ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరాల్లో ఒకటైన ఢిల్లీలో మంచి గాలిని పీల్చుకునే భాగ్యం కలుగజేస్తామంటున్నారు ‘బ్రీత్ ఈజీ’ డెరైక్టర్ బరుణ్ అగర్వాల్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరాల్లో ఒకటైన ఢిల్లీలో మంచి గాలిని పీల్చుకునే భాగ్యం కలుగజేస్తామంటున్నారు ‘బ్రీత్ ఈజీ’ డెరైక్టర్ బరుణ్ అగర్వాల్.. చైనా రాజధాని బీజింగ్ కన్నా మూడింతలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరంలో మంచి గాలి అనేది గగనమైపోయింది. దీంతో ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారు. కాగా, మన ఇంటి, కార్యాలయాల పరిధిలోనే ‘దావోస్’ పద్ధతి ద్వారా ఆరోగ్యవంతమైన గాలిని పీల్చుకునే అవకాశం కలుగుతుందని అగర్వాల్ చెబుతున్నారు. ‘ప్రతి ఒక్కరూ సమస్య కోసం మాట్లాడుతున్నారు ..కాని సమస్యపరిష్కారం గురించి కొంతమంది మాత్రమే యత్నిస్తున్నారు.. అందుకే మేం ముందడుగు వేశాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నివాస ృహాలు, అపార్టుమెంట్లు, ఆస్పత్రులు, హోటళ్లు, మాల్స్ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న తక్కువ స్థలంలోనే తాము సూచించిన టెక్నిక్‌ను ఉపయోగిస్తే ప్రజలకు మంచి శ్వాసను అందించవచ్చని ఆయన విశ్వాసం ప్రకటించారు. ‘మదర్ ఇన్ లా టంగ్, అరేకా పామ్, మనీ ప్లాంట్‌లను కలిపి అందుబాటులో ఉన్న తక్కువస్థలంలోనే పెంచాలని సూచించారు. ఈ మూడు కలిసి సమీప ప్రాంతంలోని ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేసి గాలిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయని తెలిపారు. కార్యాలయాలు, కాన్ఫరెన్స్ గదులు, కారిడార్లు, మెట్లమార్గాలు, వాష్‌రూమ్‌ల వద్ద ఈ మూడు మొక్కలను పెంచుకోవచ్చన్నారు. దీంతో ఆ మొక్కలు వదిలే ఆక్సిజన్ చుట్టుపక్కల వ్యాపించి మనకు ఆరోగ్యమైన గాలిని అందిస్తుందని వివరించారు.
ఢిల్లీనగరంలో బయట వాతావరణం కన్నా ఇండోర్ వాతావరణంలోనే కాలుష్యం శాతం ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఎక్కువ శాతం మంది బీపీతో చనిపోతుండగా, తరువాతి స్థానం ఇండోర్ వాయు కాలుష్యంతోనే వృత్యువాతపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయని మీటల్ అనే పర్యావరణవేత్త తెలిపారు. పెద్ద పెద్ద ఆస్పత్రులతో పోలిస్తే మన నివాసప్రాంతాల్లో బాక్టీరియా, ఫంగస్ స్థాయి తక్కువగానే ఉన్నప్పటికీ, దాన్ని మరింత తగ్గించేందుకు ఆవాస ప్రాంతాల్లో ‘దావోస్’ పద్ధతిని అనుసరించాలని ఆయన నొక్కిచెప్పారు. అందుకే వీలైనంత ఎక్కువగా ఈ మొక్కల పెంపకాన్ని కార్పొరేషన్లు ప్రోత్సహిస్తే నగరాన్ని అంత త్వరగా కాలుష్యరహితంగా మార్చవచ్చని ఆయన సూచించారు.