breaking news
-
తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కేంద్రమంత్రి, ఆ పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని.. ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని తెలిపారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉందని అన్నారు. కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని చెప్పారు. బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారన్నారు.ఎల్పీ నేత ప్రకటన అమిత్ షా వచ్చిన రోజే ప్రకటించాల్సిందని.. ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేతపై ప్రకటన చేస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మహిళలకు, బీసీలకు ఎంపీ టికెట్లలో పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్‌లో లీడర్ ఎవరో తెలియదని.. బీజేపీకి ఓటేసేందుకు జనాలు సిద్దంగా ఉన్నారని అన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంధి కుదిరిందా?: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుంది అంటూ ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. మంగళవారం ఆయన హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం అని ధ్వజమెత్తారు.. కేసీఆర్ రీ ఇంజనీరింగ్ కాస్తా రివర్స్ ఇంజనీర్‌గా మారిందని మండిపడ్డారు.ఇంజనీరింగ్ మార్వల్గా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మూడు, నాలుగు ఏళ్లలోనే కుంగిపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు భవిత్యం ఏంటనేది తెలియడం లేదని అన్నారు. కుంగిపోయిన పిల్లర్లను మళ్ళీ కడతారా? లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా దీనిపై సీబీఐ దర్యాప్తు చేయవద్దనే చట్టాన్ని బీఆర్ఎస్ తీసుకువచ్చిందన్న ఆయన.. కాంగ్రెస్ అయినా ఆ చట్టాన్ని తీసివేసి దర్యాప్తు చేస్తుందా? లేక బీఆర్ఎస్ను కాపాడుతుందా? అని ప్రశ్నించారు. ‘కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరాలి... దర్యాప్తు కోరిన 48 గంటల్లోనే విచారణ జరిగేలా సిఫార్పు చేస్తాం. సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తాం. తాము సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంధి కుదిరిందా?. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని నిరూపించుకోవాలి. అందు కోసం అయినా సీబీఐ దర్యాప్తు కోరాలి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా? లేదా?. రేవంత్ రెడ్డి.. దోషులకు శిక్ష పడాలని ఉందా? లేదా?. ఉంటే దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే.. -
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను ఆర్థికంగా కొల్లగొట్టారు: పొంగులేటి
సాక్షి, పాలేరు: ప్రజా సేవకులుగా ఉన్నాం.. ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పాలేరు నియోజకవర్గంలో పలు ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు దారులతో మాట్లాడి ప్రజాపాలన కార్యక్రమం పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పామని కేబినెట్ మీటింగ్‌లో తొలి సంతకం ఆరు గ్యారెంటీలపైనే చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన రెండు అంశాలు ప్రారంభించామన్నారు. నిబద్ధతతో పనిచేసి ప్రతీ హామీని నెరువేరుస్తామన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణను ఆర్ధికంగా ఎంతో కొల్లగొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో ప్రతి పక్ష నాయకుల ముందే చర్చ పెట్టామన్నారు. అధికారం ఉంది కదా అని సంతకం పెట్టి అప్పులు చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సొమ్ముతో పెద్ద ఇల్లు కట్టాడని మంత్రి విమర్శించారు. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో ‘కమలం’ కొత్త ఆశలు -
కొత్త ఏడాదిలో ‘కమలం’ కొత్త ఆశలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో రాజకీయంగా తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త ఏడాది ప్రథమార్థంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న జాతీయ నాయకత్వం అంచనాలతో రాష్ట్ర పార్టీలో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన నిరుత్సాహాన్ని అధిగమించి, లోక్‌సభ ఎన్నికల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే దిశలో ముందుకెళ్లాలని సంకలి్పంచింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ విస్తరణకు అనువైన రాష్ట్రంగా తెలంగాణపై జాతీయ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావించింది. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడంపై పార్టీ శ్రేణులను ఒకింత నైరాశ్యం చుట్టుముట్టింది. దీంతో ప్రస్తుతం దీనిని దూరం చేసే ప్రయత్నాల్లో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో 35 శాతం ఓటింగ్‌తో పది ఎంపీ సీట్లలో గెలవాలంటూ అగ్రనేత అమిత్ షా నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తోంది. టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నలుగురు సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అరి్వంద్ ధర్మపురి (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్)లను మళ్లీ బరిలోకి దింపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా మిగతా 13 స్థానాల్లో టికెట్ల కోసం పార్టీ నాయకులు, తటస్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ పెద్దలు గెలుపు గుర్రాల అన్వేషణలో పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు ఆశావహులతో జాబితాను పంపించాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఆశావహులంతా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలను, ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే వివిధ స్థాయిల్లో నిర్వహించే సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఖరారు కసరత్తు జరుగుతుందని రాష్ట్ర నేతలకు అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
ప్రజాపాలన తర్వాత నామినేటెడ్‌పై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. మొదటి నుంచీ చర్చ జరుగుతున్న విధంగా సంక్రాంతి లోపు మొదటి దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు తనను కలిసిన విలేకరులతో సీఎం రేవంత్ ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో పలుకుబడి పనిచేయవని, పార్టీ కోసం కష్టపడ్డవారికి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తీవ్ర పోటీ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకుని ఆరో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతిలోపు ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత తయారయింది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం రేవంత్ ఈ పోస్టులపై మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
TS: బండ్ల గణేష్‌కు కీలక బాధ్యతలు!
