నాలుగు పిల్లల్ని చంపిన పులి

4 tiger cubs die in Vandalur zoo - Sakshi

చెన్నై వడలూరు జూలో ఘటన

‌చెన్నై : నగరంలోని వడలూరులో గల అన్నా అరిగ్ఞర్‌ జూ పార్కులో తన నాలుగు పిల్లలను పులి హత మార్చింది. గత ఆదివారం ఉత్తర అనే పులి పార్కులో నాలుగు పిల్లలను ఈనింది. దీంతో పార్కులో పులి పిల్లల సంఖ్య 30కి పెరిగిందంటూ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, జన్మించిన పులి పిల్లలు గురువారం సాయంత్రం మృతి చెందినట్లు శనివారం వెలుగులోకి వచ్చింది.

పులి పిల్లల గొంతు, ఉదర భాగంలో గాయాలు ఉన్నట్లు సమాచారం. తల్లి పులే పిల్లలను చంపినట్లు తెలిసింది. తల్లి పులి తన పిల్లలను నోటితో కరచుకుని వెళ్తున్న సమయంలో గాయాలు ఏర్పడి ఉండవచ్చునని పార్కు సమాచార ప్రతినిధి తెలిపారు. అదే సమయంలో పులి పిల్లలు ఆహారం తినలేకపోవడం, గాయాల కారణంగా మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్నారు.

ఉత్తర పిల్లలను ఈనగానే వాటిని పర్యవేక్షించేందుకు చుట్టూ ఎనిమిది నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నలుగురు వ్యక్తులను నియమించారు. కాగా, నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడమే పులి పిల్లల మృతికి కారణమనే ఆరోపణ ఉంది. వడలూరు జూలో ఇంతవరకూ పులి పిల్లలు మృతి చెందలేదు.

పార్కు సూపర్‌వైజర్‌ ఈ సంఘటనపై పార్కు డిప్యూటీ డైరక్టర్, ఫారెస్టు అధికారులకు నివేదికలు పంపారు. దీని గురించి శాఖాపరమైన విచారణకు అధికారి సుధ ఉత్తర్వులు ఇచ్చారు.
 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top