనా వేయొచ్చనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నారు. యువత ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొన్నదనే అంచనాల మధ్య ఈసారి ఎక్కువ చోట్ల పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 45–50 చోట్ల పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని (బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో ముఖాముఖి, త్రిముఖ పోటీలు కలుపుకుని), వాటిలో అధిక స్థానాల్లో రెండోస్థానంలో నిలుస్తామని, కనీసం 12–15 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఓట్ల శాతంతోపాటు సీట్లు కూడా పెరుగుతాయనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోంది. పుంజుకున్న బలం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 శాతం ఓట్లతో ఒకేఒక సీటు సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్ శాతం పెరిగి, 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీన్నిబట్టి చూస్తే గత లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుందని అంటున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించడం, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవడం వంటి సానుకూల పరిణామాలను ఉదహరిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 20కి చేరుకోవడంతోపాటు 12–15 స్థానాలు సాధిస్తామనే ధీమా వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే ప్రకటన, ఎస్సీ వర్గీకరణపై అనుకూల నిర్ణయం వంటివి పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయంటున్నారు. బిజీబిజీగా ముఖ్యనేతలు గురువారం పోలింగ్ సందర్భంగా... క్షేత్రస్థాయిలోని నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్ తీరు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పార్టీ ముఖ్యనేతలు బిజీబిజీగా గడిపారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి ఓటింగ్ సరళి, పార్టీ పరిస్థితి, ఇతర అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ పరిశీలించారు. ఫోన్ ద్వారా పార్టీ నాయకుల నుంచి కిషన్‌రెడ్డి సమాచారాన్ని క్రోడీకరించే ప్రయత్నం చేశారు. పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల అక్రమాలకు పాల్పడినా పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలింగ్ సరళిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. మధ్యాహ్నం 3 గంటలకు వారు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది, ఎన్ని సీట్లలో గెలుస్తామనే విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. -
హ్యాట్రిక్‌పై బీఆర్ఎస్ ధీమా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పార్టీ సాధించబోయే ఫలితంపై బీఆర్ఎస్ పోస్టుమార్టం ప్రారంభించింది. 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పార్టీ సొంత బలంతోనే వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పోలింగ్ ముగిశాక తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా ఆదివారం వెలువడే ఫలితాలు ఉంటాయని బీఆర్ఎస్ గట్టిగా విశ్వసిస్తోంది. సీఎం కేసీఆర్ దంపతులు గురువారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హెలికాప్టర్లో వెళ్లి సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి ఫామ్‌హౌజ్‌కు చేరుకున్న కేసీఆర్.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావు తాము ప్రాతినిధ్యం వహి స్తున్న సిరిసిల్ల, సిద్దిపేట సెగ్మెంట్లలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూనే, తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అధికారం ఖాయమంటూ వార్‌రూమ్ నివేదిక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వార్‌రూమ్‌లను ప్రారంభించింది. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ సహా అనేక అంశాలను అవి సమన్వయం చేస్తూ వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఫలితాలను బీఆర్ఎస్ అంచనా వేసుకుంది. ఈ క్రమంలో పోల్ మేనేజ్మెంట్లో ప్రతిపక్షాల కంటే ముందంజలో ఉన్నామని, అది కలసి వస్తుందని ధీమా గా ఉంది. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు, ప్ర భుత్వ పథకాల లబ్దిదారులు, విద్యావంతులైన యు వత, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ అనుకూలించినట్టు భావిస్తోంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లబ్దిదారుల్లో 90శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్కే ఓటేశారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడలేదని వార్‌రూమ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తంగా 40కిపైగా సీట్లలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించే పరిస్థితి ఉందని, ఇది కాంగ్రెస్‌కు పగ్గాలు వేసిందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని లెక్కలు వేసుకుంటోంది. కేవలం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తమపై పైచేయి సాధించే అవకాశం ఉన్నట్టు పోలింగ్ సరళిని బట్టి అంచనాకు వస్తోంది. వర్గాల వారీగా లెక్కలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో గ్రామీణ ప్రాంత యువత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ పడ్డాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. తొలిసారి ఓటు హక్కు పొందిన వారిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కే వేశారని అంటోంది. క్షేత్రస్థాయిలో చాలాచోట్ల కాంగ్రెస్‌కు పటిష్ట యంత్రాంగం లేకపోవడాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు అనువుగా మల్చుకోవడంలో సఫలమయ్యారని క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏజెన్సీలు పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక క్షేత్రస్థాయిలో సామాజికవర్గాల వారీగా ఓటింగ్ తీరునూ బీఆర్ఎస్ మదింపు చేస్తోంది. దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువత అంశాలతోపాటు పార్టీ అభ్యర్థులపై, వారి అనుచరులపై వ్యతిరేకత వంటివి కొంత మేర ప్రతికూలత చూపినట్టు భావిస్తోంది. -
తెలంగాణను గెలుస్తున్నాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకమునుపే వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ‘రబ్బిష్ ’అని, డిసెంబర్ 3న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70కి పైగా స్థానాల్లో గెలిచి తీరుతామని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. వందకు వంద శాతం తాము మరోమారు అధికారంలోకి వస్తున్నామని, తెలంగాణను గెలుస్తున్నామని అన్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకమునుపే కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగియకుండా కొనసాగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడి గడువు కుదించడంలో తమ ప్రమేయం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్తకాదు ‘మేము 88కి పైగా స్థానాల్లో గెలుస్తామని అను కున్నా చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయి. జాతీయ మీడియాలో కొన్ని సంస్థలు సర్వే చేయకుండానే కొద్దిపాటి గణాంకాలను రాకెట్ సైన్స్ లాగా చూపుతారు. ఎగ్జిట్ పోల్స్ పేరిట వారు చేసే న్యూసెన్స్, నాన్సెన్స్‌తో ఆ సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుందనే విషయాన్ని గమనించాలి. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్త కాదు, గతంలోనూ ఇదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించి, ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ప్రజలు ఓ వైపు ఓటు వేస్తున్న సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా సాధ్యమని మేము మిమ్మల్ని నిలదీయవచ్చు కానీ అంతదూరం వెళ్లదలుచుకోలేదు. అనని మాటలు అన్నట్లు సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో చేస్తున్న ప్రచారంపైనా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి. హైదరాబాద్ సహా దేశంలోని అనేక పెద్ద పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో ఏవో చిన్నా చితకా ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని పార్టీల సహకారంతో ఇది సాధ్యమైంది..’అని కేటీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్స్ షాక్ !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 48 సీట్లే: సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ : ఆరా మస్తాన్ సర్వే తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్‌కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే బీఆర్ఎస్దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్‌ఎ్‌స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాణక్య స్ట్రాటజీస్లో బీఆర్ఎస్కు 30 సీట్లే.. చాణక్యస్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్‌లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్ఎస్కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. బీఆర్ఎస్దే హ్యాట్రిక్ : పల్స్ టుడే పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్ గ్రాఫ్, థర్డ్ విజన్లాంటి సంస్థలు బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది. మెజారిటీ పోల్స్‌లో వెనుకబడ్డ కారు సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది : కేటీఆర్ కాగా, ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
బర్రెలక్క(శిరీష)కు అన్ని ఓట్లా..?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వేను బయటపెట్టింది. ఇక ఆరా మస్తాన్ సర్వేలోని కొన్ని హైలెట్స్‌ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్‌లో నిలిచిన బర్రెలక్క(అలియాస్ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా.. 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు నిర్మల్‌లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్ ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్ బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్ సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్ సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్ దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్ తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్ మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్ అంబర్ పేటలో కారుకే ఛాన్స్ తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్ కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్ బర్రెలక్క కి 10 వేల ఓట్లు ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్ మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్ ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్ పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది -
అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ఓటు వేశారని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తేలిపోయిందని అన్నారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3నే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు.. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని రేవంత్ పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఎన్నికల ఫలితాలకు ఓ లింక్ ఉందని చెప్పారు. నేడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ రబ్బిస్ అని కేటీఆర్ పేర్కొన్న వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. అవి నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు. -
మళ్లీ మాదే అధికారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ చూడి కార్యకర్తలు కంగారు పడొవద్దని.. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం(నవంబర్ 30) సాయంత్రం పోలింగ్ ముగిసి.. ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు కంగారు పడొద్దు. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌పోల్స్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. క్యూ లైన్లో చాలామందే ఉన్నారు. ఓటింగ్ కచ్చితంగా ప్రభావితం అవుతుంది. అసలైన ఫలితం డిసెంబర్ 3వ తేదీన రాబోతోంది. 70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్ కొట్టి.. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
పోలింగ్ డే హాలీడే.. హైదరాబాద్‌లో పెరగని పోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్ శాతం 32గా ఉంది. సిటీలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. ఇక, మెదక్‌లో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మిగతా స్థానాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. -
ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు. ఇదిఆల ఉండగా.. హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా మెదక్‌లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదు..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్ ఉల్లంఘిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇక, తాజాగా ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఇక, తాజాగా ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి ఫిర్యాదుపై డీఈవోను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యలపై డీఈవోకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందన్నారు. అంతకుముందు కూడా.. రాజకీయ నాయకులు తొందర పడి వ్యాఖ్యలు చేయవద్దు. నేతలు ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దన్నారు. ఇదిలా ఉండగా.. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చింది. దీంతో, కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత నిరంజన్.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. VIDEO | "I sincerely request everybody in Telangana to come out and exercise their right because when you vote, you have the right to question us. When you vote, you can hold the politicians accountable," says BRS leader @RaoKavitha after casting her vote in Hyderabad.… pic.twitter.com/Y9BbS3kFtL — Press Trust of India (@PTI_News) November 30, 2023 -
అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక, తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. EVMల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై DEOను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యల పై DEOకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రూరల్‌లో పోలింగ్ శాతం బాగానే ఉంది.. అర్బన్‌లో పెరగాల్సి ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్, బండి రియాక్షన్
సాక్షి, కరీంనగర్/కొడంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ స్పందిస్తూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు’ అని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బండి సంజయ్ నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చే కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోంది. నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది.? తెర వెనుక ఎవరున్నారు?. కేసీఆర్‌వి ఫాల్స్ రాజకీయాలు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.