కాలమే కరిగిపోయింది !

Short Film On Traffic Problems - Sakshi

సిల్క్‌ బోర్డు ట్రాఫిక్‌పై ఆకట్టుకున్న లఘుచిత్రం

దర్శకుడి సృజనాత్మక ప్రతిభ

నరక కూడలి సిల్క్‌బోర్డు ఐదు కి.మీ మూడు గంటల ప్రయాణం!

బొమ్మనహళ్లి :బెంగళూరు మహా నగరంలో ట్రాఫిక్‌ రద్దీకి అంద రూ బాధితులే. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. కొన్ని సందర్భాల్లో అయిదు కిలోమీటర్ల దూరంలోని గ మ్యాన్ని చేరుకోవడానికి మూడు గంటలు రోడ్డుపైనే ట్రాఫి క్‌లో చిక్కుకోవడం నగర పౌరులకు అనుభవపూర్వకమే. సృజనాత్మకత కలిగిన ఓ దర్శకుడు సరిగ్గా ఈ ట్రాఫిక్‌ స మస్యపైనే 12 నిమిషాల లఘు చిత్రం తీసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సిల్క్‌ బోర్డు అనే ఈ లఘు చిత్రం వారం కిందటే జన బాహుళ్యంలోకి వచ్చినా, ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది దానిని వీక్షించారు.

నరక కూడలి సిల్క్‌ బోర్డు   
హొసూరు మార్గంలోని సిల్క్‌ బోర్డు కూడలి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ గురించి తలుచుకుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. సుమారు 20 ఏళ్ల కిందట అక్కడ ఫైఓవర్‌ నిర్మించినా, వాహన చోదకులకు కొద్ది కాలం పాటు మాత్రమే ఉపశమనం లభించింది. ఎలక్ట్రానిక్‌ సిటీ, మారతహళ్లి, సర్జాపుర, బీటీఎం లేఔట్‌ లాంటి ఐటీ హబ్‌లకు ఇది మార్గం కావడమే ట్రాఫిక్‌ రద్దీకి కారణం.

చిత్రం ఇతివృత్తం
దర్శకుడు సంతోష్‌ గోపాల్‌ ఈ లఘు చిత్రాన్ని తీశారు. ప్రకాశ్‌ అనే యువకుడు సిల్క్‌ బోర్డు జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుంటాడు. అదే సమయంలో అతని ఇంటికి పెళ్లి చూపులకని వధువు తరఫున వారు వస్తారు. ఈ సమాచారాన్ని తండ్రి ఫోన్‌ ద్వారా ప్రకాశ్‌కు చేరవేస్తాడు. చాలా సేపటికి కూడా ప్రకాశ్‌ సిల్క్‌ బోర్డు కూడలి వద్దే ఉన్నాడని తెలియడంతో వధువు తరఫున వారు నిష్క్రమిస్తారు. అయితే ఇక్కడ... హారన్ల రణగొణ ధ్వనులు, ప్రజా సమూహం రద్దీ మధ్య మిథిల అనే అమ్మాయి, ప్రకాశ్‌ దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకరినొకరు పలకరించుకుని, తమ గురించి ఉభయులూ తెలుసుకుంటారు. ఇదే సమయంలో ప్రకాశ్‌ ఆమెను పెళ్లాడతానని ప్రతిపాదిస్తే. ఆమే సరేనంటుంది. అక్కడే పెళ్లి కూడా జరిగిపోతుంది. దంపతులు ప్రకాశ్‌ ఇంటికి వెళ్లే సమయానికి వారికి పండంటి బిడ్డ కూడా కలుగుతాడు. తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పడానికి ప్రకాశ్‌ ప్రయత్నించినప్పుడు, అప్పటికే ఆయన నిద్రలోకి జారుకుని ఉంటాడు. ప్రకాశ్‌గా రాకేశ్‌ మైయా, మిథిలగా సువిన్‌ విల్సన్‌ నటించారు.

ఆరు రోజుల షూటింగ్‌
ఈ లఘు చిత్రం షూటింగ్‌ను ఆరు రోజుల్లో ముగించారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌ను ప్రారంభించి, సాయంత్రం ఆరు గంటలకు ముగించేవారు. దీని బడ్జెట్‌ రూ.25 వేలు. గత ఏడాది డిసెంబరులో ఈ చిత్రం ఆలోచన తట్టిందని దర్శకుడు సంతోష్‌ తెలిపారు. జనవరి 30న షూటింగ్‌ మొదలు పెట్టామని, ఆ రోజే పూర్తవుతుందని అనుకున్నామని చెప్పారు. అయితే మరిన్ని షూట్లు అవసరమవుతాయని ఆ తర్వాత తెలుసుకున్నామని పేర్కొన్నారు. మార్చిలో షూటింగ్‌ను పూర్తి చేశామన్నారు. తానో ఎంఎన్‌సీలో పనిచేసేవాడినని, రోజూ సిల్క్‌ బోర్డు మీదుగానే పని వెళ్లాల్సి ఉన్నందున, తనకిది వ్యక్తిగత అనుభవమేనని వివరించారు. షూటింగ్‌ సందర్భంగా తాము అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. వివాహ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు, అది నిజమైన వివాహమేనని భావించిన అటు వైపు వెళ్లే వారు, కొత్త దంపతులతో సెల్ఫీలు, వీడియోలు, ఫొటోలు కూడా తీసుకున్నారని ఆయన నవ్వుతూ చెప్పారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top