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఎక్స్‌లో వైరల్ అవుతుండగా.. ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్‌కోర్ అభిమాని. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పి మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో.. మరోసారి ట్రోలింగ్ మెటీరియల్ అవుతారేమోనని కొందరు భావించారు. కానీ, ఈసారి బండ్ల గణేష్ జోస్యం తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్కు చెక్ పెట్టి.. కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. సంక్రాంతిలోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు ఏదైనా కార్పొరేషన్ అప్పజెప్పొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్లలో వీలు కాకుంటే.. సినీ రంగానికి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా బండ్ల గణేష్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చా నడుస్తోంది. ఇవేవీ కాకుంటే.. పార్టీ తరఫున అయినా ఆయనకు కీలక పదవి కచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ మాత్రం పదవులక్కర్లేదనని.. పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. మరి బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?.. లేదా.. స్పష్టత రావాలంటే.. ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే. -
మెట్రో, ఫార్మా సిటీ రద్దు చెయ్యం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: గత ప్రభుత్వ హయాంలో తీసుసుకున్న మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోవట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న మెట్రో, పార్మా సిటీ నిర్ణయాలను రద్దు చేయడం లేదు. ప్రజా ప్రయోజనాన్ని దృషష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టుకు దూరం తగ్గిస్తాం. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. నాగోలు నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద ఛాంద్రాయణ గుట్ట వద్ద మెట్రో లైన్‌కు లింక్ చేస్తాం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రబాపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. అవసరమైతే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం అని అన్నారాయన. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారయన. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా.. 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. సంక్రాంతి లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వంలో.. ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవు. అన్ని నిర్ణయాల అమలుకు టార్గెట్ 100రోజులు పెట్టుకుని.. కచ్చితంగా అమలు చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పనులకు.. సీఎంగా కేసీఆర్ శంకుస్థాపన సైతం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణ ప్రతిపాదనతో పాటు ఫార్మా సిటీపైనా పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ఆయన రద్దు చేయవచ్చని అంతా భావించారు. అయితే.. రద్దు చేయకుండా వాటిలో సమూల మార్పులు చేయడం గమనార్హం. -
ప్రస్తుతం డైలాగులతో నెట్టుకురాక తప్పదా?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఎదురుదాడి ఆరంభించారు. ప్రభుత్వ బొక్కసం అంతా ఖాళీగా ఉందని పూర్తిగా అర్ధం చేసుకున్న రేవంత్ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై ఘాటైన విమర్శలు చేశారు. కేటీఆర్ తిన్న లక్ష కోట్ల రూపాయలను కక్కిస్తామని ఆయన అనడం విశేషం. అలాగే ప్రజా పాలన పేరుతో గ్రామాలలో సభలు ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన స్కీముల కోసం వేలాది మంది ప్రజలుక్యూలు కట్టవలసి వస్తోంది. ఇది క్రమేపి అసంతృప్తిగా మారే అవకాశం ఉంది. ప్రజావాణిలో ఇరవైనాలుగువేల దరఖాస్తులు వచ్చాయంటే గతంలోని గడీల పాలన వల్ల ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కున్నారో అర్ధం అవుతుందని రేవంత్ అంటున్నారు. కాని ఈ ప్రజావాణికి ఈ ఇరవైరోజుల్లో వచ్చిన వేలాది దరఖాస్తులను పరిష్కరించడం తలకు మించిన భారమే అని చెప్పక తప్పదు. ✍️రేవంత్ రెడ్డి మంచి మాటకారే. అదే ఆయనకు కలిసి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పై తీవ్రమైన పరుష భాష వాడడానికి కూడా ఆయన వెనుకాడలేదు.తద్వారా ఆయన కేసీఆర్ ను ఎదిరించే ధీరుడుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడ్డారు. పిసిసి అధ్యక్షుడు అయ్యాక మరింత వేడి పెంచారు. అదంతా ఆయనకు కలిసి వచ్చింది. పార్టీ నాయకత్వం కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్ అదే బాటలో నడవాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ✍️కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాని,ఆయా వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్ లు కాని అమలు చేయడం ఒకరకంగా చెప్పాలంటే దుస్సాధ్యం. అందుకే మొత్తం ఈ పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకమేనని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి యత్నిస్తున్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాని ఒక మహిళకు కేటీఆర్ లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన తిన్నదానిలో లక్ష కక్కించామని , మిగిలిన 99,999 కోట్ల రూపాయలను కూడా వసూలు చేస్తామని ఆయన గంభీరమైన ప్రకటన చేశారు.ఇలాంటి వాటినే ప్లేయింగ్ టు గ్యాలరీస్ అని అంటారు. కేసీఆర్ ప్రభుత్వం అనండి, కేటీఆర్ లేదా ఇతర బీఆర్ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేయవచ్చు. కాని అదేదో లెక్కకట్టి లక్షకోట్లు అని ప్రచారం చేయాలని సంకల్పించడం లోని ఆంతర్యం ప్రజలకు అర్ధం కాకుండా పోదు.ప్రభుత్వాలు ఏ విచారణ చేపట్టినా, సంబందిత ఆధారాలు సేకరించడానికే నెలల సమయం పడుతుంది. ✍️న్యాయ విచారణ అంటే ఇంకా ఆలస్యం అవుతుంది. అంతదాకా ఎందుకు! ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేయడానికి ఎంతకాలం పట్టిందో చూస్తున్నాం. అది ముందుకు వెళ్లకుండా చంద్రబాబు వంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎలా ఆయా వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనిస్తున్నాం.ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషీయల్ విచారణకు ఆదేశాలు ఇచ్చినా,అది ఇప్పటికిప్పుడు తేలేది కాదు.కాకపోతే నిత్యం బీఆర్ఎస్ నేతలపై విమర్శలకు, వారిని భయపెట్టడానికి కొంత ఉపయోగపడవచ్చు.మరో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డిపై వచ్చిన అభియోగాల కేసు ఇంతవరకు ఒక కొలిక్కి వచ్చిందా! ఇవేవి ఆయనకు తెలియనివి కావు. ✍️అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డైలాగులతో నెట్టుకురాక తప్పదు. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలు మాత్రమే ఉంచారని ఆయన అనడం ఆసక్తికరంగానే ఉంది. కాంగ్రెస్ నేతలు అంత అమాయకులా అన్న సందేహం వస్తుంది. ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని బీఆర్ఎస్ నేతలపై ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు కొత్తవికావు. అయినా భారీ వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించడానికి కాంగ్రెస్ నేతలు ఎన్నిపాట్లు పడ్డారో అందరికి తెలుసు!అదే అధికారం కోసం జరిగే రాజకీయం అంటే. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాగే రాజకీయం చేశారు. ఇప్పుడు దానిని రేవంత్ కొనసాగిస్తున్నారని అనుకోవచ్చు.ఒకరకంగా ఇద్దరిది ఈ విషయంలో ఒకే స్కూల్ అనుకోవాలి. సచివాలయం కూల్చివేతకు సంబందించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతమైనవే. కేవలం వాస్తు కోసం సచివాలయ భవనాలు కూల్చడంపై అప్పట్లోనే వ్యతిరేకత వచ్చింది. ✍️కొత్త భవనం చూడడానికి బాగానే ఉన్నా,అసలు ఉన్న భవనాలను కూల్చడం ఎందుకు అన్నదానికి బీఆర్ఎస్ సరైన సమాధానం ఇవ్వలేక్పోయింది. ప్రజావాణి వంటి కార్యక్రమాలలో సమస్యలు తీర్చడం ఎవరివల్లా కాని పనిగా మారింది. దానికి కారణం ఏమిటంటే ప్రజలు ప్రతి చిన్న సమస్యకు ముఖ్యమంత్రి వద్దకు వస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రజలకు ఉదయం కొంత సమయం కేటాయించేవారు..