
నాడు ప్రజల గడప వద్దనే సేవలు.. నేడు సర్వేలకే పరిమితం
ఆత్మగౌరవం, పెండింగ్ సమస్యలపై రోడ్లెక్కిన ఉద్యోగులు
‘మహాత్మా మా గోడు వినయ్యా’అంటూ స్టేటస్‌లతో నేడు ఆందోళనలు
గాందీజీ ఆశయాల మేరకు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగాసచివాలయాలు– వాలంటీర్ల వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం
ఐదేళ్ల పాటు ప్రజలకు ఇళ్ల దగ్గరే సచివాలయ, వలంటీర్ల సేవలు
అవినీతి, పైరవీల్లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు అమలుకు పటిష్ఠ వ్యవస్థ
అధికారం చేపట్టిన 4 నెలల్లో 1.34 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రెండు నెలలకే 2.66 లక్షల మంది వలంటీర్లు
కుగ్రామాల్లోనూ సువిశాల ఆఫీసులు, కంప్యూటర్, నెట్ వసతులు
పల్లె, పట్నం అనే తేడా లేకుండా సొంతూళ్లలోనే కోట్ల వినతులు పరిష్కారం
కూటమి ప్రభుత్వం వచ్చాక 4 నెలల్లోనే ఆ వ్యవస్థలు నిర్వీర్యం
ప్రస్తుతం సుప్తచేతన స్థితిలో గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థ
ప్రజలు మళ్లీ ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా మంగళం
కరపత్రాల పంపిణీ, సర్వే పనుల్లో బిజీగా సచివాలయాల ఉద్యోగులు
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా పౌర సేవలు, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2019 అక్టోబరు 2కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం కార్యాలయ భవనాలు లేవు.
పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ కార్యాలయాలు తప్ప మరో ప్రభుత్వ కార్యాలయం ఉండని పరిస్థితి. 4–5 పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి. కానీ, ఆ పంచాయతీ కార్యాలయాన్ని ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియదు. అలాంటి సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామంలో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి గ్రామంలో, ప్రత వార్డులో అందుబాటులోకి వచ్చారు.
» ప్రజల గడప వద్దనే సేవలు అందించేందుకు ప్రతి 50 మందికి ఓ వలంటీరును వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజూ ఉదయం 10 గంటలకే వీరంతా ప్రభుత్వ సేవలకు ప్రజలకు సిద్ధంగా ఉండేవారు. సాయంత్రం 3–5 గంటల మధ్య సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా వినతుల స్వీకరణకే కేటాయించారు. కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్‌పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్వీసులనూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ఈ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను నాడే ప్రవేశపెట్టారు.
ప్రభుత్వం మారగానే కుదేలు
16 నెలల కిత్రం వచ్చిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీరు–సచివాలయ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు మొదలుపెట్టింది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో పనిచేసిన వలంటీర్ల వ్యవస్థను లేకుండా చేశారు. వలంటీర్లు చేసిన పనులకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాల్సిన ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిఅయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోతో కూడిన స్టిక్కర్లను ఇళ్లకు అంటించే బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకే అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు
అవినీతి, పైరవీ లేకుండా సేవలు
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏ ప్రభుత్వ పథకం అమలు చేసినా ఊళ్లో ఏ ఐదు, పదిమందికో లబ్ధి దక్కేది. అది కూడా ఊళ్లో పెద్దలతో పైరవీలు చేసుకునేవారికో, లంచం ఇచ్చేవారికో అవకాశం ఉండేది. అయితే, వైఎస్ జగన్ పాలనలో సచివాలయాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధానం ప్రవేశపెట్టారు. ఎలాంటి పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావివ్వలేదు.
ఇరుకు భవనాల్లోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మోక్షం కల్పించింది. సచివాలయాల సేవలను ప్రజలకు అందించేలా ప్రతి చోటా రూ.43.60 లక్షలు ఖర్చుపెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల గ్రామ సచివాలయం భవనాలను నిర్మించారు. రూ.4,750 కోట్ల ఖర్చుతో 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా చాలాచోట నిర్మాణాలు పూర్తయ్యాయి.
వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది.వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు, భవనాల నిర్మాణానికి పరిమితం కాకుండా కార్యాలయాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పించింది.
4 నెలలకే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు
ఉమ్మడి ఏపీలో 40 ఏళ్ల కిందట మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ప్రత్యేక ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. దీంతో ప్రజలకు సమర్థంగా పథకాలు అందలేదు. సుస్థిర అభివృద్ధి (ఎస్‌డీజీ) లక్ష్యాల సాధనలో ఉమ్మడి ఏపీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే చాలా అంశాలలో వెనుకబడింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు సమర్థంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలని భావించింది. దీనికోసం కొత్తగా ఏర్పాటు చేసిన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసింది.
4 నెలల్లోనే భర్తీ ప్రక్రియను ముగించింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వాలంటీర్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్ నిర్మాణం చేపట్టింది.
యునిసెఫ్ సైతం భాగస్వామ్యం
ఐక్యరాజ్యసమితి అనుబంధ యునిసెఫ్ కూడా ఏపీలో సుస్థిర అభివృద్ధి, లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. కోవిడ్ విపత్తు సమయంలో రాష్ట్రంలో ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండడానికి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక కారణం అని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది.
విపత్తు వేళ వాలంటీర్లు–సచివాలయాల సిబ్బంది మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రమంతా ఇంటింటి సర్వేలు దాదాపు 30 విడతల పాటు నిర్వహించడం గమనార్హం. యునిసెఫ్‌తో పాటు కేంద్రం ప్రశంసలతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామ, వార్డు సచివాలయాలను తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు ఏపీలో పరిశీలన చేశాయి.
నాడు...
ఆరేళ్ల క్రితం అక్టోబరు 2న దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక కార్యక్రమం. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో గాం«దీజీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అంకురార్పణ. ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలను ప్రజలకు గడప వద్దనే అందించడమే లక్ష్యంగా పనిచేశాయి...! కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూశాయి. అంకితభావంతో విధి నిర్వహణతో గాం«దీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యానికి నిలువుటద్దంలా నిలిచాయి.
నేడు...
గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల సేవల కన్నా ప్రభుత్వ పెద్దలు చెప్పే ఇంటింటి సర్వేలకు పరిమితం అయ్యాయి. ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆత్మగౌరవం దక్కితే చాలని భావించే దుస్థితి. తమ డిమాండ్ల సాధనకు వారం, పది రోజులుగా నిరసనలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేరు. రోడ్లపైకి వచ్చి, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్న వీరు... గురువారం దసరా పండుగ నాడు ‘మహాత్మా మా గోడు వినయ్యా’అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.
1.34 లక్షల ఉద్యోగాల భర్తీ దేశంలో ఇప్పటికీ రికార్డే
2019 జూలై–అక్టోబరు మధ్య 1.34 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. యువత కూడా అంత పెద్ద సంఖ్యలో ఒకేసారి పరీక్షలు రాయడం దేశ చరిత్రలోనే లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రేషనలైజేషన్ పేరిట ఉద్యోగుల కుదింపు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో 10–11 మంది చొప్పున పనిచేసేలా సచివాలయాలు ఏర్పాటు కాగా, కూటమి ప్రభుత్వం... వాటి పరిధిలో నివాసం ఉండే జనాభా ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను 6–8కి మధ్యకు పరిమితం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో నిత్యం ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలను అందించే వీఆర్వోలు, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గతంలో ఒక్కో సచివాలయంలో ఒక్కొక్కరు చొప్పన పనిచేశారు.
కానీ, ఆయా కేటగిరీ ఉద్యోగులను 2, 3 సచివాలయాలకు ఒకరు చొప్పున తగ్గించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియ తిరిగి చాలా గ్రామాల్లో కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు విఘాతం కలిగిస్తుందన్న విమర్శలున్నాయి. దీనికితోడు ఆరేళ్ల క్రితం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో సరఫరా చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం కొత్తవి సరఫరా చేయడం లేదని ఉద్యోగ సంఘాల పేర్కొంటున్నాయి.