
ప్రత్యేక విచారణకు ఏర్పాటు చేసిన అసోం ప్రభుత్వం
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ప్రత్యేకంగా విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా సారథ్యంలో కమిషన్ ఏర్పాటవుతుందని ఫేస్‌బుక్‌లో తెలిపారు. ఈ మేరకు గౌహతి ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారన్నారు.
జుబీన్ గార్గ్ మృతికి దారి తీసిన పరిస్థితులు, కారణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా ఈ కమిషన్‌కు అందివ్వవచ్చని సీఎం అన్నారు. జుబీన్ వెంట ఉన్న అసోం అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ సభ్యులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19వ తేదీన జుబీన్ చనిపోవడం తెల్సిందే. ఆయన అక్కడ జరిగే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు.
ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతా, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆ కార్యక్రమ బ్యాండ్ సభ్యులైన శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్‌ప్రభ మహంతాలను అదుపులోకి తీసుకున్నారు.
ఈత కొడుతుండగా జుబీన్‌కు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పడవలో వీరిద్దరూ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. జుబీన్ హత్యపై 10 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లయింది. జుబీన్ గార్గ్ మృతిపై నమోదైన 60కి పైగా కేసులను సీఐడీ విచారిస్తోంది.
సింగపూర్ ఆస్పత్రిలో చేపట్టిన జుబీన్ గార్గ్ పోస్టుమార్టం నివేదికను ఆయన భార్య గరిమాకు అందించామని, గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి చేపట్టిన పోస్టుమార్టం నివేదిక శనివారం అందాక ఆమెకే ఇస్తామని, వాటిని బహిర్గతం చేయాలా వద్దా అనేది ఆమె ఇష్టమన్నారు.
శ్యాంకను మహంతా కుంభకోణంపై ఈడీ, ఐడీ దృష్టిసారించాయి. మహంతా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, బినామీ పేర్లను ఆస్తులను కూడబెట్టారంటూ వచి్చన ఆరోపణలను ఈడీ, ఐడీ పరిశీలిస్తున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి కారణంగా ఆరోపణలున్న మహంతాను ఇప్పటికే అసోం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ఈ సందర్భంగా పోలీసులు శ్యాంకను మహంతా గత 20 ఏళ్లుగా పాల్పడుతున్న ఆర్థిక అవకతవకలను గుర్తించారు. వీటి వివరాలను ఐడీ, ఈడీ అధికారులు ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి వెళ్లి తెల్సుకున్నారు.