పొలంలో రక్తం ప్రవహించింది. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.
- ఆస్తి గొడవల్లో దంపతులు, కొడుకు హత్య
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- కర్ణాటకలో దారుణం
బళ్లారి: పొలంలో రక్తం ప్రవహించింది. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం అనుబంధాల్ని చిదిమేసింది. దాయాదుల మధ్య ఏర్పడిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం సేడం తాలూకా ముగనూరు గ్రామ శివార్లలోని వ్యవసాయ భూమిలో రెండు దాయాది కుటుంబాలు ఆస్తి పంపకాల గొడవలతో బాహాబాహీకి దిగాయి. పరస్పరం గొడ్డళ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు.
ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన దేవరాయ (56), అతని భార్య కాళమ్మ (50), వారి కుమారుడు రాజశేఖర్(20)లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కలబుర్గి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సేడం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.