అప్పట్లో కొంత స్క్రీనింగ్ చేసి సీఎంను కలిపించేవారు.దానివల్ల అందరికి పనులు అయిపోతాయని కాదు. వాటిలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సాయం కోసం వచ్చే దరఖాస్తుదారులే ఉండేవారు.వారికోసం ఒక ప్రత్యేక అధికారిని పెట్టి వారి జబ్బును పట్టి, చికిత్సకు అయ్యే వ్యయాన్ని బట్టి ఆర్ధిక సాయం చేస్తుండేవారు. అప్పట్లో ఆయనకు అది మంచి పేరే తెచ్చింది.కాని అలా ముఖ్యమంత్రి స్థాయిలోనే అన్ని చూడాలని ప్రయత్నించడం ఎంతవరకు కరెక్టు అన్న భావన కూడా లేకపోలేదు. ✍️దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం పెట్టారు. అందులో ఎవరైనా తమ సమస్యను చెప్పుకోవచ్చు. వారికి అధికారులు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. స్పందన కార్యక్రమం తీరుతెన్నులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు చేస్తుంటారు. అంతేకాకుండా గ్రామ,వార్డు స్థాయిలోనే సచివాలయాలు ఏర్పాటు చేయడం,వలంటీర్లను ప్రజల ఇళ్ల వద్దకే పంపించడం ప్రజల అవసరాలను తెలుసుకుని , అర్హులైన లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని వారికి తగు సాయం చేస్తున్నారు.దీనితో ప్రతి ఒక్కరు సీఎంను కలవాలన్న ఆలోచన అవసరం లేకుండా పోతోంది. వృద్దులకైతే ఇళ్లవద్దే పెన్షన్ అందించే గొప్ప సదుపాయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ✍️ఇందుకోసం ప్రభుత్వం చాలా శ్రమించింది. వ్యవస్థలను పకడ్బందీగా రూపొందించడానికి కొంత టైమ్ తీసుకుంది.అందువల్ల అది చాలావరకు సఫలం అయింది. తెలంగాణలో అలాంటి వ్యవస్థలు లేవు. ప్రస్తుతం ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నా,వాటిని పరిష్కరించడానికి చాలా టైమ్ పట్టవచ్చు. ఇదంతా కాలయాపన చేయడానికే అన్న అభిప్రాయం ప్రబలితే ప్రజలలో అసంతృప్తి ఏర్పడుతుంది.కాని రేవంత్ కూడా నిస్సహాయుడే అని చెప్పక తప్పదు. ఈ స్కీములు అన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు లేకపోతే ఆయన మాత్రం ఏమి చేస్తారు!కాకపోతే ఆ మాట పైకి చెప్పలేరు. ✍️ప్రజాపాలన పేరుతో కొంత గడువు తీసుకుంటున్నారు. తర్వాత అర్హుల గుర్తింపు అంటూ మరికొంత సమయం వాడుకుంటారు. తదుపరి దశలవారీగా వాటిని అమలు చేసే యత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ నేత కవిత అన్నట్లు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నవారు కొత్తగా పెంచిన నాలుగువేల రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అంటే మాత్రం అది తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.దేనికైనా ఆర్ధిక పరిస్థితే మూలం అవుతుంది కనుక ఈ బండిని ఎలా నెట్టుకువస్తారో తెరపై చూడవలసిందే. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ నేతలపై రేవంత్ వ్యూహాత్మక దాడి చేశారు. ప్రజల దృష్టిని అటువైపు మళ్లించడం ద్వారా తనకు ఊపిరి పీల్చుకునే అవకాశం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.అంతకు మించి మరో మార్గం కూడా ఆయనకు లేదేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పథకాల అమలుపై అనుమానాలున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చేందుకు కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశమున్నందున, కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్‌లోపే ఆరు గ్యారంటీలలోని 13 హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయని హరీశ్ పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి మార్చి 17వ తేదీతో వంద రోజులు పూర్తవుతుందని, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆ పార్టీ చెప్పినప్పటికీ, ఎన్నికల కోడ్వస్తే గ్యారంటీల అమలుకు బ్రేక్‌పడే ప్రమాదముందన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలన్నా, ఫిబ్రవరి 20లోపే చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్షెడ్యూల్వచ్చేలోపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ప్రవేశపెట్టాలని, ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్కాకుండా ఓట్ఆన్ఎకౌంట్బడ్జెట్పెట్టిందంటే హామీల అమలు ఎగవేతకు సిద్ధమైనట్టేనని అనుమానించాల్సి ఉంటుందన్నారు. అలాగే యాసంగి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ఇచ్చే పథకానికి సంబంధించిన గైడ్లైన్స్కూడా వెంటనే రిలీజ్చేసి, బడ్జెట్లో ఆ స్కీంను చేర్చాలని చెప్పారు. ఆ దరఖాస్తులు కాలయాపనకేనా? పథకాల అమలుకు ప్రభుత్వం ముందుగా విధివిధానాలు రూపొందించి, తరువాత ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని, కానీ కాంగ్రెస్ప్రభుత్వం గైడ్ లైన్స్సంగతి తర్వాత.. ముందైతే దరఖాస్తులు తీసుకుందామన్నట్టు వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. అందుకే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుంటున్నారని, వాటిని ఆన్లైన్ చేయడం పేరుతో ఆయా స్కీంల అమలును వీలైనంత జాప్యం చేయాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. తమ ప్రభుత్వంలో ఏ రోజు ఎంతమంది రైతులకు రైతుబంధు ఇచ్చామో ప్రతి రోజూ ప్రెస్నోట్ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఎందరికి రైతుబంధు ఇచ్చారో క్లారిటీ లేదని తెలిపారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టిన వారికి, ఎందరికి రైతుబంధు ఇచ్చారనే వివరాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన, మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి అమలును ఎగవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తాము ఇలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడమే దీనికి నిదర్శమన్నారు. డిసెంబర్9వ తేదీనే రైతు భరోసా, రూ.2 లక్షల రుణాలు మాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, 200లోపు యూనిట్ల కరెంట్బిల్లులు మాఫీ హామీలు ఇచ్చారని, వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్ట్రాన్స్ప్లాంటేషన్సహా పెద్ద జబ్బులకు వైద్యం చేసేందుకు తమ ప్రభుత్వం రూ.11.50 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కింద చెల్లించిందని, కొత్త ప్రభుత్వంలో ఈ స్కీం ఎంతమందికి వర్తింపజేశారనే వివరాలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. హామీలిచ్చేటప్పుడు బడ్జెట్‌పై అవగాహన లేదా? మాటకు ముందు అప్పులు, ఖాళీ కుండలు అని చెప్పేవాళ్లకు ... హామీలిచ్చేటప్పుడు బడ్జెట్‌పై అవగాహన లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,400 కోట్ల అప్పు చేసినట్లు తెలిసిందని, రూ. 13వేల కోట్ల అప్పు తీసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాసిందని, ఈ అప్పులను కూడా శ్వేతపత్రంలో తమ ప్రభుత్వం ఖాతాలోనే వేశారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికలకు ముందు జాబ్క్యాలెండర్పేరుతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందని, దానికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించాలని సూచించారు. కార్లు కొని దాచిపెట్టుకున్నట్టు మాట్లాడి ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకోవద్దన్నారు. ప్రగతిభవన్‌లో 200 రూములు, స్విమ్మింగ్‌పూల్, బుల్లెట్ప్రూఫ్బాత్రూంలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారని, ఇప్పుడు అందులో నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఏది నిజమో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రొటోకాల్ఉల్లంఘన జరుగుతోందని, నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్‌నేతలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. 119 మంది ఎమ్మెల్యేలను సమదృష్టితో చూస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ప్రస్తుతం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. -
