బీఆర్‌ఎస్‌ సీనియర్లకు కీలక బాధ్యతలు | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సీనియర్లకు కీలక బాధ్యతలు

Published Sun, Dec 31 2023 3:40 AM

BRS Party Focus On Lok Sabha Elections: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కార్యాచరణపై దృష్టిపెట్టిన బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం మరికొందరు పార్టీ కీలక నేతలకూ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ కోర్‌ టీమ్‌లో కేటీఆర్, హరీశ్‌లతోపాటు పార్టీ సెక్రెటరీ జనరల్‌ కే.కేశవరావు, మాజీ డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, మాజీ స్పీకర్‌లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో కోర్‌టీం నుంచి ఆయనను మినహాయించారు.

సన్నాహక సమావేశాల బాధ్యతలు కూడా..
వచ్చే నెల మూడో తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతల్లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలు లేదా లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా కోర్‌టీమ్‌ సభ్యులకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మండల స్థాయి నాయకులదాకా ఈ భేటీలకు ఆహ్వానించినందున వారిని సమన్వయం చేసే బాధ్యతను సీనియర్‌ నేతలకు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే కేటీఆర్, హరీశ్, ఇతర నేతలకు దిశానిర్దేశం చేశారు.

బూత్‌ స్థాయి నుంచీ భాగస్వాములను చేసి..
2014, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బూత్‌ల వారీగా వివిధ పార్టీలకు లభించిన ఓట్లపై ఇప్పటికే ఓ ప్రైవేటు ఏజెన్సీ పోస్ట్‌మార్టం చేసి నివేదికను అందజేసింది. మరోవైపు బూత్‌స్థాయి మొదలుకుని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేసిన పార్టీ నేతల వివరాలను కూడా ఇప్పటికే క్రోడీకరించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కింది స్థాయి నేతలు పనిచేసిన తీరును మదింపు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి భిన్నంగా బూత్‌ స్థాయి నేతలను కూడా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను పార్టీ ఇప్పటికే సిద్ధం చేసింది. జనవరి 3 నుంచి లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా జరిగే సన్నాహక సమావేశాల్లో వారికి ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement