breaking news
-
మిగిలిన రూ.99,999 కోట్లూ పంచాల్సిందే... : సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజావాణికి వచ్చిన ఓ మహిళ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని, నేను రూ.లక్ష ఇచ్చి పరిష్కరిస్తున్నా అని కేటీఆర్ అన్నట్టు పత్రికల్లో వచ్చింది. నీ రూ.లక్ష కోట్లలో రూ.లక్షను మెడలు వంచి పేదలకు ఇప్పించామంటే ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. అక్రమంగా సంపాదించిన రూ.లక్ష కోట్ల నుంచి రూ.లక్షను ఒక మహిళకు ఇవ్వగలిగాం. ఇంకా రూ.99,999 కోట్లు కేటీఆర్ వద్ద ఉన్నాయి. వాటినీ పంచాల్సిన పరిస్థితిని కల్పిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చాం. ఈ విచారణలో తేలే అంశాల ఆధారంగా రెవెన్యూ రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తాం..’.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చార్లెస్ శోభరాజ్‌ను అడిగినా తాను ఏ తప్పు చేయలేదని అంటాడని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంలో ఎల్అండ్టీ, హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర అధికారుల పాత్ర విచారణలో తేలుతుందని చెప్పారు. ‘వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్నది. ఈరోజు వాళ్లు తినేది ప్రజల రక్తపు కూడు..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలనపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బావాబామ్మర్దుల తాపత్రయమే.. ‘శాసనసభలో బావాబామ్మర్దుల (కేటీఆర్, హరీశ్) తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడైనా వీరికి మద్దతుగా లేచి మాట్లాడాడా? వాళ్లిద్దరే ఆరాటపడుతున్నారు. రోళ్లకల్లి నిప్పులు చిమ్మేలా వెనకటికి ఇద్దరు దంచుతున్నారట. ఆ దంచడం చూసి అందరూ అ బ్బా..ఏం దంచుతున్నారు అ ని చప్పట్లు కొట్టుతున్నారట. ఓ అరగంట తర్వాత ఓ ము సలావిడ అక్కడినుంచి పో తూ ఆ రోళ్లో జొన్నలు, సజ్జలు లేవు. ఎంత దంచ్చి నా అలసిపోవడం తప్ప వచ్చేది ఏం లేదని చెప్పిందట. అసెంబ్లీలో కూడా హరీశ్, కేటీఆర్ దంచుడు అలానే ఉంది..’అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. భవనాలను కూల్చడం ఆస్తుల సృష్టి కాదు ‘ఉపయోగపడేవాటన్నింటినీ కూల్చి మళ్లీ కట్టారని శ్వేతపత్రంలో చెప్పాం. సచివాలయం భవనాలను కూల్చకుండా కిరాయి భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను తరలించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అచ్చిరాలేదంటే ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి కొత్తగా ఖాళీ జాగాలో సచివాలయం కడితే ఉపయోగపడేది. అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టి ఆస్తి సృష్టించినం అంటున్నారు. 22 ల్యాండ్ క్రూజర్లను కొని దాచిపెట్టారు నేను కొత్త వాహనాలను కొనొద్దు అని అధికారులకు చెప్పా. పాతబళ్లకు మరమ్మతులు చేయాలని నేను అంటుంటే..22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టామని ఓ అధికారి చెప్పాడు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే తెద్దాం అనుకున్నాం కానీ ఆయన నెత్తిమీద దర్రిదం ఉండి ఇంటికి పోయిండు అని అన్నాడు. మూడోసారి కూడా వస్తాననుకుని కేసీఆర్ తనతో పాటు తన మందిమాగధుల కోసం ఒక్కో బండికి రూ.3 కోట్లు పెట్టి కొన్నారు. ఆయన సృష్టించిన సంపద అలాంటిది. ఆ వాహనాలు ప్రభుత్వ ఆస్తి. తీసుకోకుంటే ఎక్కడికిపోతాయి? కావాలంటే మీకు (జర్నలిస్టులకు) ఇస్తాం. అలా రౌండ్ కొట్టి రండి..’అంటే సీఎం ఛలోక్తి విసిరారు. ఆ అధికారుల సమాచారం మా వద్ద ఉంది ‘వరంగల్‌లో సైనిక్ స్కూల్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? ఐటీఐఆర్ కోసం అడగలేని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బుల్లెట్ ట్రైన్ కోసం మేము ప్రధానిని అడగలేదని సుద్దులు చెప్తున్నాడు. గత ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇస్తున్న అధికారుల సమాచారం మా వద్ద ఉంది. నిన్నటి వరకు మీరే మంత్రులు కదా. షాడో టీమ్స్ ఎందుకు? (కొత్త ప్రభుత్వ పనితీరును గమనించేందుకు షాడో టీమ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనను విలేకరులు గుర్తు చేయగా రేవంత్ ఇలా స్పందించారు) మా కొడంగల్, ఇతర ప్రాంతాల్లో కల్తీ కల్లు దొరకనప్పుడు బాధితులు పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తే కుటుంబ సభ్యులే మంచానికి తాళ్లతో కట్టేస్తారు. అధికారం పోయిన కేటీఆర్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌తో అలా మాట్లాడుతున్నాడు. కొంత కాలం అతన్నీ తాళ్లతో మంచానికి కట్టాల్సిన పరిస్థితి ఉంటది. అప్పుడే అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని బావాబామ్మర్దులు తోక తెగిన బల్లిలా దుంకుతున్నారు. గత రెండేళ్లుగా డిసెంబర్ 22 నుంచి మార్చి 31 మధ్యనే రైతుబంధు వేశారు. మేం ఈసారి డిసెంబర్ 9నే ప్రారంభించాం..’అని రేవంత్ చెప్పారు. త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ప్రస్తుత చైర్మన్, సభ్యుల రాజీనామాలను నాలుగైదు రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తారు: సీఎం రేవంత్ వెల్లడి త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు రానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్– 2 పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం సచివాలయంలో మీడియా ప్రశ్నించగా, సీఎం ఈ విధంగా స్పందించారు. ‘టీఎస్పీఎస్సీ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఉద్యోగ నియామక పత్రాల జారీకి చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు. న్యాయపరంగా, చట్టరీత్యా చెల్లుబాటు కాదు. చైర్మన్, సభ్యుల రాజీనామాపై గవర్నర్ నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఇదే సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఆమె రాష్ట్రపతి అనుమతి కోరారు. న్యాయనిపు ణుల సలహాలు తీసుకుని రాజీనామాలను నాలుగైదు రోజుల్లో ఆమోదిస్తారు. ఆ వెంటనే కొత్త బోర్డు నియామకాలు చేపడతాం’’అని సీఎం స్పష్టం చేశారు. ‘మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలండర్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపు డిసెంబర్ 9, 2024 నాటికి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇక ఇప్పుడు అభ్యర్థులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు. -