ఎక్కడ.. ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి మొదలైంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు రూట్ క్లియర్ అనే ప్రచారం నేపథ్యంలో మిగిలిన 13 స్థానాల్లో మాత్రం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల ఖరారుపై స్పష్టత వచ్చేలా చూస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఇందుకు అవసరమైన కసరత్తు వేగవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్‌ను ఆయన ఆదేశించినట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎంపీ టికెట్ల కోసం తీవ్రపోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) మినహాయిస్తే, మల్కాజ్‌గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ► మహబూబ్‌నగర్ సీటు విషయానికొస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. ► చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సై అంటున్నారు. ► భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► మహబూబాబాద్ టికెట్‌కు తేజావత్ రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్ పోటీ పడుతున్నారు. ► ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ లేదా గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్‌రావులకు అవకాశం ఇస్తారా చూడాలి. ► నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా లేకపోతే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత బరిలో దింపుతారా చూడాలి. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. మల్కాజ్గిరి.. ఈటల గురి మల్కాజ్గిరి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన అమిత్ షాతో విడిగా ఈటల భేటీ అయ్యారు. లోక్‌సభకు పోటీపై మాట్లాడేందుకు సమయం కావాలని కోరగా, రెండు, మూడురోజుల్లో ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది. పి.మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, ఎన్.రామచందర్‌రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడానికి వీలుపడని పక్షంలో జహీరాబాద్, మెదక్ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్న సంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం. జహీరాబాద్.. ఏలేటి సురేశ్ రెడ్డి జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఈ లోక్‌సభ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన వ్యాపారవేత్త ఏలేటి సురేశ్‌రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే ఆయన కిషన్‌రెడ్డిని కోరినట్టు తెలిసింది. ఈ విషయమై అధిష్టానానికీ విజ్ఞప్తి చేయగా, జనవరి 2న ఢిల్లీ వచ్చి కలవాలని ఆయనకు అమిత్‌షా చెప్పినట్లు తెలిసింది. డాక్టర్ కె.లక్ష్మణ్, వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వరంగల్.. మందకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మరికొందరూ ఇదే సీటుకు పోటీపడుతున్నారు. నాగర్ కర్నూల్..బంగారు శ్రుతి నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని బరిలో దింపవచ్చునని లేదంటే ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. హైదరాబాద్..రాజాసింగ్ హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. -
నూతన ఏడాదికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ‘రైతు మహిళ యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్ వెల్లడించారు. కాగా, కొత్త ఏడాది సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..‘మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్దరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి.. వారి భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరం 'రైతు మహిళ యువత నామ సంవత్సరం'గా సంకల్పం తీసుకున్నాం. గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించాం. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం. ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గత పాలన కాదు.. జన పాలన. ప్రతీ పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా.. అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ.. ఈ నూతన సంవత్సరంలో ప్రతీ పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతీ గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి. ప్రతీ ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ తెలిపారు. -
‘ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి?.. ఎన్నికల కోడ్ అంటారా?’
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో జనానికి అనుమానాలు ఉన్నాయి. వంద రోజుల్లో అమలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, రేషన్‌కార్డుల అమలు విషయంలో గందరగోళం నెలకొందని కామెంట్స్ చేశారు. తాజాగా హరీష్‌రావు మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం. కొంత మంది నేను జిల్లాలో తిరుగుతుంటే రైతు బంధు అని అడుగుతున్నారు. ఈ వంద రోజుల్లో దరఖాస్తులు తీసుకొని ఎంక్వైరీ చేసి నిదానంగా ఎన్నికల దాకా లాగుతారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని చెప్పాలని కాంగ్రెస్ చూస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాలని చూస్తోంది. ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదు. ఈ స్కీములు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పటం లేదు. రేషన్ కార్డు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. అసలు ఇవి వస్తాయో రావో తెలియదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు కావు. మొన్న విడుదల చేసింది శ్వేత పత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే. ఆన్ గోయింగ్ స్కీమ్ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయి. అలాంటి పరిస్తితి కనపడడం లేదు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం గైడ్ లైన్స్ ఎక్కడ? ఎవరెవరికి ఇస్తారు. ఇప్పటికే ఇల్లు ఉన్న, ఉద్యోగం ఉన్నా ఇస్తారా? లేదా? స్పష్టత లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో జనానికి అనుమానాలు ఉన్నాయి. వంద రోజుల్లో అమలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ల్యాండ్ కృజర్ల విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదు. బీపీ వెహికిల్స్ విజయవాడలోనే తయారు చేస్తారు కాబట్టి ప్రభుత్వం అక్కడికి వెళ్ళింది. ఎవరు సీఎంగా ఉన్నా ఆ వాహనాలు వాడాల్సిందే. నిజంగా ఆరు గ్యారంటీ అమలు చేయాలనే చిత్తశుద్ది ఉంటే వెంటనే జీవో విడుదల చేసి ఇవ్వొచ్చు. ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు ఎంత మందికి 10 లక్షలు ఇచ్చారు?. కాంగ్రెస్ కోత, ఎగవేత, దాటవేతలు చేయాలని చూస్తోంది. నిరుద్యోగ భృతి విషయంలో భట్టి విక్రమార్క మేము హామీ ఇవ్వలేదు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ఇస్తామని చెప్పారు. బడ్జెట్ సరిపోతుందా అనేది ముందే అనుకొని హామీలు ఇచ్చారు కదా?. ఎన్నికల కోడ్‌లో ఇరికించకుండా ధాన్యానికి బోనస్ ఇవ్వాలి. అసలు వస్తాయా రావా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే అమలు చేయాలి. మిగితా పథకాలు వంద రోజుల్లో అమలు చేస్తారు సరే వరి ధాన్యం బోనస్ ఎలా ఇస్తారు. ఇది ఆలస్యం చేస్తే ఇబ్బంది కదా? ఆన్ గోయింగ్ స్కీమ్ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయి. అలాంటి పరిస్థితి కనపడటం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి 13 క్వింటాల్స్కు మాత్రమే 500 బోనస్ ఇస్తోంది.. మిగితా ధాన్యానికి ఇవ్వటం లేదు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఆలోచన చేస్తున్నట్లు ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు గతంలో రోజు వారీగా ఎంత ఇచ్చారు అనే లెక్కలను మేము చెప్పాం. కానీ, కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చాం అని చెప్తున్నారు కానీ.. ఎన్ని ఎకరాలకు ఎంత ఇచ్చారో కాంగ్రెస్ చెప్పటం లేదు. కరోనా సమయంలో అన్ని ఆపినా మేము రైతు బంధు ఆపలేదు. మేము ఈసీకి ఫిర్యాదు చేయం.. పథకాల అమలు కోరుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
2023: తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్.. రెండు సంచలనాలు ఇవే..
ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు. కొత్త సంవత్సరానికి స్వాగతం. ప్రతీ ఏటా కొత్త ఆశలతోనే కొత్త ఏడాది వస్తుంటుంది. దానికి ముందుగా జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే బాగుంటుంది. 2023 సంవత్సరం ఓవరాల్‌గా చూస్తే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కొంత ఆలస్యంగా అయినా వర్షాలు బాగానే పడ్డాయి. పంటలు ఫర్వాలేదు. గోదావరి నదికి యధా ప్రకారం వరదలు వచ్చాయి. కృష్ణానదికి మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం నిరాశ కలిగించింది. ✍️రాజకీయంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రధానమైన ఘట్టాలు సంభవించాయి. ఒకటి తెలంగాణలో తొమ్మిదినర్నేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలవడం. మరొకటి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలు పాలవడం. ఈ రెండు అంశాలు సంచలనం కలిగించేవే. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆ పార్టీకి ఊపిరి పోసినట్లయింది. అదే టైమ్‌లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం కోల్పోవడం వారికి పెద్ద ఆశాభంగమే. అంతేకాదు. బీజేపీ మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇది బీజేపీకి బాగా లాభం అయింది. అంతకుముందు కర్నాటక, హిమాచల్ ప్రదేశ్లలో గెలిచామన్న ఆనందంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు దానిని మిగల్చలేదు. కాకపోతే తెలంగాణ ఫలితం కాస్త ఉపశమనం ఇచ్చింది. ✍️తెలంగాణ ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాజకీయాలలో ఇది కీలక పరిణామం. కేసీఆర్ తాను ఓడిపోతానని ఊహించలేకపోయారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం ఆయన కొంప ముంచింది. కాంగ్రెస్‌పై సానుకూలత కన్నా కేసీఆర్, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒక ఇరవై నుంచి ముప్పై మంది సిటింగ్‌లను మార్చి ఉంటే రాజకీయం ఇంకో రకంగా ఉండేది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం బీఆర్ఎస్కు అపశకునంగా మారింది. అది వారి మెడకు చుట్టుకుంది. దానిపై కేసీఆర్ సమాధానం ఇవ్వలేకపోయారంటేనే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ✍️అలాగే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులతో ఆడుకున్న వైనం కూడా కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసింది. అయితే, హైదరాబాద్‌లో ఆ పార్టీ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ది పనులు కలిసి వచ్చి బీఆర్ఎస్కు పూర్తి స్థాయి ఫలితాలు రావడంతో పార్టీ నిలబడగలిగింది. కాంగ్రెస్ ఈ ప్రాంతంలో కూడా మెజార్టీ సాధించి ఉంటే అది ఆ పార్టీకి వేవ్‌గా మారేది. అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారేది. కొత్త శాసనసభకు కేసీఆర్ ఇంతవరకు హాజరుకాలేకపోయారు. ఆయన తన ఫాం హౌస్‌లో జారిపడటంతో తుంటి విరిగింది. దాంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామన్న వాతావరణాన్ని బీజేపీ పెద్దలు స్వయంకృతాపరాధంతో చెడగొట్టుకున్నారు. అయినా, ఎనిమిది సీట్లు గెలవడం విశేషమే. ✍️బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారం ఆ పార్టీకి చేటు తెచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేస్తున్నామన్నంతగా బీజేపీ నేతలు హడావుడి చేశారు. అలా జరగకపోవడంతో ప్రజలలో అనుమానాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలను వీలైనంతవరకు కలుపుకుని వెళ్లడంలో రేవంత్ రెడ్డి సఫలం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లు కొంత ఉపయోగపడి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు అవే కాంగ్రెస్‌కు పెను సవాళ్లుగా మారుతున్నాయి. ✍️వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు పెద్ద పరీక్షే అవుతాయి. వంద రోజుల్లో ఆ గ్యారంటీల అమలు కొంతమేర అయినా జరిగితే ప్రజలు సంతృప్తి చెందుతారు. కానీ, నిధుల సమస్య కారణంగా ప్రస్తుతం కాలయాపన చేయడంలో భాగంగానే దరఖాస్తుల స్వీకరణ, తదితర ప్రక్రియ చేపట్టినట్లుగా ఉంది. 2024 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలపై జ్యుడీషియల్ విచారణ ఎలా సాగుతుంది? దాని ప్రభావం ప్రజలపై ఏ మేరకు ఉంటుందన్నదానిపై బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా వీటితోటే కథ నడిపితే కాంగ్రెస్‌కు కూడా నష్టం జరిగి ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు. 2023 మాత్రం కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు తీరని చేదు ఫలితాన్ని మిగిల్చితే, కాంగ్రెస్‌కు అనుకోని వరాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు పొందలేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తుకు కూడా గండం ఏర్పడవచ్చు. కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యామ్నాయ నేతలుగా ప్రజల విశ్వాసం పొందితే పార్టీ నిలబడుతుంది. ✍️ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యథాప్రకారం ప్రజలలో తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. తనను ఎవరూ ఏమి చేయలేరని, తానెవ్వరికి లీగల్‌గా, సాంకేతికంగా దొరకనని డాంబికాలు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి సంచలనం సృష్టించింది. తనను ఎవరూ పీకలేరని, టీడీపీ వారు ఎవరు గొడవలు చేసినా, వారిపై ఎన్ని కేసులు వచ్చినా, కోర్టులలో తాము చూసుకుంటానని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు చెబుతూ వచ్చేవారు. తద్వారా టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టేవారు. దాంతో అమాయకులైన పలువురు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు చేసి జైలుపాలయ్యారు. చివరికి చంద్రబాబే అవినీతి కేసులో చిక్కుకోవడంతో చట్టం ఎవరికి చుట్టం కాదన్న సంగతి టీడీపీ నేతలకు, కార్యకర్తలకు అర్థం అయ్యింది. ✍️ఎల్లకాలం వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదని కూడా తేలింది. స్కిల్ స్కామ్‌లో వచ్చిన అభియోగాలకు సమాధానం చెప్పకుండా, గవర్నర్ అనుమతి లేకుండా కేసు పెట్టడం అన్యాయమని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తుండడంతో కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు అరెస్టును సానుభూతిగా మార్చుకోవాలని టీడీపీ విఫలయత్నం చేసింది. చివరికి చంద్రబాబు తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కూడా రంగంలో దించడం విశేషం. చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లి సుమారు 153 మంది మరణించారంటూ కొత్త డ్రామాకు తెరదీశారు. భువనేశ్వరి ముగ్గురి ఇళ్లకు వెళ్లి మూడేసి లక్షల చొప్పున డబ్బు ఇచ్చి వచ్చారు. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె డబ్బు దండగ అనుకున్నారో ఏమో కానీ, ఓదార్పుయాత్రను విరమించుకుని ఇంటికి వెళ్లిపోయారు. ✍️చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే ఆయన కుమారుడు లోకేష్ కన్నా, దత్తపుత్రుడని వైఎస్సార్సీపీ తరచు విమర్శించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువ హడావుడి చేసి, రోడ్డుపై దొర్లి ఆ విమర్శను సార్దకం చేసుకున్నారు. తదుపరి రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి టీడీపీతో పొత్తు ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఒకపక్క బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో అక్రమ రాజకీయ సంబంధాన్ని పెట్టుకుని దానిని అదీకృతం చేశారు. అదే సమయంలో బీజేపీ మాత్రం తమతో జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పడం చిత్రమే. యువగళం ముగింపు సభలో టీడీపీ, జనసేన అక్రమ రాజకీయ సంబంధాన్ని బీజేపీ పెద్దలు ఆశీర్వదించాలని పవన్ కల్యాణ్ కోరడం కొసమెరుపు. అంతకు ముందు తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేసి డిపాజిట్లు పోగొట్టుకున్న పవన్ ఏపీబాబు, లోకేష్‌లకు పూర్తిగా సరెండర్ అయ్యారన్న విమర్శలకు గురవుతున్నారు. ✍️చంద్రబాబే సీఎం అభ్యర్ధి అని లోకేష్ స్పష్టంగా చెప్పినా, పవన్ మౌనంగా ఉండటం ఆ పార్టీ కేడర్‌కు అవమానంగా మారింది. పొత్తులో కనీసం అరవై సీట్లు అయినా తీసుకోవాలని జనసేన క్యాడర్ కోరుతుంటే వారిని ఆయన వైఎస్సార్సీపీ కోవర్టులగా ప్రకటించారు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం మరో చిత్రమైన పరిణామం. ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు బెంగుళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చంద్రబాబు మంతనాలు జరపడం ఆయన రెండుకళ్ల సిద్దాంతానికి మరో నిదర్శనంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ తప్పదని భయపడుతున్న చంద్రబాబు అక్కడ టూర్లు పెంచి, తాను మళ్లీ గెలిస్తే కుప్పాన్ని అభివృద్ది చేస్తానని చెబుతుండడంపై అంతా విస్తుపోతున్నారు. ✍️నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించిన రోజునే తన మేనమామ కొడుకు తారకరత్న మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు కాగా యువగళానికి బ్రేక్ వేసి డిల్లీకి వెళ్లి ఎక్కువకాలం అక్కడే గడిపారు. తండ్రికి బెయిల్ వచ్చాక కొన్నాళ్లకు మళ్లీ మొదలుపెట్టి విశాఖ వద్ద ముగించారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వాన్ని, వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం అంత తేలిక కాదని కంగారు పడుతున్న చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, ఇద్దరు వ్యూహకర్తలను నియమించుకున్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు నిత్యం అబద్దాలు వండి వార్చుతున్నా జనం నమ్మడం లేదన్న భావనతో ఒకప్పుడు తాను డెకాయిట్ అని తిట్టిన మరో వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ను ప్రత్యేక విమానంలో రప్పించుకుని సంప్రదింపులు చేశారు. ✍️మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అటు ప్రభుత్వ కార్యక్రమాలను, ఇటు పార్టీ వ్యవహారాలను ఒంటిచేత్తో చక్కబెడుతూ ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఆయన రాజీపడటం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం, మూడు నియోజకవర్గాల గ్రామాలకు ఉపయోగపడే భారీ సురక్షిత నీటి పథకాన్ని అమలు చేసి తన సమర్ధతను రుజువు చేసుకున్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇస్తూ బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్నారు. ఏపీ నుంచి విద్యార్థి బృందం ఐక్యరాజ్యసమితికి వెళ్లడం, ఆంగ్లంలో ఏపీ పిల్లలు గణనీయ విజయాలు సాధించడం మొదలైవని సీఎం జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ✍️రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా సాగిస్తున్నారు. ప్రభుత్వరంగంలో పదిహేడు మెడికల్ కాలేజీలను చేపట్టారు. బద్వేల్ వద్ద ప్లైవుడ్ కర్మాగారానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. అలాగే పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లకు శ్రీకారం చుడుతున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఏర్పాటు కావడం శుభపరిణామం. విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుండగా, టీడీపీ, జనసేన, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఎల్లో మీడియా శక్తులు తీవ్రంగా అడ్డుపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ✍️విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కోర్టుల ద్వారా వీరు ఆటంకాలు కల్పిస్తున్నారు. రాజకీయంగా వచ్చే ఎన్నికలకు మిగిలిన పార్టీలకన్నా ముందుగానే సన్నద్దం అవుతున్నారు. అవసరమైతే సిటింగ్‌లను మార్చుతానని కొన్ని నెలల క్రితమే ప్రకటించి, మార్పులు, చేర్పులతో ప్రత్యర్దులకు సవాల్ విసురుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నా, ఆయన వాటిని ఎదుర్కోవడానికే సిద్దపడుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. అందువల్లే తాజా సర్వేలలో కూడా సీఎం జగన్‌కు ఏభైఎనిమిది శాతం మంది జై కొడుతున్నారని తేలింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో మళ్లీ వైఎస్సార్సీపీదే అధికారం అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
TS: బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతో ఆసక్తికర ఫీడ్‌బ్యాక్, ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయని తెలిపారు. వాటిలో నుంచి ఒక కామెంట్‌ను ఆయన ఆదివారం(డిసెంబర్ 31) ఉదయం తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పంచుకున్నారు. కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు 32 యూ ట్యూబ్ చానళ్లు పెట్టి ఉండాల్సిందన్న అభిప్రాయం తనకు బాగా నచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఈ అభిప్రాయంతో తాను కొంత వరకు ఏకీభవిస్తున్నానని కూడా ఆయన ట్వీట్లో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఇటీవల స్వేదపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్‌లో ప్రత్యర్థుల ఫేక్ ప్రొపగాండాను తిప్పికొట్టడంలో తాము విఫలం అయినట్లు ఒప్పుకున్నారు. ఇదీచదవండి..అయోధ్య రామ మందిర వేడుకలు..కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు -
TS: బీజేపీలో15 మంది జిల్లా అధ్యక్షుల మార్పు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పుచేర్పులపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టి పెట్టారు. దీర్ఘకాలికంగా కొనసాగుతుండడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించని జిల్లా అధ్యక్షుల మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించినందున, వీటిలో 15 నుంచి 20 జిల్లాలకు చురుగ్గా పనిచేసే కొత్త అధ్యక్షుల నియామకం దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. పలువురు జిల్లా అధ్యక్షులు దాదాపు నాలుగేళ్లపాటు కొనసాగుతున్నందున పని తీరు, అప్పగించిన విధులు, బాధ్యతల నిర్వహణ, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పాత్ర తదితర అంశాల ప్రాతిపదికన మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నట్టు చెబుతున్నారు. శనివారం పార్టీనాయకులతో కిషన్‌రెడ్డి సమావేశమైన సందర్భంగా సంస్థాగత మార్పులకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టినట్టు సమాచారం. ఇక కిషన్‌రెడ్డి టీం? వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో...పకడ్బందీగా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు తన టీమ్‌ను నియమించుకునే దిశగా కిషన్‌రెడి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు పూరిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా 17 ఎంపీ స్థానాల పరిధిలో పార్లమెంట్ కమిటీలను నియమించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలసమయంలో పార్టీ కోసం సరిగ్గా పనిచేయని వారు, బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు, దీర్ఘకాలికంగా జిల్లా అధ్యక్షులు, ఇతర బాధ్యతల్లో ఉన్న వారు, పార్టీ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మార్చాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్‌లు... శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిన పలువురికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వీరిలో ఇద్దరు ముగ్గురు జిల్లా అధ్యక్షులతో పాటు పదిమంది వరకు రాష్ట్రస్థాయి నాయకులు ఉంటారని తెలుస్తోంది. ఈ నోటీసులపై వారం, పదిరోజుల్లో వివరణ అందాక ఆరోపణల తీవ్రతను బట్టి సస్పెన్షన్లు, ఇతర చర్యలు ఉంటాయని చెబుతున్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ ఎం.ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్, సభ్యులు నాగూరావు నామాజీ, పద్మజా రెడ్డి, బోసుపల్లి ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకులపై వచి్చన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది. -
