డొనేట్ బ్లడ్ బట్ నాట్ ఆన్ రోడ్స్...అనే సందేశాన్ని బైక్‌పై రాసుకుని తిరిగిన యువకులు అదే బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : డొనేట్ బ్లడ్ బట్ నాట్ ఆన్ రోడ్స్...అనే సందేశాన్ని బైక్‌పై రాసుకుని తిరిగిన యువకులు అదే బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులు చిక్కబళ్లాపురానికి చెందిన సుశాంత్(23), చింతామణికి చెందిన దీపక్(24), దొడ్డబళ్లాపురానికి చెందిన కార్తీక్(23)గా గుర్తించారు. వీరిలో సుశాంత్, దీపక్‌లు ఇక్కడి రిట్టల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు. డిప్లోమా చదివిన కార్తీక్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఇదిలా ఉంటే ముగ్గురూ ఒకే బైక్‌పై శుక్రవారం రాత్రి ఇక్కడి ప్రసన్న టాకీస్‌లో తుఫాన్ సినిమాకు వెళ్లారు. అనంతరం రైల్వేస్టేషన్ సర్కిల్‌కి వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి బెంగళూరు-హిందూపురం రహదారిపై బైక్‌పై వస్తుండగా, మార్గం మధ్యలో ముత్తూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఒకటి వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో ప్రమాదంలో సుశాంత్, దీపక్‌లు ఇద్దరూ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా శనివారం ఉదయం చికిత్స ఫలించక మృతి చెందాడు.
యువకుల మృతితో వీరి తల్లితండ్రులు, బంధువులు,స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. రక్తదానం చేయాలని, అయితే అది రోడ్లపై కాకూడదని సందేశం బైక్‌పై రాసుకుని తిరిగిన యువకులు చివరకు రోడ్డుపైనే రక్తమోడి దుర్మరణం చెందడం శోచనీయం. పట్టణ పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.