ముందుంది ముసళ్ళ పండుగ: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతినంతా బయటపెట్టి.. ఆ పార్టీ నేతలు తిన్నదంతా కక్కించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. బుధవారం ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్ ‘ప్రజా పాలన’ విడుదల సందర్భంగా.. గత ప్రభుత్వ మంత్రులపై సంచలన వ్యాఖ్యలే చేశారాయన. ‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే గడిల పాలనను ప్రజల దగ్గరకు తెస్తున్నాం. ప్రజావాణితో సమస్యలు పరిష్కారం అవట్లేదని కేటీఆర్ అంటున్నారు. తన దగ్గరున్న రూ.లక్ష కోట్లలో.. కేటీఆర్ సాయం చేసింది రూ. లక్షే. ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లే. మిగిలినవి కూడా కేటీఆర్‌తో ఇప్పిస్తాం. ప్రజలకు ఆ రూ.లక్ష కోట్లు పంపిస్తాం’’ అని సీఎం రేవంత్ అన్నారు. ..అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావుతో ఆ పార్టీ నేతలెవరూ కలిసి రాలేదు. బావ, బావమరిది తాపత్రయం తప్ప సభలో ఎవరైనా మాట్లాడుతున్నారా?. సభలో చెప్పకోలేనివి ఇంటి దగ్గర మాట్లాడుకుంటున్నారు. వాళ్లు తింటున్నది రక్తపు కూడు. ప్రజల రక్త మాంసాలతో లక్ష కోట్లు సంపాదించారు. కార్లే కొనలేదని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూసర్లు కొని విజయవాడలో పెట్టారు. ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తెప్పిద్దాం అనుకున్నారు. కానీ, వాళ్ల నెత్తిన దరిద్రం కూర్చుని.. ఆ క్రూసర్ కార్లు మాకు వచ్చాయి. ..బుల్లెట్ రైలు గురించి మాట్లాడే వినోద్.. వరంగల్ నుంచి సైనిక్ స్కూల్ ఎందుకు రతలిపోయిందో చెప్పాలి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారంపై విచారణ చేయిస్తున్నాం. ముందుంది ముసళ్ల పండుగ.. అన్నీ వసూలు చేస్తాం’’ అని సీఎం రేవంత్ ప్రతిపక్ష బీఆర్ఎస్ను హెచ్చరించారు. -
ఆరు గ్యారంటీలకు ‘రేషన్ కార్డు’ మస్ట్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో ప్రజావాణి చూస్తే అర్థమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి విడుదల చేశారాయన. ప్రజా పాలన పేరిట విడుదల చేసిన ఈ దరఖాస్తు ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పారాయన. ఆరు గ్యారంటీల దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు. లోగోను కూడా ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగుటలేటి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ప్రజలకు పదేళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదు. ప్రజావాణికి వస్తున్న స్పందనే ఆ విషయం చెబుతోంది. ప్రజావాణిలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకెళ్లమే ప్రజా పాలన ఉద్దేశం. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తాం. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది అని ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తాం. మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తాం. మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గ్రూపునకు ఎండీఓ, మరో గ్రూప్‌నకు ఎంఆర్వో బాధ్యత వహిస్తారు. ఎవరి కోసం ఎదురు చూడకండి.. ఎవరి దగ్గరకు వెళ్లకండి. అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులో ఉంటారు. జనవరి ఆరో తేదీ తర్వాత కూడా ఎంపీడీవో, ఎంఆర్వో ఆఫీసుల్లో అభయ హస్తం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే రేషన్‌కార్డులు ఇస్తాం. రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. పదేళ్ల గడీల నుంచి పాలన గ్రామాలకు తీసుకువస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల దగ్గరకు పాలనను పంపిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. -
గవర్నర్ తమిళిసై పొలిటికల్ రీ ఎంట్రీ.. పోటీ అక్కడేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు నుంచే తమిళిసై బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి ఆమె రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: Praja Bhavan Rash Driving Case: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్ -
కాంగ్రెస్‌కు కలిసొచ్చింది
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఇదే సంవత్సరంలో ఆ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది. 2023 మొదట్లో దారీతెన్నూ లేని దిశలో సాగిన టీపీసీసీ ప్రయాణం ఏడాది ముగిసేసరికి విజయతీరాలను చేరింది. సంక్షోభం నుంచి సక్సెస్ వరకు, పోటీ ఇస్తామా అనే స్థాయి నుంచి పవర్ దక్కించుకునేంత వరకు ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బలాన్నిచ్చింది. ఏడాది చివర్లో ప్రభుత్వ ఏర్పాటు కలను కూడా నెరవేర్చుకుంది. – సాక్షి, హైదరాబాద్ డిగ్గీరాజా వచ్చి... ఠాగూర్‌ను తప్పించి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కాంగ్రెస్ పార్టీలో కలహాలతోనే ప్రారంభమైంది. ఆ పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో మాటల యుద్ధానికి దిగారు. ఒకదశలో ఇది తీవ్ర రూపం దాల్చడంతో అధిష్టానం జోక్యం చేసుకుంది. సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్ అలియాస్ డిగ్గీరాజాను రంగంలోకి దించింది. ఆయన స్థానిక నాయకత్వంతో చర్చించి అధిష్టానానికి కీలక నివేదిక అందజేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మార్పులు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ మాణిక్యంఠాగూర్ అనూహ్యంగా తప్పించి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావ్ ఠాక్రేను అధిష్టానం తెలంగాణకు పంపింది. ఠాక్రే రాక తర్వాత క్రమంగా కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులు ఒకొక్కటిగా చక్కబడ్డాయి. రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో చాలా మేరకు ఆయన విజయవంతమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్యరాగాన్ని అందుకున్నారు. పైకి కనిపించిన ఆ ఐక్యరాగమే తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ రకంగా విజయతీరాలకు చేర్చిందని చెప్పవచ్చు. 5 నుంచి 65కు పెరిగిన బలం ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. 2018 ఎన్నికల్లో గెలిచిన వారిలో మెజారిటీ సభ్యులు పార్టీని వీడడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏడాది తిరిగే సరికి 65 మంది సభ్యుల (మిత్రపక్షమైన సీపీఐతో కలిపి)కు తన బలాన్ని పెంచుకుంది. ఇక, ఏడాది చివర్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, ప్రజాపాలన లాంటి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భట్టి విక్రమార్క లాంటి నాయకుల ఆధ్వర్యంలో వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళుతోంది. మూడోస్థానం నుంచి మొదటి స్థానానికి ఏడాది ఆరంభంలో మూడోస్థానంలో (బీఆర్ఎస్, బీజేపీల తర్వాత) ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే కొద్దీ రెండో స్థానంలోకి, ఆ తర్వాత మొదటి స్థానంలోకి చేరుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద బూస్టప్ ఇచ్చాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుతో ఇక కాంగ్రెస్ పార్టీ కి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటికే డిక్లరేషన్ల పేరుతో ప్రజల్లోకి వెళుతున్న కాంగ్రెస్, ఆ తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో దూకుడుతో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టగలిగింది. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమనే భావనను ప్రజలకు కలిగించడంలో సఫలీకృతమైంది. జూలై మొదట్లో ఖమ్మంలో నిర్వహించిన ప్రజాగర్జనసభ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. సభకు రాహుల్‌గాంధీ హాజరు కావడం, రాష్ట్రమంతా ప్రభావం చూపే విధంగా మాజీ ఎంపీ పొంగులేటి బృందం కాంగ్రెస్‌లో చేరడం, సీఎల్పీ నేత హోదాలో భట్టి విక్రమార్క చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ముగింపు అక్కడే జరగడంతో పార్టీ కి కొత్త ఊపు వచ్చింది. అదే ఊపుతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కి డిక్లరేషన్లు, ఆరుగ్యారంటీలకు తోడు తెలంగాణలో అధికారం రావడం తన కల అని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. ఇతర పార్టీ ల నుంచి కూడా ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పార్టీ నుంచి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి తదితరులు రావడం, మైనంపల్లి హన్మంతరావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి లాంటి నేతలు పార్టీ లోకి రావడం పెద్ద బలాన్నే ఇచ్చింది. వెరసి... మూడో స్థానం నుంచి మొదటి స్థానం వరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో అధికారాన్ని దక్కించుకోగలిగింది. -
కంగుతిన్న కమలదళం
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. 2023 జనవరి నాటికి అప్పటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పలు విడతలుగా చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’తో నూతనోత్సాహం వెల్లివిరిసింది. అధికార బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్న స్థాయిలో పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. కానీ బండి సంజయ్ మార్పుతో పరిస్థితి క్రమక్రమంగా తారుమారు అయ్యింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్‌రెడ్డి అంతగా సుముఖంగా లేకపోయినా అధిష్టానం ఒత్తిడితో అయిష్టంగానే నాయకత్వ భారాన్ని మోసేందుకు సిద్ధమయ్యారు. ఊపందుకున్న అసంతృప్త నేతల సమావేశాలు బండి సంజయ్ మార్పుపై ఢిల్లీస్థాయిలో కసరత్తు ప్రారంభమైందనే వార్తలు వెలువడిన నాటి నుంచే రాష్ట్ర పార్టీలో మునుపెన్నడూ చూడనంతస్థాయిలో అసంతృప్త నేతల రాజకీయాలు, అసమ్మతి అంతస్థాయిలో లేకపోయినా విడిగా భేటీలు ఊపందుకున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని జాతీయనేతలు విమర్శలు గుప్పించి, ఆరోపణలపై విచారణ జరిపినా, అరెస్ట్ చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అది బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ అమిత్ షా, నడ్డా విమర్శించినా ఈడీ, సీబీఐ వంటి వాటిద్వారా చర్యలెందుకు తీసుకోలేదనే ప్రశ్నలు గుప్పించారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా అటు అసంతృప్త నేతలకు నచ్చజెప్పడమో, చర్యలపై స్పష్టత ఇవ్వడమో చేయకపోవడంతో జన సామాన్యంలోనూ బీఆర్ఎస్తో బీజేపీకి అంతర్గత దోస్తీ ఉందనే అనుమానాలు ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను బీజేపీ సాధించలేకపోయిందనే చర్చ కూడా పార్టీలో జరిగింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి వంటి నాయకులు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో 1 సీటు...7 శాతం ఓటింగ్‌తో మొదలై... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే గెలిచింది.105 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. కేవలం ఏడుశాతం ఓట్లు రాగా, ఆరునెలలలోపే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుపొంది 19 శాతం ఓటింగ్‌ను సాధించి బీజేపీ సత్తా చాటింది. అప్పటి నుంచి మూడేళ్ల వ్యవధిలో వరుసగా జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్ల నుంచి ఏకంగా 48 స్థానాల్లో గెలుపు, మొదటిసారిగా పార్టీ బీ ఫామ్‌పై టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏవీఎన్‌రెడ్డి సంచలన విజయం సాధించి, రాజకీయంగా ప్రజల మద్దతు సాధించి ముందుకుసాగింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తీసికట్టుగా ఓట్లు రావడం, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి 12 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూసినా ఫలితం వెలువడే దాకా నువ్వానేనా అంటూ బీఆర్ఎస్కు బీజేపీ చెమటలు పట్టించింది, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం అన్నిరకాలుగా అండదండలు అందించి మద్దతుగా నిలిచింది. రెండు,మూడునెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ పది సార్లకు పైగా తెలంగాణలో పర్యటించారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని, ఎస్సీ రిజర్వేషన్ట వర్గీకరణకు జాతీయపార్టీ మద్దతు ప్రకటన, కేంద్రప్రభుత్వ సానుకూల నిర్ణయం వంటివన్నీ కూడా రాష్ట్రంలో బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలిచేందుకు దోహదపడలేదనే అభిప్రాయంలో పార్టీనాయకుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రపార్టీ అధ్యక్షుడి మార్పు, ఆలస్యంగా అభ్యర్థుల ఖరారు, తెలంగాణలో ఏమాత్రం బలం, ఉనికి లేని జనసేనతో పొత్తు కుదుర్చుకొని 8 సీట్లు కేటాయించడం వంటి అంశాలు బీజేపీ ఎన్నికల ఫలితాల సాధనలో ప్రభావం చూపాయి. ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల పరాజయం.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీచేసి 8 సీట్లలో గెలిచి, 19 చోట్ల రెండోస్థానంలో, 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకుంది. మొత్తంగా 14 శాతం ఓటింగ్‌ను సాధించింది. సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్ రెండుచోట్ల), ఎం.రఘునందన్‌రావు ఓటమి చవిచూడడం పార్టీకి షాక్ కలిగించింది. కచ్చితంగా గెలుస్తారనుకున్న వీరిని ప్రజలు ఓడించడంతో ఆ పార్టీ నాయకులు అవాక్కయ్యారు. గ్రేటర్లో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి 7 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని పరువు నిలబెట్టుకుంది. అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, బండి సంజయ్ ఎంపీగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించు కోలేకపోయారు. -
మూడో 'సారీ'...
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్ఎస్ కోరిక నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పార్టీని విస్తరించే లక్ష్యంతో గత ఏడాది భారతరాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచే సన్నద్ధమైంది. జాతీయస్థాయిలో విస్తరణే లక్ష్యంగా... బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నాక పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జనవరి 18న ఖమ్మంలో తొలి బహిరంగసభ జరిగింది. ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్), పినరయి విజయ్ (కేరళ)తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీలో కొత్తగా చేరిన తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్రలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా తొలిసారిగా ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన తొలి బహిరంగసభకు కేసీఆర్ హాజరయ్యారు. మార్చి 26న కాందార్ లోహ, ఏప్రిల్ 24న ఔరంగాబాద్ సభల్లోనూ కేసీఆర్ పాల్గొన్నారు. మే 19న నాందేడ్‌లో రెండు రోజుల కార్యకర్తల శిబిరాన్ని ప్రారంభించిన కేసీఆర్ జూన్ 15న నాగపూర్‌లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించారు. జూన్ 23న మహారాష్ట్ర పర్యటనకు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్‌తో వెళ్లి పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో పూజలు చేశారు. ఆగస్టు ఒకటిన కొల్హాపూర్‌లో అన్నాభావ్ సాఠే వర్ధంతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 8న నోటీసులు జారీ చేసింది. మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరైంది. కవితపై ఈడీ విచారణకు పలు మార్లు నోటీసుల జారీ అంశం బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు తీహార్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ అటు కేటీఆర్, ఇటు కవితను ఉద్దేశిస్తూ లేఖలు విడుదల చేయడంతో విపక్షాల విమర్శలకు దారితీసింది. టీఎస్పీఎస్సీ, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు కూడా బీఆర్ఎస్కు తలనొప్పులు సృష్టించాయి. గవర్నర్‌తో ఘర్షణ రాష్ట్ర గవర్నర్‌తోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను కారణంగా చూపడంతో గణతంత్ర వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరి గాయి. ఫిబ్రవరి మొదటివారంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అంశంపై రాజ్‌భవన్, ప్రగతిభవన్ నడుమ కోల్డ్‌వార్ జరిగింది. చివరకు గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం ఓకే చెప్పగా, బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అసెంబ్లీ పంపిన బిల్లులు గవర్నర్ ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ కోటాలో శాసనమండలికి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించగా, రాజకీయాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపైనా గవర్నర్, ప్రభుత్వం నడుమ మాటల యుద్ధం జరిగింది. మరోవైపు కేంద్రంతోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘర్షణ ఏడాది పొడవునా కొనసాగింది. కేటీఆర్ పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై లేఖలు రాశారు. ఫిబ్రవరి నుంచే... ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే బీఆర్ఎస్ వివిధ రూపాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమైంది. సీపీఐ, సీపీఎంతో ఎన్నికల అవగాహన ఉంటుందని మొదట్లో భావించినా, అది కుదరలేదు. శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్‌కు మద్దతు ప్రకటించింది. మార్చి 12 నుంచి నియోజకవర్గస్థాయిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించి మే నెలాఖరు వరకు కొనసాగించింది. జూన్‌లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరిట 20 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. సచివాలయం, భారీ అంబేడ్కర్ విగ్రహం, అమరుల జ్యోతి ప్రారంభం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ భారీ సభలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్లో పార్టీ ప్లీనరీ జరగ్గా, రెండు రోజుల ముందే జిల్లాల్లోనూ మినీ ప్లీనరీలు నిర్వహించారు. ఒకేసారి 115 మంది జాబితా.. షెడ్యూల్ రాకముందే ఆగస్టు 21న ఒకేసారి 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. జాబితాలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడగా, అలంపూర్ అభ్యర్థి అబ్రహంకు చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు. ఏడుగురు సిట్టింగులకు టికెట్లు నిరాకరించారు. టికెట్లు ఆశించిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకమునుపే అక్టోబర్ 15న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు మూడు విడతల్లో పార్టీ అధినేత కేసీఆర్ 97 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగ్గా, డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 39 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. డిసెంబర్ 8న బాత్రూంలో కాలు జారడంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ శస్త్ర చికిత్స అనంతరం డిసెంబర్ 15న డిశ్చార్జి అయ్యారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడంపై బీఆర్ఎస్ మండిపడింది. శ్వేతపత్రం తప్పులతడక అంటూ డిసెంబర్ 24న తెలంగాణభవన్‌లో కేటీఆర్ ‘స్వేదపత్రం’విడుదల చేశారు. -
అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ
అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగిడగా, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంకు మాత్రం పరాభావమే మిగిలింది. సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఎంతో ప్రతిష్ట కలిగిన సీపీఎంకు గత అసెంబ్లీలోనూ, ప్రస్తుత అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం దక్కలేదు. పొత్తుల్లో సీపీఐ సక్సెస్ బీఆర్ఎస్తో పొత్తు విఫలం కావడంతో సీపీఐ కాంగ్రెస్‌కు దగ్గరమైంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు కాగా, సీపీఎంతో పొత్తు కుదరలేదు. చివరకు సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగగా, సీపీఐ కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. ఆ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి వామపక్షాలు కలిసి పనిచేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నాయి. కానీ పొత్తుల విషయంలో పొసగక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఎన్నికల దృష్టితో చూస్తే సీపీఐ వ్యూహం ఫలించదని అంటున్నారు. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓట్లను నిలబెట్టుకోలేకపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. సీపీఎంకు ఘోర పరాభవం... తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. భద్రాచలం మినహా ఇతరచోట్ల గెలుపోటటములను నిర్దేశించలేకపోయింది. సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లో 15 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా, మిగిలిన నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అంతేకాదు అన్ని స్థానాల్లోనూ సీపీఎం డిపాజిట్లు పొందకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు నియోజకవర్గంలోనూ సత్తా చాటలేకపోయారు. ఆయనకు కేవలం 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి 5,860 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ 5,719 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలుపునకు సీపీఎం అడ్డుపడినట్టుగా హస్తం వర్గాలు అంటున్నాయి. 19 చోట్ల పోటీ చేస్తే సీపీఎంకు వచి్చన మొత్తం ఓట్లు కేవలం 52,349 మాత్రమే కావడం గమనార్హం. -
డబుల్ డిజిట్లో ఎంపీ సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సంఖ్య (డబుల్ డిజిట్)లో ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడి మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాం«దీతో సహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభకు సెమీఫైనల్ అన్నార ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని, మధ్యప్రదేశ్‌లో నభూతో నభవిష్యతి అనేలా రికార్డ్ స్థాయిలో బీజేపీకి మెజారిటీ వచ్చిందని ఆయన ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ శ్రేణులు సంసిద్ధం అయ్యేలా గురువారం కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ , పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వినర్లు, ఇంచార్జులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, మోర్చాల జాతీయ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలియజేశారు. సమీక్షల తర్వాతే నియోజకవర్గాల్లో సమావేశాలు ప్రస్తుతం అన్ని జిల్లాల్లో శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సమీక్షల తర్వాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు గానూ రానున్న తొంభై రోజులకు ‘ఎలక్షన్ యాక్షన్ ప్లాన్’రూపొందించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ఆ రోజున ప్రతి హిందువు ఇంట్లో దీపం వెలగాలి జనవరి 22న అయోధ్యలో జరిగే భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవంలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున భాగస్వామ్యం కా వాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 22న దేశంలోని ప్రతీ దేవాలయాన్ని అలంకరించి, గుడుల ముందు స్క్రీన్లు ఏర్పాటు చేసి రామమందిర ప్రారం¿ోత్సవాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పా ట్లు చేయాలని ఆయా మందిరాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ప్రతి హిందువు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కిషన్‌రెడ్డి కోరారు. -
అడ్డగోలుగా అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని చెబుతారా?
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన ఆస్తులు బావా, బావమరుదల స్వేదంతో సృష్టించినవా? ఆ సర్కారు హయాంలో చేసిన అప్పు లు చెల్లించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజల స్వేదం చిందించాల్సిందే కదా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘ఏదో సాధించినట్టు స్వేదపత్రం విడుదల చేశారు. బావా బావమరుదులు కష్టపడి చెమటలు చిందించి సంపాదించినట్టు చెబుతున్నారు. అవి తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆస్తులు. అదే చెమటను చిందించి అప్పులను కట్టాల్సిందే. ఇందులో బీఆర్ఎస్ గొప్పతనమేముంది.?’అని నిలదీశారు. మంగళవారం ఢిల్లీ వెళ్లేందుకు ముందు బేగంపేట విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ స్వేదపత్రంపై ఘాటై న విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7లక్షల కోట్లు అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమో కాదో చెప్పాలన్నారు దోపిడీ సొమ్మును కక్కిస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతి సొమ్మును కక్కిస్తామని ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ చెప్పినట్టుగానే గత ప్రభుత్వ అక్రమాలపై న్యాయ విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని భట్టి చెప్పారు. ఈ విచారణ తర్వాత లెక్కలు కట్టి దోపిడీ సొమ్మును కక్కిస్తామని వ్యాఖ్యానించారు. ధనవంతులు మరింత సంపన్నులయ్యారు బీఆర్ఎస్ పాలనలో పేదలు మరింత పేద లుగా మారితే ధనవంతులు మరింత సంపన్నులయ్యారని, దీనికి తామేదో తలసరి ఆదాయం పెంచామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని భట్టి విమర్శించారు. ‘హైదరాబాద్‌లో ఓ సంపన్నుడు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. గ్రామాల్లో పేదలు 40 చదరపు గజాల్లో ఉంటున్నారు. వారిద్దరి తలసరి ఆదాయం సగటును లెక్కించి గొప్పలు చెప్పుకోవడం సమంజసమేనా.?’అని నిలదీశారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్తగా పరిశ్రమలు తెచ్చారా? కోల్ ఇండస్ట్రీ నెలకొల్పారా? ప్రభుత్వరంగ సంస్థలేమైనా తెచ్చారా? వీళ్లు సృష్టించిన ఆస్తులేంటి? కళ్లకు కనపడవా?’అని ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ దోపిడీ పత్రాలను విడుదల చేస్తాం
నల్లగొండ: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుబారా ఖర్చు, దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయని, వాటన్నింటిపై దోపిడీ పత్రాలను విడుదల చేస్తామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయన్నారు. వాటన్నింటిపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే.. వారు ఏదో చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శ్వేద పత్రం విడుదల చేశారని విమర్శించారు. అందుకే వారు పదేళ్లలో తెలంగాణలో చేసిన దోపిడీపై పత్రాలను విడుదల చేస్తామన్నారు. దేశమే సిగ్గుపడేలా రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసి తామేదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 1వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిదన్నారు. రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి ఉత్తమ్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కుర్చీలు వేసుకుని కట్టిస్తామని చెప్పిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టించలేదన్నారు. 28వ తేదీ నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పది జాతీయ స్థాయి రోడ్లు వస్తే చాలు: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రోడ్లు తక్కువగా నిర్మించారని, తాను గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత ముందుకు తీసుకుపోయానని, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్డు భవనాల మంత్రి కావడంతో పది జాతీయ స్థాయి రోడ్లను మంజూరు చేయిస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతిరెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. -
వెనుకబడిన చోటే వెతుక్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉన్న నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు చోట్లా పార్టీ గెలుపునకు సహకరించే అంశాలు, ప్రతికూల పరిస్థితులపై చర్చించిన కాంగ్రెస్ నేతలు అందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. నిరాశపరిచిన ఫలితాలు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపరిచాయి. ఈ ఫలితాలను సమీక్షించుకున్న కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల్లో తమకు లభించిన ఓట్లు, ఇతర ప్రధాన పక్షాలకు వచ్చిన ఓట్ల సంఖ్య ఆధారంగా వ్యూహం రూపొందించుకోవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో బీఆర్ఎస్తో పోలిస్తే వెనుకబడినప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రజల మద్దతు లభించింది. మల్కాజిగిరి పరిధిలో బీజేపీ కంటే ఎక్కువ ఓట్లే వచ్చినా బీఆర్ఎస్ కంటే దాదాపు 3.5 లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. మల్కాజిగిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పార్లమెంటు ఫలితాలు కొంతమేర భిన్నంగా ఉంటాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఆ నియోజకవర్గం పరిధిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా బలపడాలని భావిస్తోంది. చేవెళ్లలోనూ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు దాదాపు లక్ష ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక్కడ కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తే గెలుపు కష్టమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లోనే కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీకి బలమైన నాయకత్వం కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు కొత్త ఇన్చార్జీలను నియమించాలని పార్టీ భావిస్తోంది. ఇన్చార్జీల ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల సమన్వయంతో క్షేత్రస్థాయిలో కేడర్‌ను కదిలించాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా బ్యాలెట్ బాక్సులు నిండేలా పనిచేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ స్థానం పరిధిలో ఎంఐఎంను ఢీకొట్టడం కష్టమే అయినా అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ వరకు పకడ్బందీగా వ్యవహరించాలని, ఎంఐఎంకు దీటైన అభ్యరి్థని రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రజలకు దగ్గరగా పనిచేయండి: ఇన్చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నేతలతో జరిగిన సమావేశంలో ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేయడంలో పార్టీ నేతలు ముందుండాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉండేలా నాయకులు పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ కేడరంతా పాల్గొనాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 28న వాడవాడలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక చేయూతనివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పురోభివృధ్ధికి చేయూతనివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు సహకరించాలని, కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధు ల విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వైద్య, విద్యరంగాలను మరింత బలోపేతం చేసేందుకు తోడ్పాటునివ్వాలని, రాష్ట్రంలో ఇప్పటికే అమలవు తున్న పథకాలు, చేపట్టిన వివిధ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని విన్న వించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీ య హోదా ఇవ్వాలని కోరారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు తొలిసారిగా ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీ సందర్భంగా ఇద్దరు నేతలను ప్రధాని అభినందించారు. కాగా రేవంత్, భట్టిలు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించారు. ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇందులో ప్రధానంగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీలు ప్లాంటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, సైనిక్ స్కూల్, ఐఐఎం ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు తది తరాలను పొందుపరిచారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యాంశాలు ఇవే.. ► ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్ల చొప్పున రూ.2,250 కోట్లను కేంద్రం విడుదల చేసింది. కాగా 2019–20, 21–22, 22–23, 23–24 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1,800 కోట్లు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థికసంఘం నిధులు రూ. 2,233.54 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ► రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదా రులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అందులో కేవలం రెండింటికే ఆమోదం తెలిపారు. మిగతా 12 రహదారుల అప్‌గ్రేడ్‌కు ఆమోదం తెలపాలి. ► ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాబట్టి 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి. ► పునర్విభజన చట్టం ప్రకారం పూర్వ ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం (బయ్యారం స్టీల్ ప్లాంట్) ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినందున దానిని వెంటనే నెరవేర్చాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దానికి అదనంగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ► 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్‌లకు ఐటీఐఆర్‌ను ప్రకటించింది. కానీ 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ ఐటీఐఆర్‌ను పక్కనపెట్టారు. దీనిని వెంటనే పునరుద్ధరించాలి. ► పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించారు. దానికి రావల్సినన్ని నిధులు రానందున వెంటనే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి. ► ప్రతి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది.. తెలంగాణలో ఐఐఎం లేనందున హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. అందుకు తగిన స్థలం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక పాఠశాలలు రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో సైనిక్ స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలి. ► భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా దక్షిణాదిలో లేనందున, పుణెలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తరలించాలి. ► రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థల విభజన, పదో షెడ్యూల్లోని సంస్థల అంశాలను పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజనకు సహకరించాలి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భేటీ: భట్టి విక్రమార్క ప్రధానితో భేటీ వివరాలను రేవంత్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని భట్టి వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుకొనేందుకు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన నిధులు, నీళ్లు, నియామకాలకు సంబంధించిన అంశాలు, హక్కుల విషయంలో గత ప్రభుత్వం పదేళ్లుగా తాత్సారం చేసిందని, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన వాటిని తీసుకురాలేకపోయిందని చెప్పారు. ఇవే అంశాలను ప్రధానికి వివరించామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని, రాష్ట్రంపై అప్పులతో పెనుభారం మోపిందని విమర్శించారు. అప్పుల నుంచి బయటపడేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతోధిక సాయం అందించాలని కోరినట్లు వివరించారు. తమ వినతులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామన్నారని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితుల సడలింపులపై ప్రధానితో చర్చించలేదని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల నిధులపై చర్చించి వినతిపత్రం ఇచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
స్వేదపత్రం పేరుతో కేటీఆర్‌వి పిల్ల చేష్టలు: షబ్బీర్ అలీ
సాక్షి, నిజామాబాద్: స్వేద పత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారుల నుంచి వివరాలు సేకరించి శ్వేత పత్రం విడుదల చేసిందని.. ప్రభుత్వ శ్వేత పత్రం తప్పు అని బీఆర్ఎస్ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే కేటీఆర్ తప్పులు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 100 మందికి ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో గంటల తరబడి క్యు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదీ చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. -
పెండింగ్ నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాం: భట్టి
సాక్షి, న్యూఢిల్లీ: 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్.. ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందని మండిపడ్డారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, వీటిపై బీఆర్ఎస్ సర్కార్ తాత్సారం చేసిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు పెండింగ్‌లో నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మంగళవారం భేటీ అయ్యారు. మోదీతో చర్చించిన అంశాలపై రేవంత్, భట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని భట్టి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే అందించాలని కోరినట్లు చెప్పారు. ‘తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానమంత్రిని కోరాం. ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. హైదరాబాద్‌కు ఐఐఎం, సైనికల్ స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు తొలిసారి ప్రధానిని కలిశాం. వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరాం’ అని భట్టి వెల్లడించారు. చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. -
కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే స్వేద పత్రంపై చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. పదేళ్లలో ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయో చర్చకు సిద్ధమా?. భవనాలు, భూములు ఎవరికెన్ని ఉన్నాయో లెక్కలు తేలుద్దామా.. మీ లెక్కలు చెప్పేందుకు మేము సిద్దం.. మీరు సిద్దమా? అంటూ ప్రశ్నించారు. చెమటలు చిందించి తెలంగాణను అప్పులపాలు చేశారు: కూనంనేని బీఆర్ఎస్ నేతలు చెమటలు చిందించి తెలంగాణను అప్పులపాలు చేశారని, కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ఎందుకు వివరించారో మాకైతే అర్థం కాలేదని సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు ‘‘మానవ తప్పిదాల వల్ల సింగరేణి నష్టాల్లో కూరుకుపోయింది. మరో 20 ఏళ్లలో సింగరేణి కాలం చెల్లనుందని 20 ఏళ్ల తర్వాత కొత్త మైన్స్ రాకపోతే సింగరేణి ఓ చరిత్రగా ఉండిపోనుంది. తెలంగాణలో పెద్ద సంస్థలన్నీ అప్పుల్లోనే ఉన్నాయి. సింగరేణి ఎన్నికలు జరగకుండా గత ప్రభుత్వం అనుకూల సంఘం ప్రయత్నం చేసింది. టీబీజీకే, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి’’ అని కూనంనేని పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్ -
‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్ పేరిట.. బీఆర్ఎస్ స్వేద పత్రం రిలీజ్ చేయడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఢిల్లీ పర్యటన ముందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ స్వేద పత్రం అంటూ రిలీజ్ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. వాళ్లు చేసిన అప్పుల్ని తీర్చాలంటే తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలి అని భట్టి వ్యాఖ్యాంచారు. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామని అన్నారు. అది జరిగి తీరుతుంది. జ్యుడీషియల్ ఎంక్వైరీ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అని అన్నారాయన. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు భట్టి ఢిల్లీ పర్యటనలో పాల్గొంటారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం.. కాంగ్రెస్ అగ్రనేతల్ని ఈ ఇద్దరూ కలవనున్నట్లు సమాచారం. -
చేవెళ్లపై బీఆర్ఎస్ దృష్టి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎంపీ స్థానాలు చేజారకుండా కాపాడుకోవడంతోపాటు మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించాలని యోచిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, అరికెపూడి గాందీలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. చేవెళ్ల ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పొందిన ఓట్ల కంటే 1.85 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు తక్కువగా వచ్చాయి. పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో కొద్దిగా శ్రమిస్తే మళ్లీ చేవెళ్లలో బీఆర్ఎస్ జెండా ఎగరేయొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థి ఖరారు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. మండలాలవారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, జనవరి మూడు నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. మళ్లీ టికెట్ నాకే: ఎంపీ రంజిత్‌రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకే మళ్లీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రచారానికి ఇప్పటికే గ్రీన్సిగ్నల్కూడా ఇచి్చనట్టు సోమవారం మీడియా ముఖంగా ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. జనవరి 3వ తేదీ నుంచి ఎంపీ సెగ్మెంట్ పరి«ధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తానని చెప్పారు. అసలు వీళ్లు మంత్రులేనా? కర్ణాటక మంత్రి కరువు వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోసం ఏటా కరువు పరిస్థితులు ఏర్పడాలని రైతులు కోరుకుంటారని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ‘అసలు వీళ్లు మంత్రులేనా.. రైతులపై ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో తమకు ప్రభుత్వం సానుభూతితో అండగా ఉండాలని మాత్రమే రైతులు కోరుకుంటారు’.. అని కేటీ రామారావు వ్యాఖ్యానించారు. -
అవి రెండూ అవినీతి పత్రాలే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, ప్రతిపక్ష బీఆర్ఎస్ స్వేద పత్రం.. రెండూ అవినీతి పత్రాలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఆ రెండు పత్రాలు కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకేనని నిందించారు. భారతరత్న, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఇతరనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ... వాజ్‌పేయి జయంతిని కేంద్రం సుశాసన్ దినోత్సవ్ పేరుతో నిర్వహిస్తోందన్నారు. ఒక్క ఓటు తగ్గినా.. నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవికి వాజ్ పేయి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వాజ్‌పేయి ఆకాంక్షించారని, త్వరలోనే ఆయన కల సాకారం కాబోతుందన్నారు. దేశంలో సుపరిపాలనకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంత్యోదయ నినాదంతో వాజ్‌పేయి దేశంలో సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా వాజ్‌పేయి చూపిన మార్గంలో.. నడుస్తోందని పేర్కొన్నారు. కొత్త వేరియెంట్ ప్రమాదకరం కాదు.. కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అవసరాన్ని బట్టి కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుందని.. అయితే ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు.ప్రజలు ఆందోళన చెందకుండా కోవిడ్ కట్టడికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
చేరికలపై హస్తం ఫోకస్..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చి, అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి వెళ్లిన నేతలను, బీజేపీలోని కీలక నేతలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో ఇప్పటికే పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరిపినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మొత్తమ్మీద 15 ఎంపీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రయోజనం కోసం.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను పదింట బీజేపీతోనే పోటీ ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు స్థానాలు, ఉత్తర తెలంగాణలోని లోక్‌సభ సీట్లలో కమలనాథుల నుంచి గట్టిపోటీ ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల స్థాయి నేతలను చేర్చుకోవడం ద్వారా.. ఆదిలోనే బీజేపీకి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంతనాలు షురూ.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ కీలక నేతను చేర్చుకునే విషయంలో టీపీసీసీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆయనకు కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని ఆఫర్ చేయడంతోపాటు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత కలి్పస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలతోపాటు మెదక్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతతోనూ టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. మరో ఐదేళ్లదాకా తెలంగాణలో బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమని.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను పక్కాగా నిలువరించవచ్చని సదరు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ శివారు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు బీసీ నేతలు గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ఉన్న నేపథ్యంలో.. వారిని కూడా పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలిసింది. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. -
‘షా’ రొస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా సన్నాహాలకు బీజేపీ తెరలేపింది. ఈ నెల 28న నగర శివారు కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న లోక్‌సభ సన్నాహక సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా హాజరవుతున్నారు. పార్టీ మండల అధ్యక్షులు మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు నాయకుల వరకు హాజరయ్యే ఈ భేటీలో రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మందిని ఆహ్వనిస్తున్నారు. మొత్తంగా రెండున్నరవేల మంది వరకు నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులంతా హాజరుకావడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజల వద్దకు ఎలా వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలో స్పష్టత ప్రధానంగా ఏయే అంశాల ప్రాతిపదికన ప్రజల వద్దకు వెళ్లాలి, లోక్‌సభ ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఏయే అంశాలు ప్రస్తావించాలి, మోదీ సర్కార్ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అందిన ఫలాలపై ఏ విధంగా ప్రచారం నిర్వహించాలన్న దానిపై ఆ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరగగా, ఈసారి అంతకంటే ముందుగా మార్చి చివరిలోగానే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం ద్వారా మంచి ఫలితాలు (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్లకు బదులు 10 వరకు గెలిచి.. సీట్లు పెంచుకోవాలనే లక్ష్యంతో జాతీయ నాయకత్వం ఉంది) సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ భేటీ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలపైనా విశ్లేషించవచ్చని చెబుతున్నారు. లోక్‌సభ ఇన్చార్జిల నియామకంపై కసరత్తు రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు పార్టీపరంగా లోక్‌సభ ఇన్చార్జిల నియామకం (17 మంది సంస్థాగతంగా ఫుల్‌టైమర్స్‌కు అదనం)తో పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వర్కింగ్ టీమ్ నియామకంపై కూడా ఈ భేటీలో కసరత్తు జరుగనుందని పార్టీ నేతల సమాచారం. ఇటీవల కొత్తగా గెలిచిన 8మంది ఎమ్మెల్యేలతో అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశం కావడంతో పాటు... భారతీయ జనతా శాసనసభాపక్షం (బీజేఎల్పి)నేత ఎన్నిక కూడా అదే రోజు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వరుసగా మూడుసార్లు గెలిచిన టి.రాజాసింగ్, రెండుసార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిల్లో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో... పార్టీపరంగా లోక్‌సభకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, సన్నాహకాలపై రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమీక్షించారు. -
ఓటమితో కుంగిపోవద్దు.. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. qసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని, ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆరెస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లని.. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని, 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని, పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని పార్టీ శ్రేణులకు రంజిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. -
‘చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారు’
సాక్షి,హైదరాబాద్: తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుండి కాంగ్రెస్, బీజెపి అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.. విషయం ఏంటంటే? -
TS: 28న రాష్ట్రానికి అమిత్ షా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్వేత పత్రం, బీఆర్ఎస్ స్వేద పత్రం రెండూ అవినీతి పత్రాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 28న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతోనూ అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. వీరంతా తెలంగాణ మూడవ అసెంబ్లీ తొలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు బీజేఎల్పీ నేత ఎంపిక మాత్రం పెండింగ్‌లోనే ఉంది. ఇదీచదవండి..‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’ -
కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉంది. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదు. డీఎంకే నేతలు దేశాన్ని విచ్చినం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలి. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ తన మౌనం వీడి.. తన వైఖరిని వెల్లడించాలి. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తాం. తగిన సమయంలోగా హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. Some leaders these days choose to attack on religious sentiments of the people for their 2 mins of fame! I want to ask Mr. Election Gandhi his stand on the issue of Sanatan Dharma - why has he not given any statement on this as yet? It’s high time that Rahul Ji comes out of… pic.twitter.com/ZzZNLIWpW5 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 25, 2023