రాష్ట్రం నుంచి పెద్దల సభకు సోనియా!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నట్టు టీపీసీసీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ స్థానాలతోపాటు రాష్ట్ర శాసన మండలిలో పలు సీట్లు ఖాళీ అవుతుండటంతో.. ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో పోటీ పెరిగింది. మార్చి నాటికి రెండు రాజ్యసభ స్థానాలతోపాటు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్, మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీకానున్నాయి. సొంత పార్టీ నేతలతోపాటు టీజేఎస్, సీపీఐ నేతలు కూడా ఎమ్మెల్సీ సీట్లు, ఇతర పదవులను ఆశిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుంటే.. సోనియా గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని.. లేదంటే తెలంగాణ నుంచే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరుతూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తీర్మానం చేసి అధిష్టానానికి పంపింది. సోనియా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పోటీచేసే అవకాశం ఉందని.. అక్కడ ప్రియాంకా గాంధీని పోటీకి పెడితే, సోనియా తెలంగాణకు మారవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి సోనియా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే చర్చ ఉందని.. ఈ క్రమంలో ఆమెను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని టీపీసీసీ ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనితో రాష్ట్ర కాంగ్రెస్‌కు రానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి రిజర్వ్ అయినట్టేనని.. మరో సీటు కోసం ఏఐసీసీలో కీలక భూమిక పోషిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా యువనేత చల్లా వంశీచంద్‌రెడ్డికి ఇవ్వవచ్చని చర్చ జరుగుతోంది. మరోవైపు రాజ్యసభ పో టీలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు రాష్ట్రస్థాయిలో పదవి ఇవ్వాలని, కుదరకపోతే రాజ్యసభకు ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని టీపీసీసీ పెద్దలు భా విస్తున్నట్టు సమాచారం. ఆయనకు ఏ చాన్స్ దక్కుతుందన్నదానిపై చర్చ జరుగుతోంది. 20 మందికిపైగా ఆశావహులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా పోటీ నెలకొంది. ప్రజా గాయకుడు అందెశ్రీతోపాటు పార్టీలోని పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు టీజేఎస్, సీపీఐ నేతలకు ఇప్పుడే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారా, లేక భవిష్యత్తులో ఖాళీ అయ్యే స్థానాలను ఇస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా సీట్లు త్యాగం చేసినవారు, పోటీ చేసి ఓడినవారు, వివిధ కోటాల కింద తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నవారు చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. ఈ జాబితాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, అలీ మస్కతి, మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. తుంగతుర్తి అసెంబ్లీ సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్‌ను మంత్రి చేయాలనుకుంటే.. ఈసారి ఎమ్మెల్సీ కోటాలోనే ఆయనకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. లేదంటే వరంగల్ లోక్‌సభ నుంచి పోటీ చేయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్సీ ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక సాహిత్య రంగం నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అందెశ్రీ పేరు దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యరి్థగా చిన్నారెడ్డి పేరు ఖరారు కావచ్చని సమాచారం. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌లో స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలో ఎవరెవరికి పదవీ యోగం కలుగుతుందనేది ఉత్కంఠగా మారింది. -
బీఆర్ఎస్ సీనియర్లకు కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కార్యాచరణపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం మరికొందరు పార్టీ కీలక నేతలకూ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ కోర్ టీమ్‌లో కేటీఆర్, హరీశ్లతోపాటు పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, మాజీ డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో కోర్‌టీం నుంచి ఆయనను మినహాయించారు. సన్నాహక సమావేశాల బాధ్యతలు కూడా.. వచ్చే నెల మూడో తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతల్లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలు లేదా లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా కోర్‌టీమ్ సభ్యులకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మండల స్థాయి నాయకులదాకా ఈ భేటీలకు ఆహ్వానించినందున వారిని సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్, హరీశ్, ఇతర నేతలకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచీ భాగస్వాములను చేసి.. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బూత్‌ల వారీగా వివిధ పార్టీలకు లభించిన ఓట్లపై ఇప్పటికే ఓ ప్రైవేటు ఏజెన్సీ పోస్ట్‌మార్టం చేసి నివేదికను అందజేసింది. మరోవైపు బూత్‌స్థాయి మొదలుకుని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేసిన పార్టీ నేతల వివరాలను కూడా ఇప్పటికే క్రోడీకరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కింది స్థాయి నేతలు పనిచేసిన తీరును మదింపు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి భిన్నంగా బూత్ స్థాయి నేతలను కూడా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను పార్టీ ఇప్పటికే సిద్ధం చేసింది. జనవరి 3 నుంచి లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా జరిగే సన్నాహక సమావేశాల్లో వారికి ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. -
