ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పరమేశ్వరనాయక్ హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయకుంటే కఠిన చర్యలు
Aug 9 2013 3:12 AM | Updated on Sep 1 2017 9:44 PM
సాక్షి, బళ్లారి : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పరమేశ్వరనాయక్ హెచ్చరించారు. ఆయన గురువారం జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో జిల్లా ప్రగతి పరిశీలన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యంగా పౌరసర ఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మంచినీటికి సంబంధించిన అంశాలపై కూలంకుషంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి పరమేశ్వరనాయక్ మాట్లాడుతూ పేదలకు చేరవేయాల్సిన ్రపభుత్వ పథకాలపై అధికారులు ఎట్టి పరిస్థితిల్లోనూ ఉదాసీనంగా పని చేయకూడదన్నారు. బళ్లారి జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా కావడంతో వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పనులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ పనుల్లో అవినీతి చోటు చేసుకుంటే అందుకు సంబంధించిన అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధిహామీ పనులు వేగవంతంగా అమలు చేసి కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు.
పేదలందరికీ అందాల్సిన రేషన్ బియ్యం సక్రమంంగా అందుతోందా లేదా అన్న దానిపై సంబంధిత పౌర సరఫరాల శాఖాధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. రేషన్ డీలర్ల వద్ద 25 శాతం కార్డులు ఉంటున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, రేషన్ డీలర్లపై ప్రత్యేక నిఘా ఉంచి పేదలకు అందాల్సిన బియ్యం, గోధుమలు, చక్కెర తదితరాలు సక్రమంగా అందజేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలంటే అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని పని చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయి (పల్లెలకు వెళ్లితే)లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు. అధికారులు గ్రామాలకు వెళితే అక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడతాయని, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతోందని మంచినీటి సమస్య ఏర్పడితే ప్రజలు క్షమించరన్నారు. మంచినీటి కోసం డ్యాం నుంచి నీరు తగినంత సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులందరికి విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. క్షీరభాగ్య పథకం ద్వారా విద్యార్థులకు పాలు సక్రమంగా అందజేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నాగేంద్ర, భీమానాయక్ తమ తమ నియోజకవర్గంలో ఏర్పడిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదిత్య ఆమ్లాన్ బిస్వాస్, జెడ్పీ సీఈఓ మంజునాథ్ నాయక్, జెడ్పీ అధ్యక్షురాలు సుమంగళమ్మ, ఉపాధ్యక్షురాలు మమతా సురేష్, ఎమ్మెల్యేలు నాగేంద్ర, నాగరాజు, భీమానాయక్ , ఎస్‌పీ చేతన్‌సింగ్ రాథోడ్, జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలు అధికారులు, జెడ్పీ స్థాయి సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement