కన్నీళ్లకే కన్నీరొచ్చే.. | Sin of poverty | Sakshi
Sakshi News home page

కన్నీళ్లకే కన్నీరొచ్చే..

Sep 9 2014 3:03 AM | Updated on Aug 17 2018 7:49 PM

ఎంత శ్రమించిన పూట గడవడమే కష్టం... దీనికి తోడు ఎంత ఖర్చు పెట్టినా నయం కాని దీర్ఘకాలిక వ్యాధులు! మరో వైపు భర్త తాగుడు వెరసి జీవితంపై విరక్తి పెంచుకున్న ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో...

  • వీడని పేదరికం  
  • వెంటాడిన వ్యాధులు
  •  వేధించిన భర్త తాగుడు
  •  పిల్లలతో సహా కాలువలో దూకిన తల్లి
  • మండ్య : ఎంత శ్రమించిన పూట గడవడమే కష్టం... దీనికి తోడు ఎంత ఖర్చు పెట్టినా నయం కాని దీర్ఘకాలిక వ్యాధులు! మరో వైపు భర్త తాగుడు వెరసి జీవితంపై విరక్తి పెంచుకున్న ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నెలమనె సమీపంలో ఉన్న హనుమంత నగరకు చెందిన రాము, కెంపమ్మ(31) దంపతులు. వీరికి విజయ్ (3), జ్యోతి(6), పల్లవి(7) పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు దంపతులిద్దరూ కూలీ పనులు చేసేవారు. కెంపమ్మకు చాలా కాలంగా చర్మ, మూర్ఛ వ్యాధులతో బాధపడుతోంది.

    ఈ వ్యాధుల బారిన పిల్లలు కూడా పడ్డారు. ఎందరు డాక్టర్లకు చూపినా వ్యాధులు నయం కాలేదు. రోజురోజుకూ మందుల ఖర్చుల ఎక్కువవుతోంది. సంపాదన మాత్రం పెరగలేదు. వ్యాధి తీవ్రత ఉన్న సమయంలో కెంపమ్మ పనికి వెళ్లలేకపోయేది. ఆ సమయంలో ఆ కుటుంబానికి ఒక పూట మాత్రమే భోజనం దక్కేది. కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకున్న భర్త మద్యానికి బానిసై తన సంపాదన మొత్తాన్ని తాగుడుకే ఖర్చు పెట్టసాగాడు.

    ఆ వ్యసనాన్ని వీడి కుటుంబ పోషణకు సహకరించాలని పలుమార్లు భార్య వేడుకున్నా ఫలితం లేకపోయింది. వ్యాధి తీవ్రత ఎక్కువై భరించలేని స్థితికి చేరుకుంది. వైద్యం చేయించుకునేందుకు డబ్బు ఇచ్చి సహకరించాలని తన తల్లి జయమ్మను కెంపమ్మ వేడుకుంది. మూడ్రోజుల్లో డబ్బు సర్దుతానని ఆమె చెప్పడంతో కెంపమ్మకు దిక్కుతోచలేదు. చర్మ వ్యాధి తీవ్రతను తట్టుకోలేక చిన్నారులు ఏడుస్తుంటే తల్లి హృదయం తల్లడిల్లింది. ఆదివారం సాయంత్రం సీడీఎస్ కాలువను చేరుకుని పిల్లలతో సహ దూకింది.

    సోమవారం ఉదయానికి పాండవపుర తాలూకాలోని దేవెగౌడనకొప్పలు - చిక్కాడ సమీపంలో విజయ్ మృతదేహం తేలింది. మధ్యాహ్నానికి కొడలకుప్పె సమీపంలో దొడ్డబట్ట వద్ద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌పి భూషన్ జి.బోరసే, సీఐ దీపక్, ఎస్‌ఐ బి.జి.కుమార్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement