ఏపీలో తెలుగుకు దౌర్భాగ్య పరిస్థితి

Wretched condition for Telugu in AP says Yarlagadda laksmi prasad - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  పొరుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ వేనోళ్ల కీర్తించే తెలుగుభాష ఆంధ్రప్రదేశ్‌లో ధౌర్భాగ్యపరిస్థితిని ఎదుర్కొంటోందని బహుభాషా కోవిదుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను నమ్ముకోకుండా తెలుగువారే తమ భాషా, సంస్కృతులను కాపాడుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్‌) 11వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు, రజతోత్సవ వేడుకలు అధ్యక్షురాలు వీఎల్‌ ఇందిరాదత్‌ అధ్యక్షతన చెన్నైలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి, తెలుగువారైన పి.బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.

‘తెలుగుభాష, సంస్కృతి’ అంశంపై యార్లగడ్డ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ.. ‘‘ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి సిలికాన్‌కు వెళ్లి అక్కడున్న ఆంధ్రులను తెలుగు భాషను కాపాడండి, మా కూచిపుడి నృత్యాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా చేయిస్తాం.. మీరు సహాయం చేయండని కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు పట్టిన దుస్థితి. ఏపీలో తెలుగుభాషను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని అంగన్‌వాడీ పాఠశాలలనూ ఆంగ్లమాధ్యమంగా మార్చే దుర్భర పరిస్థితిలో మేమున్నాం. ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను నిందించి ప్రయోజనం లేదు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలి, కొడుకుని, మనవడిని, మునిమనవడిని సీఎంగా చేసుకోవాలి. ఆ స్థానంలో నేనున్నా అదే పని చేస్తాను. భాషా ప్రయోజనాలు కాపాడుతున్న ప్రభుత్వాల జీవోలను పట్టుకెళ్లి ఏపీలో ఇవ్వండి. ఈ సభలకు విదేశాల నుంచి హాజరైన చాలామంది తెలుగుభాష, సంస్కృతులపై మేమేదో తెలుగును ఉద్ధరిస్తామని మావైపు చూస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతిపై మీకేదో సహాయం చేస్తామని మీరు భారత్‌కు వస్తుంటే, మేమేమో మీ దేశాలకు వచ్చి మిమ్మల్ని అర్థించడం యథార్థమైన విషయం’ అని పరోక్షంగా లోకేశ్‌కు యార్లగడ్డ చురకలంటించారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ది ప్రత్యేక స్థానం
‘తెలుగు భాష, సంస్కృతిని కాపాడిన వారే చరిత్రలో స్థానం పొందుతారు. అలాంటి వారిలో మొట్టమొదట వ్యక్తి జలగం వెంగళరావు. తరువాత మండలి కృష్ణారావుతోపాటు, ఎన్‌టీఆర్‌ తెలుగును అజరామరం చేశారు. తెలుగుకు ప్రాచీనహోదా సాధించిపెట్టిన వైఎస్‌ రాజశేఖరరెడ్డిది ప్రత్యేక స్థానం’ అని అన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top