కాటికాపరి...యశోద...

Yashoda Working In Cemetery Karnataka - Sakshi

బొమ్మనహళ్లి : స్మశానంలో అంత్య సంస్కారాలను కాటికాపరి నిర్వహిస్తారనేది జగద్వితమే. అయితే తుమకూరులోని గార్డెన్‌ రోడ్డులో ఉన్న స్మశానంలో ఓ మహిళ ఈ విధులను నిర్వర్తిస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆర్య వైశ్య బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ రుద్ర భూమిలో యశోద రాత్రి 11 గంటల వరకు ఈ విధుల్లో ఉంటారు. నెలకు సుమారు 20 శవాలకు సంస్కారాలను నిర్వహిస్తున్న ఈ ధీశాలి గురించి....

యశోద భర్త గూళయ్య తొలుత ఇక్కడ కాటికాపరిగా ఉండేవారు. అనారోగ్యం కారణంగా ఆయన మృత్యువాత పడడంతో భర్త విధులను తాను స్వీకరించింది. భర్త చనిపోయే నాటికి ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. బతుకు బండిని లాగడానికి తానే కాటికాపరిగా పని చేస్తానంటే సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ మహిళ ఈ పని చేస్తుందా...అసలు మన ఆచారం ప్రకారం మహిళలు స్మశానంలో అడుగే పెట్టకూడదు. అలాంటిది కాటికాపరిగా పని చేస్తుందా...అనే ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. అందరూ ఆచారాల గురించి మాట్లాడే వారే కానీ...ఆమె ఇద్దరు పిల్లల పోషణ గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. ఆ పిల్లల కోసమే తాను రెండేళ్ల కిందట కాటికాపరి విధులను చేపట్టాల్సి వచ్చిందని యశోద వివరించారు.

అన్నీ తానై......
అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ యశోద పూర్తి చేస్తారు. ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు....అంతిమ సంస్కారానికి అవసరమైన సామాగ్రినంతటినీ సిద్ధం చేసుకుంటారు. బంధువులు శవానికి తలకొరివి పెట్టి వెళ్లిపోతారు. అయితే చితి మంటలు చల్లారే దాకా శవం పూర్తిగా కాలేదాకా...యశోద దగ్గరుండి చూసుకుంటారు. మగాడి లాగా యశోద భయంగొలిపే ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నా నెలకు ఆమెకు దక్కేది కేవలం రూ.2 వేలే. అంత్య సంస్కారాలకు హాజరయ్యే మృతుని తాలూకా వారు ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు లేదా వెళ్లిపోవచ్చు..గ్యారంటీ లేదు అని యశోద చెబుతారు. అయితే తన ఇద్దరి పిల్లల చదువు సంధ్యలకు తనకీ పని తప్పదని అంటారు. భర్త నుంచి సంక్రమించిన ఈ ఉద్యోగం తనకు పూర్తి సంతృప్తినిస్తోందని తెలిపారు. అంత్య సంస్కారాల్లో తానూ పాలు పంచుకున్నాననే తృప్తీ మిగులుతోందన్నారు. త్వరలోనే ఇక్కడ విద్యుత్‌ స్మశాన వాటికను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ తర్వాత ఈ ఉద్యోగం ఉంటుందో...ఊడుతుందో తెలియడం లేదని యశోద ఆందోళన వ్యక్తం చేశారు. దానిని ఏర్పాటు చేసినా తనకిక్కడ ఓ చిరుద్యోగమైనా ఇవ్వాలని ఆమె నగర పాలికె అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top