తెలంగాణను గెలుస్తున్నాం: కేటీఆర్‌  | Sakshi
Sakshi News home page

తెలంగాణను గెలుస్తున్నాం: కేటీఆర్‌ 

Published Fri, Dec 1 2023 12:50 AM

KTR with media at Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కాకమునుపే వెల్లడైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ‘రబ్బిష్‌ ’అని, డిసెంబర్‌ 3న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70కి పైగా స్థానాల్లో గెలిచి తీరుతామని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. వందకు వంద శాతం తాము మరోమారు అధికారంలోకి వస్తున్నామని, తెలంగాణను గెలుస్తున్నామని అన్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కాకమునుపే కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను విడుదల చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తిగా ముగియకుండా కొనసాగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల వెల్లడి గడువు కుదించడంలో తమ ప్రమేయం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ఇలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ మాకు కొత్తకాదు 
‘మేము 88కి పైగా స్థానాల్లో గెలుస్తామని అను కున్నా చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయి. జాతీయ మీడియాలో కొన్ని సంస్థలు సర్వే చేయకుండానే కొద్దిపాటి గణాంకాలను రాకెట్‌ సైన్స్‌ లాగా చూపుతారు. ఎగ్జిట్‌ పోల్స్‌ పేరిట వారు చేసే న్యూసెన్స్, నాన్సెన్స్‌తో ఆ సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుందనే విషయాన్ని గమనించాలి.

ఈ రకమైన ఎగ్జిట్‌ పోల్స్‌ మాకు కొత్త కాదు, గతంలోనూ ఇదే తరహాలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించి, ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ప్రజలు ఓ వైపు ఓటు వేస్తున్న సమయంలోనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా సాధ్యమని మేము మిమ్మల్ని నిలదీయవచ్చు కానీ అంతదూరం వెళ్లదలుచుకోలేదు. అనని మాటలు అన్నట్లు సోషల్‌ మీడియా, ఇతర మీడియాల్లో చేస్తున్న ప్రచారంపైనా ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టి సారించాలి.

హైదరాబాద్‌ సహా దేశంలోని అనేక పెద్ద పట్టణాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో ఏవో చిన్నా చితకా ఘటనలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని పార్టీల సహకారంతో ఇది సాధ్యమైంది..’అని కేటీఆర్‌ అన్నారు. 

Advertisement
Advertisement