కాంగ్రెస్‌తోనే కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ మాత్రమే పొత్తుతో ముందుకు వెళ్లగా, లోక్‌సభ ఎన్నికల వేళ సీపీఎం కూడా జతచేరనుందా? మొత్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తాయా? పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని నిలువరించడమే ధ్యేయంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు అధికారికంగా పొత్తు కుదుర్చుకోనున్నా యా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు.. తెలంగాణలోనూ కలసి పనిచేస్తామని అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుందని తెలుస్తోంది. ఇందుకు శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌తో రాష్ట్ర సీపీఎం నేతల భేటీ వేదికయిందనే చర్చ జరుగుతోంది. కలసి పనిచేద్దాం.. సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు కల సిన సందర్భంగా యాధృచ్ఛికంగా ఈ చర్చ వచ్చిన ట్టు తెలుస్తోంది. తమతో కలసి పనిచేయనప్పటికీ.. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ సీపీఎం నేతలతో అన్నారని విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పనిచేయనంత మాత్రాన వేర్వేరు కాబోమని, లోక్‌సభ ఎన్నికల సమయంలో పొంచి ఉన్న బీజేపీ ప్రమాదాన్ని ఎదు ర్కొనేందుకు ఐక్యంగా పనిచేద్దామని ముఖ్యమంత్రి వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. ఇందుకు స్పందించిన సీపీఎం నేతలు బీజేపీని ఎదుర్కొనే విషయంలో తమకు వేరే ఆలోచన ఉండబోదని, అయితే కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అంశాన్ని పార్టీలో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినట్టు సమా చారం. అలాగే చేద్దామని, త్వరలోనే మళ్లీ కలసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని సీఎం రేవంత్ చెప్పడంతో మరోమారు సమావేశమవు దామని వారు ఈ చర్చను ముగించినట్టు తెలిసింది. సీపీఎం నాయకులు తనను కలసిన సందర్భంగా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని తెలుస్తోంది. సీపీఎంతో తెలంగాణలో జట్టుకట్టే విషయంలో కాంగ్రెస్ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారని, ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఉభయ వామపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
నా రాజీనామా ఊహాగానమే
సాక్షి హైదరాబాద్/కంటోన్మెంట్: తాను గవర్నర్‌గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని అనురాధా టింబర్స్‌ను సందర్శించినప్పుడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గవర్నర్‌గా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు శ్రీరాముడితో పాటు ప్రధాన మంత్రి మోదీ చేతుల్లో ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. పూల బొకేలు వద్దు.. బుక్స్ తీసుకురండి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సోమవారం ఉదయం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులను గవర్నర్ ఆహ్వనించినట్టు తెలిసింది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లు పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులను తీసుకురావాలని గవర్నర్ విజ్ఞప్తి చేసినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. -
TS: మెట్రో రైలెక్కిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఎల్బీనరగ్ స్టేషన్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తూ సరదాగా ప్రయాణికులతో ముచ్చటించారు. నాగోల్ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని రవీంద్రభారతిలో మరో కార్యక్రమానికి వెళ్లేందుకు హరీశ్‌రావు మెట్రో రైలెక్కారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..కొండా సురేఖ, పల్లా వాగ్వాదం ఎందుకంటే -
TS: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే
సాక్షి,సిద్దిపేట: మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను స్టేజిపైకి పిలవడమేంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అలిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజి మీదకు పిలవడం చాలా దురదృష్టకరం అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏండ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించానని పల్లా చెప్పారు. పల్లా వ్యాఖ్యలపై మంతత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఉండలేక సమావేశం నుంచి వెళ్లి పోయారన్నారు. తమకు ఎవరినైనా ప్రత్యేకంగా పిలుచుకునే అధికారం ఉంటుందన్నారు. పల్లా ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదీచదవండి..భట్టి పదే పదే అదే చెప్తున్నారు..జగదీష్‌రెడ్డి -
TS: భట్టి పదేపదే అదే చెప్తున్నారు.. జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇరవై రోజులుగా చెప్పిందే చెప్పుకుంటూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ ఆగిపోతుంది అని ఇప్పటికే జనంలో చర్చ మొదలైందన్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని చెప్పటం సరికాదన్నారు. ‘కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జనం అనుకుంటున్నారు. చేతకాకపోతే చేతకాదు అని చెప్పాలి. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భారత దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు. విద్యుత్ సంస్థల్లో కూడా అప్పులు లేని రాష్ట్రం లేదు. వీళ్లు పాలించిన రాజస్థాన్ రాష్ట్రంలోనూ అప్పులున్నాయి. పదే పదే భట్టి విక్రమార్క అప్పులున్నాయని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతకాక అప్పులు గురించి మాట్లాడుతున్నారు. 2014కు ముందు 20 వేల కోట్లు అప్పు చేసి 3నుంచి 4 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మేము 60 వేల కోట్లు అప్పు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం’ అని జగదీష్‌రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి -
TS: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విధి నిర్వహణలో నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి తమ వివరాలు కనుక్కుని మరీ సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఇదీచదవండి..తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
పథకాల అమలులో కాలయాపన చేసే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హనుమకొండ: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని తెలిపారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. సంయమనం పాటించి, ఓపికతో ఉండాలని చెప్పారు. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు కవిత శనివారం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బస్సు ఫ్రీ విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతిపై ఫామ్‌లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు. చదవండి: ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండు మారదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుందని. అయితే ఎంక్వైరీ రిపోర్టు రాకముందే మంత్రులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. లక్షలాది మంది భక్తులు దర్శించుకునే సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ పండగగా గుర్తింపు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కృషి చేయాలని తెలిపారు. కొత్త కార్ల విషయాన్నిప్రభుత్వం రహస్యంగానే ఉంచుతుందని చెప్పారు. భద్రత దృష్ట్యా సీక్రెట్‌గా ఉంచాలని ఇంటెలిజెన్స్ చెప్పిన ప్రకారం ఈ విషయాలు రహస్యంగా ఉంచుతారని అన్నారు. ఎవరూ అధికారంలో ఉన్నా అదే పద్దతి ఉంటుందన్నారు. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారని పేర్కొన్నారు. దీన్ని పెద్ద అంశంగా చూపి వెటకారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ముఖ్యమంత్రి గౌరవమే తగ్గుతుందని కవిత పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, అందుకే పోటీ నుంచి తప్పుకున్నట్లు కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మిక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అందుకే AITUC మద్దతు ఇచ్చామని చెప్పారు. సింగరేణికి అనేక పనులు చేశామన్నా ఆమె.. ఆత్మ ప్రమోధానుసారం ఓటు వేయమని కోరినట్లు తెలిపారు. -
TS: రాజీనామాపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని... గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్.. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తాన్నారు. రాజకీయాలు అనేది నా కుటుంబ నేపథ్యంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది.