ఇటీవలి కాలంలో పాఠశాలల్లో చిన్నారులపై జరుగుతున్న అత్యాచార సంఘటనలు ఆయా పాఠశాలలకే కాక సమాజానికి సైతం సిగ్గు చేటని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.
అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : ఇటీవలి కాలంలో పాఠశాలల్లో చిన్నారులపై జరుగుతున్న అత్యాచార సంఘటనలు ఆయా పాఠశాలలకే కాక సమాజానికి సైతం సిగ్గు చేటని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. బాలల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన ‘బాలల హక్కుల పార్లమెంట్-బాలలతో ముఖ్యమంత్రితో బాలల సంవాదం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల నుంచి మొత్తం 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... ‘అభం, శుభం ఎరుగని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడడం కంటే హీనమైన చర్య మరోటి లేదు. ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారి కంటే వృుగాలే నయం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఈ తరహా ఘటనలు నన్ను చాలా బాధించాయి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడులను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. చిన్నారులపై దాడి ఘటనలను నిరోధించడంలో ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో, సమాజం పాత్ర కూడా అంతే ఉంది. మన దేశంలో చిన్నారులను దేవుళ్లుగా భావించే సంృ్కతి ఉంది. అందుకే బాధ్యత గల ప్రతి పౌరుడు పిల్లలను, వారి అభిప్రాయాలను గౌరవించాలి’ అని అన్నారు.
చిన్నారుల హక్కులపై అందరిలోనూ అవగాహనను కల్పించడంలో భాగంగానే గ్రామీణ స్థాయి నుంచి ‘మక్కళ గ్రామీణ సభ’ (బాలల గ్రామ సభ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు కాన్వెంట్‌లో చదివితేనే తమకు గౌరవం అన్నట్లుగా భావిస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదని అదే సందర్భంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.
నేటి బాల నేతలే... రేపటి ప్రజానేతలు...
ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాలలను రేపటి ప్రజానేతలంటూ అభివర్ణించారు. ‘మీరు ఒక్కో జిల్లా నుంచి ఆయా జిల్లాలోని బాలల ప్రతినిధులుగా ఎన్నికై వారి సమస్యలపై చర్చించేందుకు ఇక్కడి వరకు వచ్చారు. అలాగే భవిష్యత్‌లో కూడా ప్రజల కోసం పనిచేసేందుకు మీరు ప్రజాప్రతినిధులుగా ఎంపికై ఇదే విధానసౌధకు రావచ్చు.
అప్పుడు ప్రజలందరి సంక్షేమం కోసం మీరు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సేకరించిన రూ.25 లక్షల మొత్తాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మన రత్నాకర్ ముఖ్యమంత్రికి అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉమాశ్రీ, యూటీ ఖాదర్, ఆంజనేయ, టీబీ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.