అమ్మ మరణంలో సంచలన కొత్త కోణం

new angle in jayalalitha death case - Sakshi

జయలలితను చూడనే లేదు

75 రోజులపాటు ప్రత్యేక గదికే పరిమితం

కమిషన్‌ ముందు ప్రభుత్వ వైద్యబృందం వాంగ్మూలం

మరో ఆరు నెలల గడువు కోరిన కమిషన్‌ చైర్మన్‌

మాజీ సీఎస్‌లకు సమన్లు

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీపై జరుగుతున్న విచారణ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం తరపున  నియమితులైన తామే ఆస్పత్రిలో ఉన్న జయను చూడలేక పోయామని విచారణ కమిషన్‌ ముందు వైద్య బృందం చెప్పుకొచ్చింది. 75 రోజుల పాటు ప్రత్యేక గదికే పరిమితమై, సాయంకాలం వరకు కాలక్షేపం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్‌ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అమ్మకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించేందుకు ఐదుగురితో కూడిన ప్రభుత్వ వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 75 రోజుల తర్వాత డిసెంబర్‌ 5న జయలలిత కన్నుమూశారు. దీనిపై ప్రతిపక్షాలు న్యాయవిచారణకు పట్టుపట్టడంతో గత ఏడాది సెప్టెంబర్‌ 25న ప్రత్యేక కమీషన్‌ ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 27 మంది తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా మరో వందమందికి పైగా ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాలు సమర్పించగా వీరికి సైతం సమన్లు పంపాల్సిందిగా ఆర్ముగస్వామి తన సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఆక్యుపంచర్‌ వైద్యుడు శంకర్, 13న జయ మేనకోడలు దీప, 14న దీప సోదరుడు దీపక్, 20న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మెహన్‌రావు హాజరయ్యేలా సమన్లు వెళ్లాయి.

గదికే పరిమితం
కమిషన్‌ విచారణలో భాగంగా గురువారం చైర్మన్‌గా ఆర్ముగస్వామి ముందు వాంగ్మూలం ఇచ్చిన ప్రభుత్వ వైద్యుల బృందం కొత్త విషయాలను బైటపెట్టింది. వైద్యుల బృందం ఏర్పాటైంది. ఈ బృందం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలాజీ, ఇతర నలుగురు వైద్యులను కమిషన్‌ వేర్వేరుగా విచారణ జరిపింది. తిరుప్పరగున్రం, తంజావూరు, అరవకురిచ్చి ఉప ఎన్నికల్లో బీఫాం కోసం శశికళ సమక్షంలో తానే జయ వేలిముద్రలు సేకరించానని, ఆ సమయంలో మరెవ్వరూ లేరని బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు.

అయితే ఆదే బృందంలోని మిగిలిన నలుగురు వైద్యులు మరో కోణాన్ని ఆవిష్కరించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాము ఒక్కసారి కూడా జయలలితను నేరుగా చూడలేదని, తమ కళ్లెదురుగా సీటీస్కాన్‌కు తీసుకెళ్లినపుడు సైతం ఆమె చుట్టూ కర్టెన్‌ కట్టారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో తమ నలుగురికీ కనీసం టీవీ కూడా లేని ఒక ప్రత్యేక గదిని కేటాయించారని చెప్పారు. గది నుంచి అప్పుడప్పుడూ బయటకు వదులుతారని, ఆ సమయంలో జయకు జరుగుతున్న చికిత్సపై విడుదల చేస్తున్న బులెటిన్‌ను తమకు చదివి వినిపిస్తారని అన్నారు.

ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గదిలో కూర్చుని వెళ్లిపోవడం మినహా చేసింది ఏమీ లేదని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నియమించిన ఐదుగురు వైద్యుల బృందంలో బాలాజీ ఒక్కరు మాత్రమే జయ వద్దకు వెళ్లడం, మిగిలిన వారిని దూరంగా పెట్టడంపై అనుమానాలు రేగాయి. ఈనెల 27వ తేదీన మరోసారి హాజరుకావాల్సిందిగా డాక్టర్‌ బాలాజీని కమిషన్‌ ఆదేశించింది.

మాజీ సీఎస్‌లకు సమన్లు
విచారణ పూర్తి చేసిన నివేదిక అందజేసేందుకు మరో ఆరునెలల గడువు ఇవ్వాల్సిందిగా విచారణ కమిషన్‌ శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. సెప్టెంబర్‌ 25వ తేదీన కమిషన్‌ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం మూడునెలల గడువు విధించింది. ఆర్ముగస్వామి బాధ్యతల స్వీకరణలోనే (అక్టోబర్‌ 24) నెలరోజుల జాప్యం ఏర్పడింది. ఆ తరువాత విచారణ వేగవంతంగా సాగుతున్నా ఈనెల 24వ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఇంకా పలువురిని విచారించాల్సి ఉన్నందున మరో ఆరునెలలకు గడువు పొడిగించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top