ఏర్కాడు ఉప సమరానికి సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను కల్పించారు.
సర్వం సిద్ధం
Dec 4 2013 1:43 AM | Updated on Aug 14 2018 2:50 PM
సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప సమరానికి సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను కల్పించారు. ఎన్నికల సరళి పరిశీలనకు 21 మంది ప్రత్యేక పర్యవేక్షకులు రంగంలోకి దిగారు. అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా భావించి తీర్పు ఇవ్వాలని ఓటర్లకు సీఎం జయలలిత పిలుపునిచ్చారు. తాను ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించలేదని ఈసీకి వివరణ ఇచ్చారు. ఏర్కాడు ఉప ఎన్నికలు అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఈ ఉపసమరాన్ని లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా మలుచుకునేందుకు ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేతోపాటుగా మొత్తం 11 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం నిర్వహించే పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంలను, విధులకు హాజరయ్యే అధికారులను, సిబ్బందినీ భద్రత నడుమ ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. అభ్యర్థి నచ్చకుంటే ఉపయోగించే నోటా బటన్‌ను రాష్ట్రంలో ప్రపథమంగా ఈ ఎన్నికకు పరిచయం చేస్తున్నారు. తొలిసారిగా ఆ బటన్‌ను నొక్కే అవకాశం ఏర్కాడులోని కొందరు ఓటర్లకు దక్కబోతున్నది.
ప్రత్యేక పర్యవేక్షకులు
బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ప్రత్యేక పర్యవేక్షకులు 21 మందిని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియోలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. 290 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఆయా కేంద్రాల్లో రికార్డు అయ్యే దృశ్యాల్ని చెన్నై నుంచి ఈసీ ప్రవీణ్‌కుమార్ వీక్షించనున్నారు. 29 సమస్యాత్మక కేంద్రాల్లో ఐదు అంచెల భద్రతను, మిగిలిన కేంద్రాల్లో మూడు అంచెల భద్రతను కల్పించారు. పారా మిలిటరీ బలగాలు 2500 మందితో పాటు, స్థానిక పోలీసులను భద్రతకు నియమించారు. ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపుకార్డులను లేదా, ముందుగా జారీ చేసిన బూత్ స్లిప్పులు కలిగి ఉండే వాళ్లను మాత్రమే పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏర్కాడు ఓటర్లకు పిలుపు నిస్తూ సీఎం జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికలకు రెపరెండంగా నిలిచే రీతిలో తమ తీర్పును ఓటర్లు ఇవ్వాలని పిలుపు నిచ్చారు.
కోడ్ ఉల్లంఘించ లేదు: ఏర్కాడు ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత కోడ్ ఉల్లంఘించి ప్రత్యేక పథకాల్ని, హామీల్ని ప్రకటించినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేరాయి. దీంతో ఆమెకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. దీనికి మంగళవారం సీఎం జయలలిత వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి ప్రత్యేక పథకాల్ని, ప్రకటనల్ని చేయలేదని స్పష్టం చేశారు. కోడ్ ఉల్లంఘించే విధంగా తన ప్రసంగం సాగలేదని వివరించారు. తాను తమిళంలోనే ప్రసంగించానని, నియోజకవర్గంలోని సమస్యలు తన దృష్టికి వచ్చి ఉన్నాయని మాత్రమే తాను పేర్కొన్నానన్నారు. అయితే, పలాన పనులు అని ప్రత్యేకంగా సూచించలేదని, రోడ్లు వేయిస్తానని, నీటి పథకాలు ప్రవేశ పెడతానని తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement